తెలుగు వైభవం విశ్వవ్యాప్తం కావాలి - కెసిఆర్ - World Telugu Conference

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలుగు వైభవం విశ్వవ్యాప్తం కావాలి – కెసిఆర్

telugu-vibhavam
తెలంగాణలో వెలుగొందిన తెలుగు వైభవాన్ని, ప్రశస్తిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా తెలుగు మహాసభలను భారీఎత్తున నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఉద్దండులైన తెలంగాణ బిడ్డలు తెలుగు భాషాభివృద్ధికి చేసిన కృషిని వెలుగులోకి తేవాలని.. అన్ని తెలుగు భాషా ప్రక్రియల ప్రదర్శనలు జరగాలన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై బుధవారం సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ నందినీ సిధారెడ్డి, సీఎస్‌ ఎస్పీ సింగ్‌, సీఎంవో ముఖ్యకార్యదర్శి ఎస్‌.నర్సింగరావు, సాంస్కృతిక, పురపాలక శాఖల ముఖ్యకార్యదర్శులు బుర్రా వెంకటేశం, నవీన్‌ మిత్తల్‌, సీఎం ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్‌, తెలుగు విశ్వవిద్యాలయ వీసీ ఎస్వీ సత్యనారాయణ, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు భాషా పండితులు, తెలుగు సంఘాల ప్రతినిధులు, కవులు, రచయితలు, ప్రముఖులు మహాసభల్లో పాల్గొంటారు. వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి. పద్య, గద్య సాహిత్యం, అవధానం, జానపదం, సంకీర్తన సాహిత్యం, కథా కథన రూపాలు తదితర ఎన్నో అంశాల్లో ఉద్దండులైన తెలంగాణ బిడ్డలు తెలుగు భాషాభివృద్ధికి, భాషా వైభవానికి విశేష కృషి చేశారు.. వారిని స్మరించుకోవాలి. వందల ఏళ్ల నుంచి తెలంగాణ భాష వర్ధిల్లుతోంది. అనేక మంది కవులు, పండితులు, రచయితలేకాకుండా నిరక్షరాస్యులు బతుకమ్మ వంటి పాటల ద్వారా జానపద పరంపరను కొనసాగించారు. ఈ గొప్ప చరిత్రను ఘనంగా చాటుకునేందుకు తెలుగు మహాసభలు ఉపయోగపడాలి. ఈ సందర్భంగా తెలుగు భాషలోని అన్ని ప్రక్రియలకు సంబంధించి ప్రత్యేక వేదికల ద్వారా ప్రదర్శనలు నిర్వహించాలి. రోజూ సాయంత్రం ఎల్బీ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేయాలి.

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో తెలుగు సంఘాలున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారు. దేశవిదేశాల్లో పరిపాలన, రాజకీయాలతోపాటు చాలా రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకున్న తెలుగువారున్నారు. వారందరినీ మహాసభలకు ఆహ్వానించాలి. అమెరికాతోపాటు తెలుగు వారు ఎక్కువగా ఉన్న దేశాల్లో, ఆంధ్రప్రదేశ్‌, ఇతర రాష్ట్రాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి, ఆహ్వానాలు అందజేయాలి. మహాసభల సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో విస్తృత స్థాయి ఏర్పాట్లు చేయాలి. తెలుగు పద్యాలు, పాటలు, వివిధ ప్రక్రియలకు సంబంధించిన ఆడియోలు ప్రతిచోట వినిపించాలి. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, బస్‌స్టేషన్లలో రిసెప్షన్‌ కౌంటర్లుండాలి. ప్రతినిధులకు బస, రవాణా, భోజన సౌకర్యాలు కల్పించాలి. సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలిలు సమన్వయంతో పనిచేయాలి. పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న భాషా పండితులను ఆన్‌డ్యూటీపై మహాసభలకు ఆహ్వానించి బాధ్యతలు అప్పగించాలి’’ అన్నారు.

Source: http://www.eenadu.net/news/news.aspx?item=ts-main-news&no=5