తెలుగు వైశిష్ట్యాన్ని చాటిచెప్పే విధంగా వేదికలు

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలుగు వైశిష్ట్యాన్ని చాటిచెప్పే విధంగా వేదికలు

World Conference Arrangements
ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభానికి 18 రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉండటంతో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి సారథ్యంలోని కోర్‌కమిటీ సభ్యులు, అధికారులు క్షణం తీరిక లేకుండా పని చేస్తున్నారు. నిర్వహించాల్సిన కార్యక్రమాల వేదికలను సిద్ధం చేస్తున్నారు. నగరంలోని చారిత్రాత్మక ఫతేమైదాన్‌లో డిసెంబర్15న ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగనున్నది. ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముగింపు ఉత్సవంలో రాష్ట్రపతి రామనాథ్‌కోవింద్ పాల్గొననున్నారు. ఇందుకు వారు అంగీకరించడంతో మహాసభల నిర్వాహకులు సోమవారం ఉన్నతస్థాయి సమావేశం జరిపి కార్యక్రమాల ఖరారుపై చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం ప్రకారం తెలుగు వైశిష్ట్యాన్ని చాటిచెప్పే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు ఐదు వేదికలకు సంబంధించిన సాహిత్యాంశాలను ఖరారు చేశారు. మరో రెండుమూడు వేదికలను కూడా సిద్ధం చేయాలని నిర్ణయించారు.

రెండువేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న తెలుగుభాషా విశేషాలు, చిరస్మరణీయుల గురించి చర్చించేందుకు వీలైనన్ని ఎక్కువ కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. తెలంగాణలోని 31జిల్లాలకు చెందిన కళారూపాలను రవీంద్రభారతిలో ఐదురోజులపాటు ప్రదర్శించే విధంగా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో మూడురోజుల పాటు కవిసమ్మేళనాలు నిర్వహించనున్నారు. జానపదకళారూపాలకోసం పీపుల్స్ ప్లాజాను సిద్ధం చేస్తున్నారు. సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకృష్ణ ఈ కళాబృందాలను ఎంపిక చేస్తున్నారు. తెలుగువిశ్వవిద్యాలయం ఆడిటోరియంలో కథ, నవల, వచనకవిత్వం, విమర్శ, అవధానం వంటి సాహిత్యాంశాలపైన చర్చాగోష్ఠులు ఉంటాయి. ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో బాలసాహిత్యంపైన చర్చాగోష్ఠులు ఏర్పాటు చేస్తున్నారు. బాలకవులను ఎంపికచేసి కవిసమ్మేళనాలను నిర్వహించనున్నారు. బాలసాహిత్యంపైన మూడు సెషన్లు నిర్వహిస్తారు.