సాంస్కృతిక వీణపై తెలంగానం - World Telugu Conference 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

సాంస్కృతిక వీణపై “తెలంగానం”

తెలుగు సాంస్కృతిక వికాసంలో తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. కొత్త తరానికి సాహిత్య స్ఫూర్తిని అందించేలా, తెలుగు భాషాభివృద్ధిలో తెలంగాణ ప్రజలు, కవులు, పండితుల విశిష్ట పాత్రను తెలియజెప్పేలా ఐదు రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మహాసభల కార్యక్రమాలు దాదాపు ఖరారయ్యాయి. డిసెంబరు 15న ప్రారంభమయ్యే ఈ మహాసభలు 19న ముగుస్తాయి. సాహిత్యంలో అన్ని రకాల ప్రక్రియలపైన సదస్సులు, చర్చలతోపాటు పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రధాన వేదిక లాల్‌బహుదూర్‌ స్టేడియంలో ప్రారంభ, ముగింపు వేడుకలతోపాటు ఎక్కడెక్కడ ఏయే అంశాలపై సదస్సులు నిర్వహించాలో నిర్ణయించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందినీ సిధారెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సీఏం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌, సాంసృతిక సంచాలకులు హరికృష్ణ తదితరులు గత కొన్ని రోజులుగా కసరత్తు చేసి కార్యక్రమానికి తుదిరూపునిచ్చారు. దేశంలోని పలువురు జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీతలను, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు పొందిన తెలుగు సాహితీవేత్తలను సదస్సుకు ఆహ్వానించినట్లు నందినీ సిధారెడ్డి  తెలిపారు. ఎల్బీ స్టేడియంలో 15న ప్రారంభం, 19న ముగింపు కార్యక్రమాలు జరుగుతాయి. అతిథుల్లో మారిషస్‌ ఉపాధ్యక్షుడు పరమశివం పిళ్లై కూడా ఉన్నారు. ప్రారంభ సమయంలో పలువురు సాహితీ ప్రముఖులు మాట్లాడనున్నారు.

తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో:
కథ, నవల, పద్య కవిత్వం, వచన కవిత్వం, విమర్శ, అవధానం తదితర అంశాలపై చర్చాగోష్ఠులు ఉంటాయి. మౌఖిక సాహిత్యంపైనా సదస్సు నిర్వహిస్తారు. సాహిత్యంలోని ప్రతి అంశంపైన సదస్సు, ఇందులో తెలంగాణ వైపు నుంచి, తెలుగు సాహిత్యంలో దాని స్థానం గురించి చర్చ ఉంటుంది. మొత్తం ఏడు రకాల సదస్సులు నిర్వహిస్తారు.

ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో:
బాలసాహిత్యంపై కవులతో కవిసమ్మేళనంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, సదస్సులు నిర్వహిస్తారు. చిన్నారులు ప్రతిభను ప్రదర్శించేలా పద్యాలు, నృత్యాలు మొదలైనవి ఉంటాయి. బాల సాహిత్యానికి సంబంధించి మొత్తం మూడు సెషన్లు ఉంటాయి. మహిళా సాహిత్యం, ప్రాచీన మహిళా సాహిత్యం, ఆధునిక సాహిత్యంలో మహిళలు తదితర అంశాలపైనా సదస్సులు నిర్వహిస్తారు. మహిళలు రాసిన కవిత్వం, కథలు, నవలలపై చర్చలతోపాటు మహిళా కవిసమ్మేళనం జరుగుతుంది.
రవీంద్రభారతిలో:
ప్రధాన హాలులో ప్రతి రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. శాస్త్రీయ కళలు, శాస్త్రీయ సంగీతం, పద్యనాటకం మొదలైనవి ఉంటాయి. రవీంద్రభారతి మినీ హాలులో ప్రధానంగా అవధాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అష్టావధానం, శతావధానం ఉంటాయి.
ఎల్బీ స్టేడియం ఇండోర్‌ స్టేడియం: ఇక్కడ మూడున్నర రోజులపాటు కవి సమ్మేళనాలు నిర్వహిస్తారు. రెండువేల మంది వరకు పాల్గొంటారని అంచనా.
పీపుల్స్‌ ప్లాజా/ లలితకళాతోరణం:

ఈ రెండింటిలో ఒకచోట జానపద కళలను ప్రదర్శిస్తారు. తెలంగాణ ఒగ్గుకథ, శారదకథ, బతుకమ్మ, గిరిజన నృత్యాలు మొదలైనవి ఉంటాయి.
Source: http://www.eenadu.net/news/news.aspx?item=ts-main-news&no=14