తెలంగాణలోనే తొలి తెలుగు శాసనం - World Telugu Conferneces 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలంగాణలోనే తొలి తెలుగు శాసనం

Keesaragudda
మొట్టమొదటి తెలుగు శాసనం తెలంగాణలోనే వెలిసింది. 1967లోనే పురావస్తు నిపుణులు దీనిని ధ్రువీకరించారు. కానీ వలస పాలకులు మాత్రం ఈ నిజాన్ని తొక్కిపెట్టారు. నేటికీ సీమాంధ్రకు చెందిన ధనంజయుని కలమళ్ల శాసనం తొలి తెలుగు శాసనంగా పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ అంశంపై మరోసారి చర్చ మొదలైంది. తొలి తెలుగు శాసనం తెలంగాణ రా్రష్ట్రం మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్టలో కనుగొన్నారు. రాష్ట్ర ఆర్కియాలజీ విభాగం నిపుణులు ఈ శాసనం వివరాలు సేకరించారు. దీనిపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం.

క్రీ.శ.420లోనే తెలంగాణలో తెలుగు.
క్రీ.శ.575కు (6వ శతాబ్దం) ముందు అంటే సుమారు క్రీ.శ.420లో అంటే 4వ శతాబ్ధంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఇంద్రపాల నగరాన్ని కేంద్రంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టను సైనికస్థావరంగా చేసుకుని పరిపాలన సాగించిన విష్ణుకుండినుల హయాంలోనే తెలంగాణలో తెలుగు శాసనభాషగా వాడుకలో ఉంది. 1967లో కీసరగుట్టలో లభించిన శాసనాలు ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. కీసరగుట్టలోనే ఓ పెద్ద బండరాయిపై 4-5 శతాబ్దాల మధ్యకాలం నాటి తొలచువాన్రు (శిల్పులు) అనే అక్షరాలు కనిపిస్తాయి. అంటే ఆరో శతాబ్దికంటే సుమారు 100 నుంచి 200 సంవత్సరాల కిందటనే తెలంగాణలో తెలుగు ప్రాచుర్యంలో ఉందని రాష్ట్ర ఆర్కియాలజీ నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే 3వ శతాబ్దంలో పరిపాలించిన శాతవాహనుల కాలంలో, 3 నుంచి 4వ శతాబ్దం వరకు పాలించిన ఇక్ష్వాకుల కాలంలో, తదనంతరం సాగిన విష్ణుకుండినులు పాలించిన సమయంలోనే తెలంగాణలో తెలుగుభాష అక్కడక్కడ ప్రాచుర్యంలో ఉందనే విషయం కీసరగుట్ట శాసనాలను బట్టి స్పష్టమవుతున్నదని ఆర్కియాలజీ అధికారులు తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని చైతన్యపురిలో (మూసీనది ఒడ్డున) ఉన్న పురాతనమైన కొసగండ్ల లక్ష్మీనర్సింహ్మస్వామి దేవాలయ ప్రాకృతభాష శాసనం కూడా ఇదివరకటి పాలనలో వెలుగులోకి రాకుండా పోయిందని, ఈ శాసనం కూడా విష్ణుకుండినుల కాలంలోనిదేనని రాష్ట్ర పురావస్తుశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

కలమళ్ల శాసనం ప్రప్రథమ శాసనం కాదు
రేనాటిచోళరాజు (ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా, కమలాపూరం తాలుకా ప్రాంత రాజు) ధనంజయుని కలమళ్ల శాసనంను ప్రథమ తెలుగు శాసనంగా పేర్కొంటున్నారు. కానీ ఈ శాసనం క్రీ.శ. 575 (6వ శతాబ్దం) నాటిదని ఆర్కియాలజీ విభాగం ఏనాడో గుర్తించింది. అలాగే ఈ శాసనానికి సంబంధించిన ఆనవాళ్లు కొన్ని పుస్తకాల్లోనే లిఖితమై ఉన్నాయి గానీ, ఈ శాసనాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయనే విషయంపై స్పష్టత లేదని పురావస్తుశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అక్షరం తీరుతెన్నులను ప్రాతిపదికగా చేసుకొని శాసనాల్లో లభించిన అక్షరాలు ఏ కాలానికి చెందినవి అనేది పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తిస్తారు. ఇందులో భాగంగానే క్రీ.శ.575కు సంబంధించిన ధనంజయుని కలమళ్ల శాసనం కంటే ముందుగానే తెలంగాణ ప్రాంతంలో తెలుగు శాసనభాషగా వాడుకలో ఉన్నట్టు కీసరలో లభించిన శాసనాలు స్పష్టం చేస్తున్నాయని నిర్ధారించారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/the-first-telugu-legislation-in-telangana-1-2-562139.html