నిష్పక్షపాతమైన అభిప్రాయమే సాహిత్యం - World Teugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

నిష్పక్షపాతమైన అభిప్రాయమే సాహిత్యం

kara-master
తెలుగుకథకు చిరునామాగా నిలిచే కథానిలయం ఆయన సృష్టి. పాఠకుడిగా, కథకుడిగా, విమర్శకుడిగా, కథాపరిశోధకులకు మార్గదర్శిగా నిలిచారు కాళీపట్నం రామారావు. ఉత్తరాంధ్ర జీవితాన్ని, యాసను తన కథల్లో పరిచిన కారామాష్టారు కథావిజ్ఞాన సర్వస్వాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ తెలుగును భాషేకాదని తిరస్కరించిన కాలంలో, తెలంగాణ మాండలిక సాహిత్యాన్ని అవమానపరిచిన కాలంలో అల్లం రాజయ్య, తుమ్మేటి, బీఎస్ రాములు మొదలైన తెలంగాణ కథకులను ఆదరించి, గుర్తించి, గౌరవించిన కారామాష్టారు తెలుగు మహాసభల కోసం నగరం చేరుకున్నారు. ఆత్మీయ ఆతిథ్యం ఇస్తున్న నగరంలో ఆయన నమస్తే తెలంగాణతో తన కథాభిమానం గురించి ఇలా చెప్పుకొచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరుకావడం
ఎలా అనిపిస్తున్నది?
తెలుగు మహాసభల నిర్వాహకులు విశాల దృక్పథం కలిగినవాళ్లనిపించింది. ముసలాడు ఏం మాట్లాడతాడులే అనుకోకుండా నన్ను గుర్తించి ఆహ్వానించారు. చాలా సంతోషంగా ఉంది. అన్ని వయసుల వారికీ ఆహ్వానం పంపినట్టుగా తెలిసింది.
మాండలిక కథలకు ఆదరణ తక్కువన్నమాట నిజమేనా?
ప్రపంచంలో పిల్లలకో భాష ఉంటుంది. గ్రామం, పట్టణం, బస్తీల్లో జీవితాల్లో తేడాలుంటాయి. ఒక ప్రాంత మాండలికాన్ని తిరస్కారభావంతో కాకుండా అది అక్కడి జీవితంగా చూసే ప్రయత్నం చేయాలి. చదివితే, మాట్లాడితే భాష వస్తుంది. అలాగే ఇతర ప్రాంతాల మాండలిక సాహిత్యం చదివితే కొంతకాలానికి అర్థమవుతుంది. కథానిలయం నిర్వహణలో మేం అన్ని ప్రాంతాల, అన్ని మాండలికాల కథలకూ సమాన గౌరవం కల్పించాం.
మన కథ పాశ్చాత్య కథ స్థాయికి చేరిందా?
అన్ని ప్రాంతాల్లోనూ జీవితం ఒకేతీరుగా ఉండదు. తనస్థాయి జీవితాలతో తెలుగు కథానిక రచన అభివృద్ధి చెందుతున్నది. తెలుగులో వివిధప్రాంతాల కథలను ఒకదానితో మరొకటి పోల్చలేము. అలాగే ఇతర భాషల కథలతోనూ పోల్చలేము. ఎవరి జీవితం వారిదైనప్పుడు పోలికేలేదు. నన్ను యజ్ఞం కథ చదివే ఎక్కువమంది గుర్తించారు. కానీ జీవధార కథను ఎంతమంది అభిమానించారు? ఎవరి అభిరుచి వారిది.

కథానిలయం డిజిటలైజేషన్ గురించి చెబుతారా?
కథానిలయంలో పుస్తకరూపంలో ఉన్న కథలెన్నో గుర్తులేదు. నేను అశక్తుడనయ్యాను.కథా నిలయం వ్యవహారాలు పెద్ద కొడుకు చూస్తున్నాడు. వివినమూర్తి అనే రచయిత కథానిలయంలో వున్న పుస్తకాలు, అంతర్జాలంలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా పదిహేనేళ్లు చేసిన కృషి ఫలితంగా ఒకలక్ష తెలుగుకథల జాబితా సిద్ధమైంది.

ఈ తరం కథారచయితలకు మీ సందేశం?
ఇళ్లలో గొడవలు జరుగుతాయి. బయట గొడవలు జరుగుతాయి. ఇవన్నీ కథలుగా చెప్పాలని ప్రయత్నించడంలో తప్పులేదు. కానీ ఆ ఘటనను అన్ని కోణాల్లో ఆలోచించాలి. అర్థంచేసుకోవాలి. జీవితాన్ని అర్థం చేసుకోవడం కథకుడి పని. ఆ కథ ఆధారంగా సామాజిక జ్ఞానాన్ని పాఠకుడికి అందించాలి.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/the-impartial-opinion-is-literature-1-2-562142.html