తెలుగుకు ఇది పట్టాభిషేకం - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

సాహితీ సంరంభంలోమేముసైతం

తెలుగు సాహితీ సంరంభంలో పాల్గొనేందుకు భాషాభిమానులు, పండితులు, సాహితీవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ప్రాంతాలకతీతంగా తెలంగాణ నిర్వహిస్తున్న తెలుగు మహాసభలు భాష అభివృద్ధికి ఎంతగానో ఉపకరిస్తాయని అంటున్నారు. మాతృభాషపై అభిమానాన్ని రగిలించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పడుతున్న తపన అనితరసాధ్యమని కీర్తించారు. తెలుగు మహాసభలను ఒక ప్రదర్శనగా కాకుండా తెలుగు సాహిత్యానికి ప్రాచుర్యం కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించటం సంతోషించదగిన విషయమని అన్నారు. ఏర్పాట్లే పండుగను తలపిస్తుంటే.. వీటి నిర్వహణ కూడా అజేయంగా ఉంటుందన్న నమ్మకం ఉందని, ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా జరుగుతున్న ఏర్పాట్లుచూస్తే ఆనందం కలుగుతున్నదని ధ్వన్యనుకరణ సామ్రాట్, పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ చెప్పారు. భాషకు సంబంధించి ఇంత నిబద్ధతతో ఈ స్థాయిలో జరిగిన దాఖలాలు లేవని అంటూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన అభినందించారు. సీఎం కేసీఆర్ స్వయంగా సాహితీ ప్రేమికుడు, సాహిత్యం విలువ తెలిసిన సారస్వత జిజ్ఞాసువు. ఆయన దిశానిర్దేశకత్వంలో మహాసభలు జరుగుతున్నందున సాహిత్యానికి గొప్ప గౌరవ ప్రతిష్ఠలు లభిస్తున్నాయి అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య ఎన్ గోపి అన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఈ సభల్ని కొంతమంది ఇవి కేవలం తెలంగాణకే పరిమితం, అవి తెలుగు సభలు కావనే దుష్ప్రచారం చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్న అనుమానం కలుగుతున్నదని కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ గడ్డమీద జరిగే సభలపై ఇంకా వారిపెత్తనమే ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు.
Telugu-Mahasabalu - Stadium

తెలంగాణ సమాజం సాంస్కృతికంగా ఎంత గొప్పగా ఉన్నదో ఈ సభల ద్వారా తేటతెల్లమవుతుందని కాళోజీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ డాక్టర్ సీతారాం అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగు భాషకు, సాహిత్యానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నారని మంథనికి చెందిన ప్రముఖ కవి, రచయిత అల్లం వీరయ్య అన్నారు. ఆధునిక కాలంలో తెలుగు భాషోద్ధారకునిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వాసికెక్కుతారని ఆలేరుకు చెందిన దాశరధి కృష్ణమాచార్య సాహితీ పురస్కార గ్రహీత డాక్టర్ తిరునగరి చెప్పారు. సీమాంధ్రులు, ఇతర దేశాల్లోనివారు కూడా మన భాషవాళ్లే. తెలంగాణ తన భాష గురించి పండుగ జరుపుకొంటున్నది. తెలంగాణ భాష, సాహిత్యాల్లో అనేక ప్రక్రియలు, వాటిలోని ప్రముఖులందర్నీ ఈ మహాసభ ఆహ్వానిస్తున్నది. అందరూ ఒకచోట కూడే సందర్భం కంటే సాహిత్యాభిమానులకు పండుగేముంటుందని తెలంగాణ రచయితల సంఘం నేత నాళేశ్వరం శంకరం అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు ఆంధ్ర, రాయలసీమ, ఇతర ప్రాంతాల్లోని తెలుగు వారందరం సహకరిస్తామని తెలుగు భాషోద్యమ సమాఖ్య నేత సామల రమేశ్‌బాబు చెప్పారు. తెలంగాణ నిర్వహిస్తున్న ఈ తెలుగు మహాసభలు అన్ని ప్రాంతాల, అన్ని భావజాలాలకు చెందినవారిని గొప్ప మనసుతో ఆహ్వానిస్తున్నాయని, అందరూ పాల్గొని వీటిని విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నదని తెలంగాణ సాహిత్య సమాఖ్యకు చెందిన వేముగంటి మురళి చెప్పారు. మాతృభాషపై అభిమానాన్ని రగల్చటం కోసం సీఎం కేసీఆర్ పడుతున్న తపన అనితరసాధ్యమని సినీ గేయ రచయిత, జాతీయ ఉత్తమ గేయ రచయిత అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ అన్నారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/the-interest-of-telugu-literary-legends-to-participate-in-world-conferences-1-2-561901.html