ప్రారంభ సంరంభానికి 40 వేల మంది | World Telugu Conference 2017, Telangana State

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

ప్రారంభ సంరంభానికి 40 వేల మంది

ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రారంభోత్సవ సంరంభం జరిగే హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియాన్ని సుందరంగా అలంకరించనున్నారు. ప్రారంభ కార్యక్రమంలో దాదాపు 40 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 15న సాయంత్రం మహాసభలు ప్రారంభమవుతాయి. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజవుతున్నారు. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు అతిథులు కాగా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌అలీలు, శాసనసభాపతి మధుసూదనాచారి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, నిర్వహణ ప్రధాన కమిటీ సభ్యులు వేదికను అలంకరించనున్నారు.

WTC - Telugu Literators

అమాత్యులు, ఎంపీలకు ప్రత్యేక గ్యాలరీ
సాంస్కృతిక కళాప్రదర్శనలకు మరో వేదిక ఉంటుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కమిషన్లు, కార్పొరేషన్ల ఛైర్మన్లు తదితర 100 మందికి ప్రత్యేక గ్యాలరీ ఉంటుంది. 200 మంది కవులకు, పండితులకు ఒక గ్యాలరీ, 300 మంది విదేశీ అతిథులు, ఇతర రాష్ట్రాల అతిథులకు ఒకటి, 120 మంది ప్రత్యేక ఆహ్వానితులకు మరో గ్యాలరీ ఉంటాయి. దీంతో పాటు 7వేల మంది ప్రతినిధులకు మరో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. వీరుగాక సాధారణ సందర్శకులు 30 వేల మంది కూర్చునే సౌకర్యం ఉంటుంది. సభకు కుడివైపున భారతీయ పురావస్తు, చేనేత, సాంస్కృతిక, హస్తకళలు ఇతర శాఖల ద్వారా ఎనిమిది ప్రదర్శనశాలలు ఉంటాయి. వీటిలో ప్రదర్శనలను ప్రారంభ సమయంలో ప్రముఖులు సందర్శిస్తారు. సభ ముగిశాక సాధారణ ప్రేక్షకులను అనుమతిస్తారు. స్టేడియంలోకి రాకపోకలకు ప్రముఖులకు మూడు ద్వారాలను కేటాయిస్తారు. ప్రతినిధుల కోసం మూడు ద్వారాలుంటాయి. సాధారణ ప్రేక్షకుల కోసం ఎనిమిది ద్వారాలుంటాయి. ప్రముఖులైన అతిథుల స్వాగతానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

స్టేడియంలో భారీ అలంకరణలు
ప్రారంభోత్సవం సందర్భంగా ఎల్బీ స్టేడియాన్ని భారీఎత్తున అలంకరించనున్నారు. ప్రాంగణంలో భారీ కటౌట్లను పెడతారు. చుట్టూ ఉన్న స్తంభాలకు తెలంగాణ కవులు, చరిత్రకారులు, రచయితలు, వైతాళికుల చిత్రాలను అమర్చనున్నారు. స్టేడియంచుట్టూ ప్రత్యేక అంలకరణలు చేస్తారు. అంతటా ఎల్‌ఈడీ ఎలక్ట్రానిక్‌ తెరలుంటాయి. ప్రారంభోత్సవం నాడు నగరవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాలను తిలకించేందుకు వీలుగా తెరలను ఏర్పాటు చేస్తారు. ఇదేరోజు లేజర్‌ షో ఉంటుంది. బుడగలను ఎగురవేస్తారు. పెద్దఎత్తున బాణసంచాను కాల్చుతారు.

రాష్ట్రపతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ఈనెల 19న జరిగే ముగింపు వేడుకలకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. ఆయన రాకను పురస్కరించుకొని రోజు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. స్టేడియానికి అదనపు హంగులు కల్పిస్తారు.

Source: http://www.eenadu.net/news/news.aspx?item=ts-main-news&no=3