అచ్చ తెలుగుకు తెలంగాణ మహిళలు ప్రతిబింబాలు – మహిళా సాహిత్య కమిటీ సభ్యులు సుభద్ర, త్రివేణి | World Telugu Conference 2017, Telangana State

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

అచ్చ తెలుగుకు తెలంగాణ మహిళలు ప్రతిబింబాలు – మహిళా సాహిత్య కమిటీ సభ్యులు సుభద్ర, త్రివేణి

‘అచ్చ తెలుగుకు తెలంగాణ మహిళలే ఆద్యురాళ్లు. ఉగ్గుపాలతో రంగరించి, పిల్లలకు భాష నేర్పించే ఆది గురువులు. కూనిరాగాలు, లాలిపాటలు, కూలిపాటలు, బతుకమ్మ, బోనాలు.. ఇలా అన్నింటా మహిళల ముద్ర కనిపిస్తుంది. సాహితీ రంగంలో అద్భుతమైన రచయిత్రులు ఇక్కడున్నారు. ఇన్నాళ్లూ మరుగునపడినవారిని వెలుగులోకి తెస్తాం. ప్రపంచ తెలుగు మహాసభల్లో మా బాణిని సగర్వంగా చాటతాం’ అని ప్రపంచ తెలుగు మహాసభల సాహిత్య కమిటీ సభ్యులు, రచయిత్రులు జూపాక సుభద్ర, వంగరి త్రివేణి అన్నారు.

Jupaka Subhadra - Telangana Government Additional Secretaryచరిత్ర సృష్టికర్తలు
– జూపాక సుభద్ర, తెలంగాణ ప్రభుత్వ అదనపు కార్యదర్శి
సాహిత్యం, కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ నిలయం. ఇందులో మహిళలకు భాగస్వామ్యముంది. చరిత్రను తెలియజెప్పింది వారే. లిఖితపూర్వకంగా లేవుగానీ అచ్చతెలుగు పడికట్టు పదాలతోసాగే వారి మాట, పాటల్లో గొప్ప సాహితీ విలువలున్నాయి. వారి ద్వారానే పిల్లలకు చరిత్ర తెలుస్తుంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ మహిళా సాహితీవేత్తలు నిర్లక్ష్యానికి గురయ్యారు. అవరోధాలున్నా జాజుల గౌరి, గోగు శ్యామల, కృష్ణవేణి, జ్యోతి ఇలా ఎందరో ప్రతిభను చాటుకున్నారు. మహిళల రచనలు, పాటల్లో చరిత్ర, జీవన సంస్కృతి ఉట్టిపడుతుంది. సంచార జాతుల మహిళలు సైతం అద్భుతమైన పాటలు పాడుతున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు ముందు నిర్వహించిన మహిళా సదస్సుకు అద్భుతమైన స్పందన వచ్చింది. మహాసభల్లో ఒక రోజంతా మహిళా సాహితీ సదస్సు జరుగుతుంది. ఇది అద్భుతమైన వేదిక. మట్టిలో ఉన్న మహిళా మాణిక్యాలను బయటికి తీస్తాం.

Dr Vangara Triveni - Assistant Professor, Telangana Universityనవ మహిళా సాహిత్యానికి పునాది
– డాక్టర్‌ వంగరి త్రివేణి, సహాయ ఆచార్యులు, తెలంగాణ విశ్వవిద్యాలయం
పపంచ తెలుగు మహాసభల వేదిక తెలంగాణ రచయిత్రులకు మార్గదర్శకంగా నిలుస్తుంది. నవ మహిళా సాహిత్యానికి పునాది అవుతుంది. రాష్ట్రంలో కథా సాహిత్యంపై మహిళా సదస్సు నిర్వహిస్తే 105 మంది హాజరయ్యారు. కవితలు, నవలలు, కథానికలు, జానపదాలు ఇలా అన్ని ప్రక్రియల్లోనూ ఎన్నో వందలమంది సాహితీవేత్తలున్నారు. బండారు అచ్చమాంబ వంటి వారి రచనలు ఎంతో గొప్పగా ఉన్నా బయటికి రాలేదు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక రాష్ట్ర్రోద్యమం వరకు అన్నింటా మహిళలు కీలకపాత్ర పోషించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి రచనలు చేస్తున్నారు. తెలంగాణ మహిళల గొప్పతనాన్ని వివరిస్తూ నేను రాసిన ‘కూరాడు’ సర్వత్రా ప్రశంసలు పొందింది. బతుకమ్మ, బోనాలతో పాటు మహిళలకు సంబంధించిన అన్ని అంశాలపై విశ్వవిద్యాలయాల్లో విస్తృత పరిశోధనలు జరగడం శుభసూచకం.

 

Source: http://www.eenadu.net/news/news.aspx?item=ts-state-news&no=7