కడుపునిండా తెలుగు భాష - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

కడుపునిండా.. తెలుగు భాష..!

World-TeluguConference
ఉద్యమకారుడిగా, రాజకీయవేత్తగా, ఇంజనీరుగా, గొప్ప దార్శనికుడిగా ఇప్పటివరకు కనపడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గొప్ప సాహితీవేత్తగా, కవిగా మరో పాత్రను పోషించారు. ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం సాహితీవేత్తలు, రచయితలు, భాషాభిమానులు, ప్రజల మన్ననలు చూరగొంది. శుక్రవారం మహాసభల ప్రారంభోత్సవంలో ఆయన చేసిన ప్రసంగం ఆహూతులతోపాటు ప్రజలను ఆకట్టుకుంది. ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై తనకు చదువు చెప్పిన గురువు మృత్యుంజయశర్మను సత్కరించి, కాళ్లకు నమస్కరించిన కేసీఆర్ గురుభక్తి, సంస్కారం అందరికీ ఆదర్శనీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతన నుంచి మొదలుకొని.. దాశరథి, కాళోజి, సినారె తదితరులను సృశిస్తూ.. వారి కవితలు, పద్యాలను ఉటంకిస్తూ.. ఈ తరం కవులైన గోరేటి వెంకన్న, అందెశ్రీ, జయరాజ్ లాంటి వారి గురించి చెబుతూ.. వారి పాటలు, పద్యాలను సందు చిన్నదీ.. సంత.. మావూరి సంత.. జయ జయహే తెలంగాణ.., వానమ్మా వాన..అంటూ సీఎం కేసీఆర్ అలవోకగా పాడిన పాటలు, పద్యాలు సభికులను ఆశ్చర్యానందాలకు గురిచేసింది.

దాశరథి, కాళోజి పేరిట సాహిత్య పురస్కారాలు అందించేందుకు ఏర్పాటుచేసినట్టు ముఖ్యమంత్రి ప్రకటించటం సాహిత్యాభిలాషులను, భాషా ప్రియులను, ప్రజలను సంతోషంతో నింపింది. సీఎం కేసీఆర్ చిన్ననాడు చదివిన పద్యాలను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారని, తనకు అంతగా గుర్తులేవని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసారగ్‌రావు ముఖ్యమంత్రికి తెలుగుపై ఉన్న మక్కువను వివరించారు. సందర్భోచితంగా కేసీఆర్ చెప్పిన పద్యాలు, సామెతలు, నుడికారాలు ఆయనలోని సాహితీవేత్తను కొత్త కోణంలో ఆవిష్కరించాయి. తొమ్మిదో తరగతిలోనే పద్యాలు రాసిన విషయం, చిన్నప్పుడు నటుడు శోభన్‌బాబు సినిమాలో ఓ పాటలో వాడిన పద ప్రయోగంలో వచ్చిన సంశయాన్ని మరునాడు గురువుని అడిగి దాన్ని నివృత్తి చేసుకున్న విధానం అందరిలో ఆసక్తితోపాటు చదువుకునే సమయంలోనే కేసీఆర్‌లో శ్రద్ధను వివరించాయి. ఈ సందర్భంగా అహూతుల నుంచి కరతాళధ్వనులు మిన్నంటాయి.

ఇక సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ఉటంకిస్తూ.. మాతృభాషను భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఎందరెందరో కదిలివచ్చారని.. ఈ సభను చూస్తే భువన విజయం జరుగుతున్నట్టు ఉన్నదని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. అందరూ పుస్తకాలను గూట్లో పెట్టుకొంటారు.. కానీ కేసీఆర్ తన నోట్లో పెట్టుకొన్నారని, ఆయన ప్రసంగంతో తాను తన్మయత్వానికి గురయ్యానని కోట శ్రీనివాసరావు వ్యాఖ్యానించటం ముఖ్యమంత్రి ప్రసంగం ఎలా సాగిందో చెప్పకనే చెప్పింది. తెలుగుభాషా పండితుల సమస్యలను కూడా పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారు. సుమారు ఇరవై నిమిషాలపాటు ఆద్యంతం అచ్చ తెలుగులో.. సాహితీవేత్తగా మారి సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఆకట్టుకుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..! భావజాలాల్లో ఉత్తర దక్షిణ ధ్రువాలుగా ఉండే వెంకయ్యనాయుడు, అసదుద్దీన్‌ఒవైసీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి, వారిద్దరితో శభాష్ అనిపించుకోవటం మామూలు విషయమా! గతంలోఇది జరిగిందా? ఇదే అసలు సిసలు లౌకికవాదం అంటే, ఇదే గంగా జమూనా, తేహజీబ్ అంటే. ఒవైసీ తెలుగులో మాట్లాడటం చూశామా? కాని, తొలిసారి తెలుగులో మాట్లాడారు. దటీజ్ సీఎం కేసీఆర్ అని జనం అనుకొంటున్నారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/world-telugu-conference-begins-in-hyderabad-1-2-562245.html