తెలుగు వెలుగులు. కాసేపట్లో ప్రారంభం - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలుగు వెలుగులు.. కాసేపట్లో ప్రారంభం

telugu-mahasabaluతెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఎల్బీ స్టేడియంలో పాల్కురికి ప్రాంగణం, బమ్మెర పోతన వేదికపై తెలుగు మహాసభలను ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. విశిష్ట అతిథులుగా తెలంగాణ గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రపంచ తెలుగు మహాసభలకు అధ్యక్షత వహించనున్నారు. ప్రధాన వేదికైన ఎల్బీ స్టేడియంతో పాటు ప్రధాన వేదికలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.
ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఆదిలాబాద్ నుంచి ప్రపంచస్థాయికి ఎదిగిన డా.రాధా రాజారెడ్డి మన తెలంగాణ నృత్యరూపకం ప్రారంభసభలకు హైలైట్‌గా నిలువనున్నది. అనంతరం రామాచారి బృందం పాటలకచేరి ఉంటుంది.

జయ జయోస్తు సంగీత నృత్యరూపకాన్ని కళాకృష్ణ బృందం ప్రదర్శించనుంది. సాయంత్రం ఆరు గంటలకు తెలుగు విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ అధ్యక్షతన సాంస్కృతిక సమావేశం నిర్వహిస్తారు. దీనికి ముఖ్యఅతిథిగా నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు, గౌరవ అతిథిగా చెన్నైకి చెందిన ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్ హాజరవుతారు. ప్రధానవేదికైన ఎల్బీస్టేడియంలో కాకతీయుల కాలం నుంచి ప్రాచీన శిల్ప కళాకృతులు.. తెలంగాణ ప్రాంతంలోనే అనేక ఆలయాల నమూనాలను ఏర్పాటుచేశారు. తెలంగాణ పల్లెసీమలను తలపించే విధంగా స్టాళ్లను నెలకొల్పారు. తెలుగుకు ప్రాచీన హోదా కల్పించడానికి కారణమైన జినవల్లభుని కురిక్యాల శాసనం నమూనాను మహా సభల వేదిక సమీపంలో ఏర్పాటు చేశారు. శాసనంలోని కందపద్యాలను తప్పనిసరిగా వేదిక సమీపంలో ప్రదర్శించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ శాసనాన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలిపారు. శాతవాహనుల కోటిలింగాలలో లభించిన నాణేలతోపాటు, ఫణిగిరి నాణేలు, అసఫ్‌జాహీల కాలంనాటి నాణేలను ప్రదర్శించనున్నారు.

Source: https://www.ntnews.com/telangana-news/world-telugu-conference-start-soon-1-1-551194.html