తెలుగుకు ఇది పట్టాభిషేకం - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలుగుకు ఇది పట్టాభిషేకం

Default post image

తెలంగాణ భాష, సంస్కృతి కేంద్రంగా తెలుగు మహాసభలు జరుగడం సంతోషకరం. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం అమ్మభాషలోనే మాట్లాడుతారు. ఉద్యమంలో తెలంగాణ యాసలో కేసీఆర్ చేసిన ప్రసంగాలు ప్రజల్ని సంఘటితం చేశాయి. తెలుగుకు కొత్త రూపం తీసుకొచ్చేందుకు సాహిత్య అకాడమీ, పాఠ్యాంశాల సిలబస్ కమిటీ విశాల హృదయంతో పనిచేయాలి. ప్రపంచ తెలుగుమహాసభలు తెలుగు భాష పునర్జీవానికి స్ఫూర్తిమంతంగా నిలువాలి.
– జూకంటి జగన్నాథం, అఖిల భారత తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు

తెలంగాణ ఉద్యమ కొనసాగింపు

తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఇది రాజకీయ ఉద్యమం మాత్రమే కాదు. సాహిత్య, సాంస్కృతిక ఉద్యమం అని చెప్పుకొన్నాం. ప్రపంచ తెలుగు మహాసభలు ఆ ఉద్యమానికి కొనసాగింపు. చరిత్ర లోతుల్లోకి వెళ్లేందుకు ఈ సభలు దోహదపడతాయి. ఒకటవ శతాబ్దంలోనే తెలంగాణలో కవిసమ్మేళనాలు జరిగేవి. తెలంగాణ నేలకు వైభవోపేత గతం, వర్తమానం ఉన్నాయి. వాటిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఈ మహాసభలు దోహదపడతాయి.
– అమ్మంగి వేణుగోపాల్, రచయిత, సాహితీ విమర్శకుడు

మహోన్నత కార్యక్రమం

గతంలో తెలంగాణప్రాంత కవులను, కళాకారులను, భాషా పండితులను చులకనగా చూశారు. ఎగ్గుల పెట్టారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో ప్రాధాన్యం వచ్చింది. తెలంగాణ యాస, భాష అందరి హృదయాలను చేరేలా కృషిచేస్తున్న మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్. అతి తక్కువ సమయంలోనే ప్రపంచంలోని తెలుగువారిని పిలిచి మహాసభలను నిర్వహించటం ఆయనకే దక్కింది. అనేక ఏండ్ల చరిత్రను వెలుగులోకి తీసుకురావటం, ఇక్కడి కళావైభవాన్ని, కవుల, కళాకారుల, భాషా పండితుల, సామాజిక ఉద్యమకారుల గొప్పదనాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పేందుకు ఈ మహోన్నత కార్యక్రమానికి పూనుకున్నారు. తెలంగాణ నేల మీద పుట్టిన ప్రతిఒక్కరూ ఆనందించాల్సిన సందర్భమిది.
– జయరాజ్, సినీగేయ రచయిత

తెలుగు చదవాలనే ఆకాంక్షను పెంచుతాయి

తెలుగు మాట్లాడటం నిరుపయోగం అనుకుంటున్న కాలంలో తెలుగుభాషా వికాసానికి సంకల్పించి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించటాన్ని స్వాగతించాలి. తెలుగుభాష వైభవాన్ని చాటి చెప్పటంతోపాటు, తెలుగు ఉపయోగాన్ని, తెలుగు చదవాలనే ఆకాంక్షను పెంచేందుకు ఈ సభలు దోహదంచేస్తాయి. తెలంగాణ సాహిత్య పరిశోధకులను గౌరవించుకొనేందుకు ఇది మంచి సందర్భం.
– ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

సమగ్ర తెలంగాణ భాషా నింఘటువును రూపొందించాలి

ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ చరిత్రను వెలికితీసేందుకు, సంస్కృతిని వెల్లడించేందుకు దోహదపడతాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న తెలుగు కంటే తెలంగాణ తెలుగు వైవిధ్యమై నది. తెలంగాణ భాషకు ప్రత్యేక అస్థిత్వం ఉన్నదని నిరూపించు కోవాలి. సమగ్ర తెలంగాణ భాషా నింఘటువును రూపొందించుకోవాలి. అలాంటి ప్రయత్నాలకు మహాసభలు నాందిపలుకుతాయి.
– హరగోపాల్, చరిత్ర పరిశోధకులు

అన్ని అస్థిత్వవాదాలకూ అవకాశం

ప్రభుత్వం కేవలం రాజకీయాలను మాత్రమే పట్టించుకుంటుందనే అభిప్రాయం ఉన్నది. అందుకు భిన్నంగా సాహిత్యంపై సమయాన్ని వెచ్చించటం, శ్రద్ధను కనబర్చటం హర్షణీయం. సాహిత్యం ప్రభుత్వానికి ప్రతిపక్షం లాంటిదని చెప్తుంటారు. అయినా సాహిత్యాన్ని ప్రజలకు చేరవేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించటం అభినందించాల్సిన విషయం. మహాసభల్లో అన్ని అస్థిత్వ వాదాలకూ అవకాశం కల్పించటం ముఖ్యమైన విషయం. ప్రత్యేకంగా మహిళా సాహిత్యంపై ఒక రోజంతా చర్చిస్తారు.
– షాజాహానా, కవయిత్రి

తెలుగు భాషా వికాసం

ప్రాచీనకాలంలోనే తెలంగాణలో సాహిత్యం వెల్లివిరిసిందని చెప్పటానికి ఎన్నో శాసనాలు, రచనలున్నాయి. వాటన్నింటినీ వెలికితీయటానికి, తెలంగాణ సంస్కృతిని అవలోకనం చేసుకోవటానికి ఈ సభలు దోహదపడతాయి. కొత్త తరానికి తెలంగాణ భాష – సంస్కృతుల గొప్పదనాన్ని తెలియజేయటంతోపాటు తెలుగు భాషా వికాసానికి ఉపయోగపడతాయి.
– ప్రొఫెసర్ సూర్య ధనుంజయ, ఉస్మానియా యూనివర్సిటీ

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/this-is-coronation-to-telugu-1-2-561961.html

Default post image

Default post image