అమ్మభాషకు నీరాజనం - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

అమ్మభాషకు నీరాజనం

telugu-warangal
ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక వేడుకలు జిల్లాల్లో అట్టహాసంగా సాగుతున్నాయి. ఉద్యోగులు, విద్యార్థులు, భాషాపండితులు, భాషాభిమానులు, సాహితీ వేత్తలు, కవులు, కళాకారులు నిర్వహిస్తున్న ర్యాలీలతో వీధులు మార్మోగుతున్నాయి. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్లన్నీ విద్యార్థుల నినాదాలు, కళాకారుల విన్యాసాలతో పులకించిపోయాయి. ఈనెల 15నుంచి 19వరకు రాష్ట్ర రాజధానిలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహకాల్లో భాగంగా జిల్లా యంత్రాంగం వేలాదిమంది విద్యార్థులతో కలెక్టరేట్ నుంచి వడ్డేపల్లి చర్చి అక్కడి నుంచి కాకతీయ యూనివర్సిటీ క్రాస్‌రోడ్స్ నుంచి ఒక ర్యాలీ, హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల మీదుగా మరో ర్యాలీ నిర్వహిస్తూ పబ్లిక్ గార్డెన్స్‌లో మహాకళా ప్రదర్శన అబ్బుపరిచేలా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కళాకారులు ఇక్కడి నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో ప్రదర్శనలు నిర్వహించారు. శాస్త్రీయ, జానపద గేయ, నృత్యాలే కాకుండా కాకతీయుల వైభవం, నృత్యరత్నావళి, రాణీ రుద్ర మ, పేరిణి నృత్యాలు, ఒగ్గుడోలు కళావిన్యాసాలతో ప్రాంగ ణం మార్మోగింది.

ఖమ్మంలోని జెడ్పీ కార్యాలయం నుంచి సర్దార్ పటేల్ స్టేడియం వరకు అధికారులు, ఉద్యోగులు, భాషాభిమానులు, విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. జరిగింది. పటేల్ స్టేడియంలో సుమారు 1500 మంది విద్యార్థులు ప్రపంచ తెలుగు మహాసభలు 2017, ఖమ్మం ఆకారంలో కూర్చొని మహాసభల ప్రాధాన్యతను చాటారు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభల సన్నాహక వేడుకలను ప్రారంభించారు. గ్రంథాలయ సంస్థ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను మంత్రి తుమ్మల ప్రారంభించారు. పెద్దపల్లిలో ఇంచార్జి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలుగు మహాసభల సన్నాహక ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఆర్యవైశ్య భవన్‌లో నిర్వహించిన సమావేశానికి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఇంచార్జి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, మహిళ శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ మూల విజయారెడ్డి, రామగుం డం మేయర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

మహబూబాబాద్ లో సన్నాహక సమావేశాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, నాయకులు మానుకోట తహసీల్ కార్యాలయం నుంచి యశోదా గార్డెన్ వరకు నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే శంకర్‌నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. యశోదా గార్డెన్స్‌లో కలెక్టర్ ప్రీతిమీనా, ఎమ్మెల్యే శంకర్‌నాయక్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పలువురు కళాకారులు వివిధ అంశాల్లో నిర్వహించిన సామాజిక చైతన్య గీతం, దాశరథి రంగాచార్య సాహిత్య పరిచయం, జానపద నృత్యగీతం, కవి, గాయక సమ్మేళనం తదితర అంశాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సంగారెడ్డిలో ప్ర పంచ తెలుగు మహాసభల సన్నాహక ముగింపు సంబురాలు అంబరాన్నంటాయి. పలువురు అధికారులు తెలుగుతనం ఉట్టిపడేలా పంచకట్టులో వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కరీంనగర్‌లో నిర్వహించిన ధూం ధాంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి చేసిన నృత్యం ఆకట్టుకుంది.

సురవరం సేవలు చిరస్మరణీయం
జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి: తెలుగు భాషాభివృద్ధి కోసం సురవరం ప్రతాపరెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు గ్రామంలో సురవరం ప్రతాపరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్‌తోపాటు కలెక్టర్ రజత్‌కుమార్‌సైని, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణకు కీర్తిప్రతిష్టలు సంపాదించిపెట్టిన మహనీయుల విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉన్నదన్నారు. తెలుగు ఎంతో గొప్పదని, ప్రతి విద్యార్థి తెలుగులోనే మాట్లాడాలని సూచించారు. తెలంగాణలోని కవులను గుర్తించేలా సీఎం కేసీఆర్ ప్రపంచ తెలుగు మహా సభలను ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. చదువుతోనే సమాజంలో మార్పు వస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని ఆయన సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో అలంపూర్ చౌరస్తాలో సురవరం ప్రతాపరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/world-telugu-conference-preparations-are-progressing-grandly-1-2-561987.html