తెలుగు తేజస్సు చాటేందుకే మహాసభలు - World Telugu Conference 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలుగు తేజస్సు చాటేందుకే మహాసభలు

WTC - Australia

తెలంగాణలో ప్రకాశించిన తెలుగు భాష, సాహిత్యవైభవాన్ని ప్రపంచానికి చాటేందుకే ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నామని సీఎంవో ఓఎస్డీ, ప్రపంచ తెలుగు మహాసభల కో-ఆర్డినేటర్ దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ప్రపంచస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమి అట్టహాసంగా డిసెంబరు 15 నుంచి 19 వరకు నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సును ఆదివారం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, సిడ్నీ నగరాల్లో నిర్వహించారు. మురళి ధర్మపురి, ప్రవీణ్ పిన్నమ సమన్వయకర్తలుగా నిర్వహించిన ఈ సదస్సుకు దేశపతి శ్రీనివాస్, తెలుగు యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ఎస్వీ సత్యనారాయణ ముఖ్యఅతిథులుగా హాజరై మహాసభల ముఖ్యోద్దేశాన్ని వివరించారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణలో సామాన్య ప్రజలు మాట్లాడే తెలుగు నుడికారం అందంగా, కవితాత్మకంగా ఉంటుందని వివరించారు. పాల్కురికి, సోమన, పోతన, దాశరథి, సినారెల గురించి పాటలు పాడుతూ ఆయన చెప్పిన తీరు ఆకట్టుకుంది.

ఆస్ట్రేలియా నుంచి వచ్చే అతిథులందరికీ తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఆతిథ్యం ఇస్తామని తెలుగు యూనివర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ తెలిపారు. తెలంగాణ సాహిత్య చరిత్రలో నిర్మాణంలో ఉన్న ఖాళీలను పూరించడం, విస్మరణకు గురైన అంశాలను వెలుగులోకి తేవడం కోసమే తెలుగు మహాసభల నిర్వహణ అని పేర్కొన్నారు. ఈ సభలో రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ పాల్గొనడం విశేషం. సదస్సుకు హాజరైన పలువురు తెలుగు భాషాప్రియులు మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతికి ముప్పు ఏర్పడిన తరుణంలో వాటి పరిరక్షణకు నాందిగా తెలుగు మహాసభలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్వహించేందుకు ముందుకు రావడం తెలుగువారంతా స్వాగతించాల్సిన విషయమన్నారు. ఈ మేరకు తెలంగాణ జాతి హర్షం వ్యక్తం చేస్తున్నదని టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి కాసర్ల పేర్కొన్నారు. సన్నాహక సదస్సుకు ఆస్ట్రేలియాలో ఉన్న ప్రవాస తెలుగు సంఘాల ప్రతినిధులు, టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా ప్రతినిధులు, రచయితలు, కళాకారులు, మేధావులు పాల్గొన్నారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/telugu-preparatory-seminar-in-australia-1-2-560681.html