మహాసభలంటే తెలుగు పండగ – తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు ఛైర్మన్‌ అయాచితం శ్రీధర్‌ | World Telugu Conference 2017, Telangana State

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

మహాసభలంటే తెలుగు పండగ – తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు ఛైర్మన్‌ అయాచితం శ్రీధర్‌

Ayachittam Sridhar - World Telugu Conferences 2017‘రాష్ట్రంలోని గ్రంథాలయాలు ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక కేంద్రాలుగా పని చేస్తున్నాయి. భాషా, సాహిత్యాభిమానులు మహాసభలకు హాజరయ్యేలా.. సాధారణ ప్రజలు సైతం పాల్గొనేలా రాష్ట్రవ్యాప్తంగా వివిధ పద్ధతుల ద్వారా సన్నద్ధం చేసే బాధ్యతను గ్రంథాలయ పరిషత్తు తీసుకుంది’ అని చెబుతున్నారు తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు ఛైర్మన్‌, మహాసభల వ్యూహ సంఘం సభ్యుడు అయాచితం శ్రీధర్‌. ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని ఆయన ‘ఈనాడు’తో వివిధ అంశాలపై మాట్లాడారు. ఆ వివరాలివీ..

తెలుగు మహాసభల విజయవంతానికి గ్రంథాలయ పరిషత్తు చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి?
రాష్ట్రంలోని 568 శాఖా, జిల్లా గ్రంథాలయాలు, వరంగల్‌, నిజామాబాద్‌లోని ప్రాంతీయ, హైదరాబాద్‌లోని కేంద్ర గ్రంథాలయం మహాసభల సన్నాహాక కేంద్రాలుగా, కార్యాలయాలుగా గత కొద్ది రోజులుగా పని చేస్తున్నాయి. చాలా జిల్లాల్లో కలెక్టర్లు గ్రంథాలయాలనే మహాసభల కార్యాలయాలుగా వినియోగించుకుంటున్నారు. తెలుగు పండితుల సమావేశాలు, కవి సమ్మేళనాలు, కళారూపాలు, ప్రదర్శనలు, మహిళలకు ముగ్గులు, బతుకమ్మ తదితర పోటీలు, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, పాటల పోటీలు, యువతకు ఇండోర్‌ గేమ్స్‌ నిర్వహిస్తున్నాం. వీటికి ఆయా జిల్లాల మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతున్నారు. మహాసభల సమాచారాన్ని ఉద్యోగులు పాఠకులకు, ప్రజలకు అందిస్తున్నారు.

గతంలో గ్రంథాలయాలే ఉద్యమానికి ఆలంబనగా ఉండేవి. ఈ మహాసభల్లో ఆహుతులకు మీరు ఏం చెప్పబోతున్నారు?
వర్తమాన, భవిష్యత్తు తరాలకు సాహిత్యం, చరిత్ర.. తదితరాల్ని అందించే వాహకాలుగా గ్రంథాలయాలు ఉపయోగపడతాయి. ప్రపంచ ప్రసిద్ధులు ఎవరినైనా గమనించండి వారికి గ్రంథాలయాలు, పుస్తకాలతో అవినాభావ సంబంధం ఉంటుంది. 1946-52 కాలంలో తెలంగాణ తొలిదశ ఉద్యమానికి గ్రంథాలయాలే ఉద్యమ కేంద్రాలుగా ఉన్నాయి. ఆనాటి భాగ్యరెడ్డివర్మ, మాడపాటి హనుమంతురావు, సురవరం ప్రతాపరెడ్డి, రావిచెట్టు రంగారావు, వట్టికోట అల్వార్‌స్వామి, దాశరథి కృష్ణమాచార్య, రావి నారాయణరెడ్డి, సంఘం లక్ష్మీబాయమ్మ తదితరులు గ్రంథాలయ ఉద్యమంతో పెనవేసుకున్న వారే. ఈ మహాసభల్లో ప్రధాన వేదిక ఎల్‌బీ స్టేడియంలో సమాచార కేంద్రం, ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలోని పురాతన గ్రంథాలయాలు, అరుదైన పుస్తకాల చిత్రాలను ఉంచబోతున్నాం. తెలంగాణ గ్రంథాలయ వైభవాన్ని తెలుపుతాం.

తెలుగు మహాసభలంటే కేవలం భాషను బతికించుకోవడమేనా?
మహాసభలంటే కేవలం భాషకు సంబంధించిన సభలు కాదు. తెలుగువారి సాహిత్యం, సంస్కృతి, కళలు, సమాజ జీవితం లాంటి ఎన్నో అంశాలను ప్రతిబింబిస్తాయి. ఇతర దేశాలు, రాష్ట్రాల్లోని తెలుగు వారెందరో హాజరవుతున్నారు. వారందరితో కలిసి జరుపుకునే తెలుగు పండగ ఇది. ఒకరికి ఒకరం మేమున్నామని చెప్పుకుంటాం.

ఇతర రాష్ట్రాల్లో సన్నాహక సభలకు మీరు హాజరయ్యారు. వారి స్పందన ఏమిటి?
నేను రాష్ట్ర దూతల్లో ఒకరిగా బెంగళూరు, విజయవాడలో సన్నాహక సభలకు హాజరయ్యాను. మహాసభలు జరుపుతున్నందుకు వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 40 ఏళ్ల క్రితం రద్దు చేసిన సాహిత్య అకాడమీని పునరుద్ధరించడం, జానపద సంగీత నాటక అకాడమీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం, ఒకటి నుంచి ఇంటర్‌ వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా తప్పనిసరిగా చేయడంపై అక్కడి తెలుగు వారు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశంసించారు.

తొలి తెలుగు మహాసభలకు విద్యార్థిగా హాజరయ్యారు. అప్పటికి, ఇప్పటికీ వచ్చిన మార్పు ఏమిటి?
1975లో హైదరాబాద్‌లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభలకు ఇంటర్‌ చదువుతూ హాజరయ్యాను. ఆ తర్వాత రెండు, మూడో మహాసభలకు హాజరు కాలేదు. తిరుపతిలో జరిగిన సభలను మేం బహిష్కరించాం. ఒకసారి విద్యార్థిగా హాజరైతే…ఇప్పుడు సభల నిర్వాహక సంఘంలో సభ్యుడిగా ఉండి పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది. ఈ సభల ద్వారా ఇతరులను తక్కువ చేయడం మా ఉద్దేశం కాదు.. తెలంగాణ మహానీయులకు పెద్దపీట వేస్తున్నాం.

Source: http://www.eenadu.net/news/news.aspx?item=ts-state-news&no=4