తెలుగు మాగాణం తెలంగాణ

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలుగు మాగాణం తెలంగాణ

telugu maganam telangana
ఎన్ని భాషలు నేర్చినా తల్లి భాషకు సాటిరావని, తెలుగు భాషకు మాగాణం తెలంగాణమని చాటుదామని, మన సాహితీ వైభావాన్ని కీర్తిస్తూ, తెలంగాణను ప్రతిష్ఠించాలని తెలుగు భాషోపాధ్యాయులతో ప్రపంచ తెలుగు మహాసభల కోర్‌కమిటీ నిర్వహించిన సమావేశం పిలుపునిచ్చింది. సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అధ్యక్షతన కళాభవన్ (రవీంద్రభారతి ప్రాంగణం)లో బుధవారం 31 జిల్లాలకు చెందిన గ్రేడ్ -1, గ్రేడ్-2 భాషోపాధ్యాయ సంఘాల ముఖ్యులు, మహాసభల కోర్ కమిటీ సభ్యులతో సన్నాహక సమావేశం జరిగింది. మహాసభల్లో తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతికి సంబంధించి చేపట్టబోయే కార్యక్రమాలను వివరించిన సిధారెడ్డి.. వీటిని ఘనంగా నిర్వహించాలని అభిలషిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భాషా పరిశోధకులు, సాహితీవేత్తలు, కళాకారులకు ఆతిథ్యం కల్పించడంతోపాటు, సభల నిర్వహణలో తెలుగు భాషోపాధ్యాయుల భాగస్వామ్యం అవసరమని కోర్ కమిటీ పేర్కొన్నది. తెలుగు మహాసభల నిర్వహణలో తమ వంతు బాధ్యతగా సేవలందిస్తామని భాషాపండితులు తెలిపారు. మహాసభల్లో పాల్గొనే ఐదు రోజులు ఆన్‌డ్యూటీగా పరిగణిస్తూ వేతనం పొందే వెసులుబాటు కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు భాషోపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

తెలుంగు ఘనమే.. తెలంగాణం:
తెలుంగు ఘనమే తెలంగాణమన్న నానుడికి పునర్వైభవం తీసుకొని రావాలని, తెలంగాణమున రాయి రప్పయున్ ..మాటాడు మనసిచ్చి అన్న సీమాంధ్ర కవి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి మాటలను నిజం చేయాలని సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి భాషా పండితులతో అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు పండితులకు ఇంటి పండుగగా భావించి విజయవంతం చేయాలని భాషా, సాంస్కృతిక కార్యదర్శి బుర్రా వెంకటేశం కోరారు. ఆధునిక యుగంలో తెలుగుభాషను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో ప్రపంచ తెలుగు మహాసభలు దిశానిర్దేశం చేస్తాయని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ తెలిపారు.

ముస్లింలకూ పండుగే!
తెలుగు మహాసభల కార్యక్రమం తెలుగు భాషోపాధ్యాయులందరికీ సంతోషం కలిగిస్తున్నదని, తన మాతృభాష ఉర్దూ అయినా మిగతా ప్రపంచంతో తమ కుటుంబం తెలుగులోనే మాట్లాడుతుందని, అందువల్ల ప్రపంచ తెలుగు మహాసభలు తమకూ పండుగేనని రంగారెడ్డి జిల్లా చిన్న మంగళారం జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మహ్మద్ అబ్దుల్ మన్నాన్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత భాష, సాహిత్యం, సంస్కృతుల పట్ల సోయి పెరిగిందని, మహాసభలను తప్పక విజయవంతం చేస్తామని చాంద్రాయణగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు విజయభాస్కర్, కరీంనగర్ జిల్లా దేశాయిపల్లి మాధ్యమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఎడవెల్లి మధుసూదన్‌రెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లా నేరెళ్ల మాధ్యమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కే సారయ్య అన్నారు.

డిసెంబర్ 1నుంచి జిల్లాల్లో సన్నాహక సదస్సులు
ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడంలో భాగంగా డిసెంబర్ 1 నుంచి పదోతేదీ వరకు రాష్ట్రంలోని 31 జిల్లాలో సన్నాహక సదస్సులు నిర్వహించనున్నారు. మన తెలంగాణము తెలుగు మాగాణము అన్న నినాదం ప్రతిధ్వనించేలా నిర్వాహకులు కృషి చేస్తున్నారు. జిల్లాల్లో సదస్సులను కలెక్టర్లు సమన్వయం చేస్తారు. సదస్సుల నిర్వహణకు ప్రతి జిల్లాకు రూ.5లక్షల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. జిల్లా గ్రంథాలయాలు ఈ సదస్సులకు వేదికలు కానున్నాయి. మరోవైపు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్ సారథ్యంలో నవంబర్ 14 నుంచి ప్రారంభమైన గ్రంథాలయ మాసోత్సవాలలో ప్రపంచ తెలుగు మహాసభలను గురించి ప్రచారం చేస్తున్నారు. ఇంకోవైపు ప్రపంచతెలుగు మహాసభల ప్రచారానికి సంబంధించి ఆరు నుంచి ఎనిమిది పాటలతో ఆల్బమ్ ఒకటి వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వంలో తయారవుతున్నది. జిల్లాల సన్నాహక సదస్సులను ఈ పాటలతోనే ప్రారంభిస్తారు.

ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన కోర్‌కమిటీ
ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించే ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను కోర్‌కమిటీ బుధవారం పరిశీలించింది. మహాసభల ప్రారంభ, ముగింపు వేదికల నిర్మాణం, ఇండోర్ స్టేడియంలో ప్రదర్శనల నిర్వహణ, కవి సమ్మేళనాల నిర్వహణ కోసం సమాలోచన చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా అతిథుల రాక, రవాణా, భోజన సదుపాయాలు మొదలైన అంశాలను కూడా ఈ సందర్భంగా చర్చించారు. గడువులోగా అన్ని కార్యక్రమాల నిర్వహణకు, అతిథుల వసతికి కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేస్తామని సాంస్కృతిక శాఖ కార్యదర్శి బీ వెంకటేశం అన్నారు. ఎల్బీ స్టేడియానికి ఎనిమిది ద్వారాలున్నాయని, వాటికి ఎనిమిది మంది తెలుగు సాహితీవేత్తలు, పండితుల పేర్లు పెడుతామని కవి, కోర్ కమిటీ సభ్యుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఎల్బీ స్టేడియం సందర్శించినవారిలో సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి, ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్‌శర్మ, స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ దినకర్‌బాబు ఉన్నారు.

మహాసభలకు మారిషస్ ఉపప్రధాని ఇవాన్ రాక
ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ వేడుకలో ప్రవాస తెలుగు ప్రజలు అధికంగా ఉండే దేశాల్లో ఒకటైన మారిషస్ ఉప ప్రధానమంత్రి ఇవాన్ లెస్లీ కొల్లెండ్వెల్లూ పాల్గొంటారని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి తెలిపారు. ప్రారంభ, ముగింపు వేడుకల్లో భారత రాష్ట్రపతికానీ, ఉపరాష్ట్రపతికానీ పాల్గొంటారని చెప్పారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/we-praise-our-literary-splendor-1-2-560334.html