సాహితీవేత్తల విస్మరణ ఇక ఉండదు - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

సాహితీవేత్తల విస్మరణ ఇక ఉండదు

Telangana Sahithya Akademi Chairman Siddareddy Nandini
తెలంగాణ ప్రభుత్వం ఈనెల 15 నుంచి 19వతేదీ వరకు నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు సాహితీ వినీలాకాశంలో వేగుచుక్కగా నిలుస్తాయని రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్‌, నిర్వహణ కమిటీ ప్రధాన బాధ్యుడు నందిని సిధారెడ్డి తెలిపారు. మహాసభల ద్వారా తెలంగాణ చరితను, భవితను చాటుతామని చెప్పారు. మహాసభలను పురస్కరించుకొని బుధవారం ఆయన ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రపంచ మహాసభలకు ప్రేరణ ఏమిటి.. ఎలా కలిగింది?
తెలుగు భాష ప్రస్తుత పరిస్థితి.. పలు పరిణామాలు సభల నిర్వహణకు ప్రేరణగా నిలిచాయి. భాషను ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి సభల నిర్వహణకు పూనుకున్నాం. కొత్త తరానికి భాష, సాహిత్యపు మాధుర్యం అందిస్తాం.
మహాసభలనిర్వహణకు ఇదే సరైనసమయమా?
మహాసభల నిర్వహణను ఆలస్యం చేశారనే వాదన సరైనది కాదు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం తొలుత చారిత్రక గోల్కొండ కోటపై పతాకం ఎగురవేసి తెలంగాణ పయనాన్ని చాటింది. నేను 40 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉన్నాను. చరిత్రలో తొలిసారిగా కవులు, రచయితల బొమ్మలు హోర్డింగుల్లో, ద్వారాలు, తోరణాలపై వెలవడం ఇప్పుడే చూస్తున్నా. తెలంగాణ తొలి దళితకవి ఈట బుచ్చిదాస్‌ గురించి నాకే తెలియదు. ఇపుడు ఆయన పేరిట ద్వారం వెలిసింది. సలంద్ర లక్ష్మినారాయణ 60 ఏళ్ల క్రితమే యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి కీర్తనలు రాశారు. అవన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తాయి.
మూడున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషాభివృద్ధికి చేసిన కృషి?
రాష్ట్రప్రభుత్వం పాఠ్యపుస్తకాలను సమీక్షించింది. తెలంగాణ ముద్ర కనిపించేలా పదో తరగతి వరకు కొత్త పాఠ్యాంశాలను తెచ్చాం. 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేయడం భాషకు మేలు చేస్తుంది. తెలుగు జాతీయాలు, పలుకుబడులపై పుస్తకాన్ని ప్రచురించాం. మాతృభాషకు ఘనకీర్తి తెచ్చిన కాళోజీ, దాశరథిల పేరిట పురస్కారాలను తెచ్చింది. గ్రంథాలయంలో తలుపులు తీసి, వేసే ఉద్యోగం చేసి గ్రంథాలయోద్యమ సారథిగా ఎదిగిన వట్టికోట ఆళ్వార్‌స్వామి పేరును నగర కేంద్ర గ్రంథాలయానికి పెట్టాం.
అధికార భాషా సంఘం, తెలంగాణ సాహిత్య అకాడమీ పనితీరు
అధికార భాషా సంఘం నిర్మాణ దశలో ఉంది. సాహిత్య అకాడమీ ఏర్పాటై ఆర్నెల్లు కావస్తోంది. 15 పుస్తకాలను ముద్రించాం. మరుగున పడిన రచయితలు, ఇతిహాసాలను వెలుగులోకి తెస్తున్నాం. ఆరువేల సామెతలతో కొత్త పుస్తకాన్ని రూపొందించాం. మహాసభలను నిర్వహించే అవకాశం దక్కడం సాహిత్య అకాడమీకి దక్కిన అదృష్టం.
తెలంగాణ కవులకు ఆది నుంచి ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్తి ఉంది?
గతంలో జరిగిన లోటును పూరించలేం. మున్ముందు లోటుపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మన కవులను, చరిత్రకారులను చీకట్లో ఉంచినా ఇప్పుడు ప్రపంచం మొత్తానికి వారి గురించి తెలుస్తోంది.
మహాసభల తీర్మానాలు.. తర్వాత మర్చిపోతున్నారనే విమర్శలున్నాయి
నిర్మాణాత్మక ఆలోచనలు కలిగినవారు సభలు జరిగితే చాలనుకోరు. తర్వాత స్ఫూర్తితో పనిచేస్తారు. కార్యోన్ముఖులవుతారు. సభల అనంతరం నిరంతర కృషి కొనసాగుతుంది. పుస్తక ప్రచురణల ద్వారా సాహిత్యాన్ని ఎప్పటికప్పుడు యువత వద్దకు తీసుకువెళతాం.
ఆధునికయుగంలో సాహిత్యానికి ఆదరణ ఉందా?
సాహిత్యానికి ఎప్పుడూ ఆదరణ లభిస్తుంది. మా సమయంలో తగిన గుర్తింపు రాలేదు. మేం రాసినవి పత్రికలకు పోస్టుచేసి సమాధానం కోసం ఎదురు చూసేవాళ్లం. ఇప్పుడు వాట్సాప్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లు సాహితీ కేంద్రాలయ్యాయి. ఎవరైనా తమ సాహిత్యాన్ని పోస్టు చేస్తే వెంటనే అందరికీ తెలుస్తోంది.
మహాసభల నిర్వహణపై కొన్ని భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి?
గతంలో జరిగింది వేరు. ఇప్పుడురాష్ట్రాన్ని సాధించుకున్నాం. నిజమైన కవులు, రచయితలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. భాషా పరిరక్షణకు చేపట్టిన ఈ మహాసభలను ప్రజల కోణంలో చూడాలి తప్ప మరోలా భావించవద్దు.

Source: http://www.eenadu.net/world-telugu-conference/world-telugu-conference-news.aspx?article=160