సంబురంగా ప్రారంభం - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

సంబురంగా ప్రారంభం

KTRIT
హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం ఎల్బీస్టేడియంలో సంబురంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వేదిక మీదకు సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, శాససభ స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌అలీ, ఎంపీ జితేందర్‌రెడ్డి, రాజ్యసభలో టీఆర్‌ఎస్ పక్షనాయకుడు కే కేశవరావు, ఎంపీ అసదుద్దీన్‌ఓవైసీ, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలుగు మహాసభల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులను వేదిక మీదకు ఆహ్వానించటంతోపాటు ప్రపంచ తెలుగు మహాసభల ఉద్దేశాన్ని రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి వివరించారు. తెలుగు మహాసభలు ఆద్యంతం సాహితీవేత్తలు, భాషాభిమానులు తిలకించి ఆనందం వ్యక్తంచేశారు.

-ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభిస్తున్నామని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రకటించిన వెంటనే తారాజువ్వలు ఆకాశంలో దూసుకుపోయి.. మిరుమిట్లు గొలిపే వెలుగులతో అందరినీ సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తాయి.
-ఉప రాష్ట్రపతిని పూర్ణకుంభంతో స్వాగతించారు.
-ఎంపీ కవిత అన్ని పుస్తక ప్రదర్శనశాలలను సందర్శించి, పుస్తకాలను అడిగి తెలుసుకున్నారు.
-తెలంగాణ వంటలు తినేందుకు పలువురు ఆసక్తి ప్రదర్శించారు. విదేశాలు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చినవారు ఇక్కడి వంటకాలను ఇష్టంతో కొనుగోలుచేశారు.
-తొలిరోజు ప్రధాన వేదిక అయిన ఎల్బీస్టేడియంకు పాల్కురి సోమన ప్రాంగణం అని పేరుపెట్టారు.
-కార్యక్రమ వేదికకు బమ్మెర పోతన వేదిక అని పేరు పెట్టారు.
-సాహితీవేత్తలు, భాషాభిమానులు ఎల్బీస్టేడియంకు మధ్యాహ్నం 1 గంట నుంచే రావటం కనిపించింది.
-సాయంత్రం 5గంటలకు కార్యక్రమ ప్రారంభ సమయంకు ముందే మైదాన ప్రాంగణం అంతా జన సందోహంతో నిండిపోయింది.
-తెలంగాణ, ఏపీతోపాటు మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ర్టాల్లోని తెలుగువారు, ఇతరదేశాల్లో నివాసం ఉంటున్న తెలుగువారు ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు అధికసంఖ్యలో హాజరయ్యారు.
-సభా కార్యక్రమం ప్రారంభానికి ముందు వందమంది శాస్త్రీయ నృత్య కళాకారులతో చేపట్టిన పేరిణి నృత్యం అందరినీ అలరించింది.
-తెలుగు మహాసభల ప్రారంభం అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి.
-ప్రముఖ శా్రస్త్రీయ నృత్య కళాకారులు రాజారెడ్డి, రాధారెడ్డి ప్రదర్శించిన మన తెలంగాణ నృత్యరూపకం ఆద్యంతం తెలంగాణ సంస్కృ తి వికాసాన్ని చాటిచెప్పింది.
-అనంతరం దేశపతి శ్రీనివాస్ రచించిన జయ జయోస్తు తెలంగాణ నృత్య రూపకం తెలంగాణ వైభవాన్ని చాటిచెప్పింది.

ప్రభుత్వం ఏం చేసినా విజయమే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా విజయవంతమవుతుంది. ప్రపంచ తెలుగు మహాసభలతో తెలుగు భాష ప్రాముఖ్యత విస్తరించనుంది. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు ద్వారా తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించింది, ఇప్పుడు నిర్వహిస్తున్న తెలుగు మహాసభల ద్వారా కవులు, సాహితీవేత్తలు, భాషాభిమానుల హర్షాభిమానాలు పొందుతుంది. తెలంగాణ సర్కారు ఏంచేసినా వినూత్నంగా ఉంటుంది.
– బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ మేయర్

సీఎం కేసీఆర్ సూచనల మేరకు పాట రాశాను
ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా మన తెలంగాణ భాష, యాస ఉనికిని, ఉన్నతిని యావత్ ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్న మన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ప్రత్యేక అభివందనాలు. ఆయన సూచనల మేరకు నేను రాసిన ప్రపంచ తెలుగు మహాసభలు విపంచిలా మోగనీ.. వివిధ లలిత కళలు వెలుగ -విరించిలా నిలువనీ అనే గీతానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చారు. ప్రారంభ వేదికపై ఆ సీడీని ఆవిష్కరించడం ఆనందదాయకం.
– సినీ గేయరచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ

అదృష్టంగా భావిస్తున్నా..
అమ్మభాష గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నది, నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఈ మహాసభల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ కమిటీ తరఫున తనకు ప్రత్యేకంగా ఆహ్వా నం రావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఏడేళ్లుగా కువైట్‌లో నివసిస్తున్న తాను న్యూస్‌రిపోర్టర్, రేడియోజాకీ, తెలంగాణ సమితి మీడి యా ఇన్‌చార్జి, కార్యదర్శిగా కొనసాగుతున్నాను.
-గొడిశాల అభిలాష, తెలంగాణ జాగృతి కువైట్ ప్రతినిధి

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/world-telugu-conference-environs-wear-a-festive-look-1-2-562246.html