దుబాయిలో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశం | World Telugu Conference 2017, Telangana State

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

దుబాయిలో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశం

సుసంపన్న సాహిత్య వారసత్వం కలిగిన భాషగా తెలుగు భాష కీర్తి పొందిందని తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ అన్నారు. తెలంగాణలోని తెలుగుభాష మరింత పరిఢవిల్లాలనే గొప్ప ఆశయంతో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తోందన్నారు.  దుబాయిలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం ద్వారా గల్ఫ్ లోని తెలుగువారందరికీ రసమయి ఆహ్వానం పలికారు. తెలుగువారందరూ మహా సభలకు తరలిరావాలని కోరారు.

MLA Rasamai Balakishan at Dubai for preparatory meeting of World Telugu Conferences 2017దుబాయిలోని కాన్సులేట్ జనరల్ అఫ్ ఇండియా కార్యాలయం సమావేశ మందిరంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రపంచ మహాసభల సన్నాహక సమావేశానికి హాజరై ప్రభుత్వ పక్షాన హాజరై మాట్లాడుతూ గల్ఫ్ దేశాల్లోని తెలుగు సాహిత్యాభిమానులు 2017 డిసెంబర్ 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు హైదరాబాద్ నగరంలో నిర్వహించే ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలుగు భాషాభివృద్ధిలో తెలంగాణ ప్రజలు, కవులు, పండితుల పాత్ర విశిష్టమైనదని, ప్రత్యేక దృష్టి సారించకపోవడం వల్ల ఆ దిశలో సరైన అధ్యయనం జరగలేదన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం ద్వారా తెలుగు సాహితీ వికాసంలో తెలంగాణ వారి మహత్తర కృషి లోకానికి చాటిచెప్పాలని, తెలంగాణ సాహిత్య వైభవాన్ని, మహాకవుల విశేష ప్రతిభను ప్రపంచం దృష్టికి తేవాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. శిష్ట సాహిత్యంతో పాటు జానపద జీవధారలకు తెలంగాణ పుట్టినిల్లని రసమయి అన్నారు. అక్షర జ్ఞానంలేని గ్రామీణ శ్రామికుల నోటినుంచి ఆశువుగా అందమైన మట్టి పదాలతో పరిమళాలను వెదజల్లే జానపద గీతాలు తెలంగాణకు నిధులని అన్నారు.

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేసిన మహాకవుల పేరున తోరణాలు, స్వాగత ద్వారాలు, హోర్డింగులు, నగరం నిండా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. మహాసభల్లో పాల్గొనే విదేశీ ప్రతినిధులకు మంచి వసతి సౌకర్యం, ఉచిత భోజన ఏర్పాటు, స్థానిక రవాణాను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రారంభ సమావేశానికి భారత ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా, ముగింపు రోజున రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విచ్చేస్తున్నారని చెప్పారు. సభల్లో పాల్గొనేందుకు ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా ప్రతినిధిగా పేరు నమోదు చేసుకోవాలని గల్ఫ్ దేశాల్లోని తెలుగు సాహిత్యాభిమానులను కోరారు.

కార్యక్రమానికి తెలంగాణ జాగృతి, ఎమిరేట్ తెలుగు సాంస్కృతిక సంఘం, శ్రీకారం సంస్థ, సంప్రదాయం సాంస్కృతిక సంస్థ, గల్ఫ్ తెలంగాణ అసోసియేషన్, దుబాయ్ రసమయి సంస్థ, అబుదాబి తెలుగు కళాస్రవంతి సంస్థల కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. దుబాయిలోని ప్రముఖ తెలుగు న్యాయవాది అనురాధారెడ్డి, సంస్థల ప్రతినిధులు సత్యనారాయణ గాంధారి, అరవింద్ కుమార్, వెంకటేశ్వర్లు, మంచుకొండ, రవికుమార్ రాజు, నరేశ్ భరద్వాజ్, శ్రీనివాస్ ఏలేటి, నరేశ్ మన్యం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సమావేశం ప్రారంభంలో దుబాయిలో స్థిరపడిన తెలుగు కుటుంబాల పిల్లలు అద్భుతమైన తెలంగాణ సంప్రదాయ నృత్యరీతులను ప్రదర్శించారు. బతుకమ్మ, బోనాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. సుమారు 200 మంది తెలుగువారు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక మరియు సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మంచుకొండ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తెలంగాణ ఎన్.ఆర్.ఐ శాఖ మంత్రి కేటీఆర్ పేరిట గల్ఫ్ సమస్యలపై నివేదికను రసమయి బాలకిషన్ కు అందజేశారు.

Source: http://www.24x7onlinenews.com/world-telugu-conference-warm-up-meeting-in-dubaii-rasamai-balkishan/