తెలుగు విశ్వవ్యాప్తం కావాలి - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలుగు విశ్వవ్యాప్తం కావాలి

MadhusudhanaChari
దేశభాషలందు తెలుగులెస్స అని ఇప్పటివరకు చెప్పుకున్నారని, ఇప్పడు విశ్వ భాషలందు తెలుగు లెస్స అనిపించేలా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రపంచ మహాసభలు ఘనంగా జరుగుతున్నాయని రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. సోమవారం తెలుగు యూనివర్సిటీలోని బిరుదురాజు రామరాజు ప్రాంగణం.. సామల సదాశివ వేదికపై తెలంగాణ సాహితీ విమర్శ- పరిశోధన అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలుగుభాష వికాసం కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు. హైదరాబాద్ మహానగర వేదికగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లోని తెలుగు ప్రజలు తిలకిస్తూ.. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో కాకతీయుల పాలన గురించి ఒక పుస్తకం రాయాలని సంకల్పించానని, త్వరలోనే దానిని ముగిస్తానని ఆయన ప్రకటించారు.

తెలుగు సాహిత్యంపై లోతైన అధ్యయనం జరుగాలి
తెలంగాణలో సాహిత్యం కొందరి వల్ల మసకబారిందని, చాలాకాలంగా అణిచివేతకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుభాష, సాహిత్యం గురించి బయట ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం వచ్చిందన్నారు. అందుకోసం తెలుగుభాషపై లోతైన అధ్యయనం జరుగాల్సి ఉందని గోష్ఠిలో పాల్గొన్న పలువురు తెలుగు ఆచార్యులు, సాహిత్య విమర్శకులకు ఆయన సూచించారు. ఈ వేదికపై సాహిత్యానికి సంబంధించిన పలు పుస్తకాలను స్పీకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు వర్సిటీ మాజీ ఉప కులపతి ఎల్లూరి శివారెడ్డి, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, తెలుగు వర్సిటీ ఉప కులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, సాహిత్య విమర్శకులు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి, తంగెడ కిషన్‌రావు, డాక్టర్ లక్ష్మణచక్రవర్తి, బన్న అయిలయ్య, మృణాళిని పాల్గొన్నారు. ప్రముఖ పండితుడు, పరిశోధకుడు కపిలవాయి లింగమూర్తి, ప్రముఖ సాహిత్య విమర్శకుడు ఎస్వీ రామారావును శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి సన్మానించారు.

చరిత్రలో లిఖించేలా మహాసభలు
సీఎం కేసీఆర్ చరిత్రలో లిఖించేలా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సీ ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మహాసభల్లో భాగంగా తెలుగు విశ్వవిద్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు శతక, సంకీర్తన, గేయ సాహిత్యంపై జరిగిన చర్చాగోష్ఠికి ముఖ్యఅతిథిగా హాజరైన ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ సభలను సమర్థంగా నిర్వహిస్తున్నందుకుగాను తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డిని ఈ సందర్భంగా అభినందించారు. అంతకుముందు పలువురు సాహితీవేత్తలను సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు రచించిన పుస్తకాలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, నందిని సిధారెడ్డి తదితరులు వేదికపై ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సినీగేయ కవిత్వంపై ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ జానపద గేయ సౌందర్యం అనే అంశంపై పొద్దుటూరి ఎల్లారెడ్డి చేసిన ప్రసంగం సభికులను ఉర్రూతలూగించింది. తెలంగాణ లలితగేయాలు అనే అంశంపై వడ్డెపల్లి కృష్ణ ప్రసంగించారు. తెలంగాణ శతకసాహిత్యంపై డాక్టర్ తిరునగరి, తెలంగాణ పదసంకీర్తన సాహిత్యం అనే అంశంపై పీ భాస్కరయోగి ప్రసంగించారు. కార్యక్రమానికి ఆచార్య కసిరెడ్డి వెంకట్‌రెడ్డి అధ్యక్షత వహించగా.. వారిజారాణి సమావేశకర్తగా, గాజుల రవీందర్ సమన్వయకర్తగా, ప్రమోద వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సాయంత్రం ఆరుగంటలకు కవిసమ్మేళనంలో మంత్రి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/telugu-should-be-universal-1-2-562460.html