కీర్తిని చాటేలా తెలుగు మహాసభలు - World Telugu Conference 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

కీర్తిని చాటేలా తెలుగు మహాసభలు

world-telugu-conference
ప్రపంచ తెలుగు మహాసభలకు తెలంగాణ మాగాణం సిద్ధమవుతున్నది. కొత్తరాష్ట్రంలో డిసెంబరు 15 నుంచి 19 వరకు తొలిసారిగా నిర్వహించే ఈ మహాసభలకు దేశ విదేశాల్లోని తెలంగాణవారు, తెలుగుభాషాభిమానులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. ఇందుకోసం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ… ఎల్బీ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నది. తెలంగాణ కీర్తిని చాటేలా వీటిని నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. మహాసభలు పుస్తకప్రియులకు, సాహిత్యాభిమానులకు పండుగగా మారనున్నాయి. ఈ సందర్భంగా ప్రామాణికమైన సాహిత్యాన్ని ప్రచురించేందుకు కార్యాచరణ సిద్ధమయింది. సాహిత్య అకాడమీ పుస్తక ప్రచురణ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించే అవకాశం ఉన్నందున, మహాసభల సందర్భంగా ప్రాధాన్యం ఉన్న పుస్తకాలను ప్రచురించాలని నిర్ణయించారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ పటం మీద చాటిచెప్పిన తెలంగాణ వైతాళికుల సమగ్ర జీవితచరిత్రను, వారి విశేషకృషిని తెలియజేసే 51 మోనోగ్రాఫ్‌లను తీసుకొస్తున్నారు. తెలంగాణ కీర్తిపతాకాన్ని దశదిశలా ఎగురవేసిన వట్టికోట ఆళ్వార్‌స్వామి, దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య, మఖ్ధూం, భాగ్యరెడ్డివర్మ, మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, పీవీ నరసింహారావు వంటి తెలంగాణ చరిత్ర దిగ్గజాల పుస్తకాలు భాషాభిమానుల చేతుల్లోకి రానున్నాయి. తెలుగు విశ్వవిద్యాలయం సారథ్యంలో విశిష్ట సంచికను ప్రచురించనున్నారు. శతాబ్దాల తెలంగాణ సాహిత్యచరిత్రకు ప్రతీకలై నిలిచిన అపురూపమైన పుస్తకాలన్నీ ఒకేచోట కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడనున్నది.

అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించి 31 జిల్లాల దర్శినిలను ప్రచురించనున్నారు. రాష్ట్ర సమాచారశాఖ సారథ్యంలో వస్తున్న తెలంగాణ డిసెంబర్ సంచికను ప్రపంచ తెలుగు మహాసభల సంచికగా తీసుకవస్తున్నారు. ఎల్బీ స్టేడియతోపాటు రవీంద్రభారతి, ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం, భారతీయ విద్యాభవన్, త్యాగరాయగానసభ, హరిహరకళాభవన్ వంటి వేదికల్లో సాహిత్య గోష్ఠులు, కవిసమ్మేళనాలు వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశ, విదేశాల్లో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదుస్సులు నిర్వహించేందుకు కోర్‌కమిటీ సభ్యుల పర్యటనలు ప్రారంభమయ్యాయి. సీఎం కార్యాలయం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ ఆస్ట్రేలియాలో, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, శాసనసభ్యులు రసమయి బాలకిషన్ దుబాయ్ తదితర అరబ్‌దేశాల్లో పర్యటించనున్నారు. బిగాల మహేశ్ యూఎస్, యూరప్‌దేశాల్లోని తెలంగాణ భాషాభిమానులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అమెరికా, కెనడా, లండన్, దక్షిణాఫ్రికా, సింగపూర్, మలేషియా తదితర దేశాల్లో సన్నాహక సదస్సులను నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం కోర్‌కమిటీ సభ్యులు సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ అయాచితం శ్రీధర్, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ, అధికారభాషా సంఘం చైర్మన్ దేవులపల్లి ప్రభాకర్‌రావు, ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ ప్రతిరోజూ సమావేశం అవుతున్నారు. ఎప్పటికప్పుడు కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగుతున్నారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/telangana-is-preparing-for-world-telugu-conferences-1-2-559453.html