మాకు తెలుగు పంతులు కావాలి
మాకు.. తెలుగు భాషను బోధించడానికి ఒక ఉపాధ్యాయుడు కావాలి. మేం ఐదువేల మంది తెలుగువాళ్లమున్నాం. తెలుగు నేర్చుకోవాలన్న తపన ఉన్నది. కానీ నేర్పేవారే లేరు. ఎక్కడో సుదూర ప్రాంతంలో తాతల కాలంనాడు వలసవెళ్లి స్థిరపడిపోయిన తెలుగువాళ్ల తీరాల్సిన కోరిక ఇది. హైదరాబాద్‌కు 11,567 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిజీ దీవుల నుంచి ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ భాషాభిమాని చేసిన అభ్యర్థన ఇది. మాతృభాషకు, మాతృభూమికి తాము దూరమైనా.. కనీసం తమ భవిష్యత్తరాలకైనా తెలుగును అందించాలన్న తపన ఆయనలో కనిపించింది. ఫిజీ దేశంలోని లాటోక పట్టణానికి చెందిన ఉమేంద్రరెడ్డి తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. ఆయనకు నమస్కారం అన్న ఒక్క పదం తప్ప మరో తెలుగు పదం రాదు. హిందీ, ఆంగ్లం అనర్గళంగా మాట్లాడుతారే తప్ప తెలుగు పదం మాత్రం రాదు. ఫిజీ నుంచి ఇంతదూరం రావడమంటే దూరాభారంతోపాటు ఖర్చుతో కూడుకొన్నది. పైగా ఆయన ఇప్పటివరకూ ఎన్నడూ భారత్‌కు రాలేదు. కానీ తెలుగు మీద మక్కువతో తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చారు. అంతేకాదు.. ఇక్కడికి వస్తే తన వంశానికి చెందిన మూలాలు తెలుస్తాయన్న ఆరాటంతో వచ్చారు.
ఫిజీలోనూ తెలుగు సంఘం:
దక్షిణ ఇండియా ఆంధ్రా సంఘం ఆఫ్ ఫిజీ (డీఐఏఎస్) అనే అసోసియేషన్ తరఫున ఉమేంద్రరెడ్డి ఈ మహాసభలకు వచ్చారు.
ఫిజీ ద్వీపాల్లో దాదాపు 1.5 మిలియన్ల వరకు జనాభా ఉండగా.. అందులో 40 శాతం వరకు భారత్‌నుంచి వచ్చినవారే ఉన్నారు. ఐదువేల మంది తెలుగువారున్నారని ఆయన చెప్పారు. తమ సంఘం పరిధిలో ఐదు ప్రాథమిక పాఠశాలలు (ఒకటి నుంచి 8వ తరగతి వరకు), రెండు మాధ్యమిక (సెకండరీ) పాఠశాలలు నడుస్తున్నాయని చెప్పారు. తమిళం తదితర భాషలు బోధించడానికి ఉపాధ్యాయులున్నా.. తెలుగు బోధించడానికే ఉపాధ్యాయుడు లేడని.. ప్రపంచ మహాసభలకు హాజరయ్యే అవకాశం రావడంతో.. తెలుగు బోధించే ఉపాధ్యాయుడెవరైనా దొరుకుతారా.. అని అన్వేషిస్తున్నట్లు ఆయన నమస్తే తెలంగాణతో పేర్కొన్నారు. తమ తాత ముత్తాతలు ఎప్పుడో 19వ శతాబ్దం మధ్య కాలంలో (బ్రిటిష్ పాలన) వ్యవసాయం పనుల కోసం ఫిజీకి వచ్చినట్టు తెలిపారు. తన తాత పేరు తంగవేలురెడ్డి అని.. తన తండ్రి ఆర్ముగంరెడ్డి అని చెప్పిన ఆయన.. తమ వంశం మూలాలు ఫలానా ప్రాంతం అనేది తనకు తెలియదన్నారు. తెలంగాణ, ఏపీ, తమిళ, కర్ణాటక రాష్ర్టాల సరిహద్దుల ప్రాంతం ఏదైనా అయిఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.