ముమ్మరంగా తెలుగు సన్నాహక సమావేశాలు | World Telugu Conference 2017, Telangana State

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

ముమ్మరంగా తెలుగు సన్నాహక సమావేశాలు

హైదరాబాద్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలకు ఇక 20 రోజులే ఉండటంతో సన్నాహక సదస్సులు ఊపందుకున్నాయి. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు డిసెంబర్ 19న జరిగే ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ హాజరుకానున్నారు. డిసెంబర్ 15 నుంచి 19 వరకు జరిగే మహాసభలకు 30 దేశాల నుంచి తెలుగు భాషాభిమానులు ప్రతినిధులుగా హాజరవుతున్నారు. ఈ నెల 30 నుంచి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లతో సమావేశాలు జరుగనున్నాయి. ఈ నెల 27 నుంచి రాష్ట్రస్థాయి వ్యాసరచన, వక్తృత్వం, పద్యపఠన పోటీలు ఉంటాయి. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ అయాచితం శ్రీధర్ సారథ్యంలో ఈ నెల 30న జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లతో విస్తృత స్థాయి సమావేశం జరుగనున్నది. డిసెంబర్ ఒకటి నుంచి 10 వరకు అన్ని జిల్లాల్లో సన్నాహక సమావేశాలు జరుగనున్నాయి. గ్రంథాలయశాఖ డైరెక్టర్ రమణకుమార్ జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ల సమావేనికి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఈ నెల 27 నుంచి హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి వ్యాసరచన, వక్తృత్వం, పద్య పఠనం పోటీలు జరుగనున్నాయి.

31 జిల్లాల్లో జరిగిన పోటీల్లో మొదటిస్థానం సాధించిన విద్యార్థులతో ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటల నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రస్థాయి పోటీల విజేతలకు డిసెంబర్ 15 నుంచి జరిగే ప్రపంచ మహాసభల వేదికలపై బహుమతులు ఇచ్చి సత్కరిస్తారు. విద్యార్థుల్లో పద్యపఠనంపై అభిరుచి పెంచాలనే ఉద్దేశంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్టు భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. తెలంగాణ ప్రాంతం ప్రత్యేకతలు, సంస్కృతి, పండుగలు ఇతివృత్తంగా ఉండే లఘుచిత్రాల (షార్ట్‌ఫిలిమ్స్) పోటీలు నిర్వహించనున్నట్టు, వీటి ఎంట్రీలను డిసెంబర్ 10 వరకు తీసుకోనున్నట్టు మామిడి హరికృష్ణ పేర్కొన్నారు. ఎంపికైన చిత్రాలను రవీంద్రభారతి ప్రివ్యూ థియేటర్‌లో ప్రదర్శిస్తారు.

ఆస్ట్రేలియాలో నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సులు
ఆస్ట్రేలియాలోని వివిధ పట్టణాల్లో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సులు శనివారం నుంచి జరుగనున్నాయి. ఇందుకు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ, ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ శుక్రవారం ఆస్ట్రేలియా చేరుకున్నారు. శనివారం మెల్‌బోర్న్‌లో తొలి సన్నాహక సదస్సు జరుగనున్నది.