తెలుగమ్మా నువ్విలానే వెలుగమ్మా- World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలుగమ్మా.. నువ్విలానే వెలుగమ్మా

bhatukamma

కనుసైగను చూసి కవిత్వం చెప్పే నేత్రావధానం..
బొటనవేలు కదిపితే భావం గుర్తించే అంగుష్ఠావధానం..
పద్యం, పాట.. ఏది పలికినా అందులో అక్షరాలెన్నో
అరక్షణంలో చెప్పే అక్షరగణితావధానం..
వహ్వా.. తెలుగు సాహిత్యమా..!
నీలో ఎంత మధురిమ!!
కథ, కవిత, నవల, నాటకాలతోనే
మనం అద్భుతం అనుకున్నామే..
అమ్మ భాషలో ఇంత సొగసుందని..
తేటతెలుగులో ఇంత మహత్తు ఉందని..
ఎలుగెత్తి చాటింది మాత్రం ఈ మహాసంరంభమే!!
ప్రపంచ తెలుగు మహాసభల్లో వివిధ వేదికలపై జరుగుతున్న సాహితీ ప్రక్రియలు వీక్షించిన వారికి ఇలాంటి భావాలెన్నో కలుగుతున్నాయి. ఆదివారం సెలవుదినం కావడం, అవధానం లాంటి ఆకర్షణీయమైన సాహితీ ప్రక్రియలతో మూడోరోజు కూడా ప్రపంచ తెలుగు మహాసభలకు జనసందోహం పోటెత్తింది. అనని చోట్ల వేదికలు సరిపోనంతగా కిక్కిరిసిపోవడం చూసి కవులు, సాహితీవేత్తలే కాదు ముఖ్యమంత్రి సైతం మురిసిపోయారు. వేదికలన్నీ కిటకిటలాడడంతో కవులు, సాహితీవేత్తలు, భాషాప్రేమికులు ఆవరణలు, ప్రాంగణాల్లోనే ఉండి తిలకించారు. ప్రారంభ వేడుకల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ శతావధానానికి హాజరవడంతో మరింత సందడి ఏర్పడింది. కథ, నవల, అవధానాలు, కవి సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. ఎల్బీ క్రీడామైదానం పాటల ఝరిలో ఓలలాడింది.
ఉదయం నుంచే సందడి: తెలుగు విశ్వవిద్యాలయంలో ఉదయం పది గంటలకు కథా సదస్సుకు పెద్దఎత్తున రచయితలు, సందర్శకులు హాజరయ్యారు. మధ్యాహ్నం నవలా సాహిత్యంపై జరిగిన సదస్సు కిటకిటలాడింది. విశ్వవిద్యాలయం ఆవరణలో డిజిటల్‌ తెరను ఏర్పాటు చేసి, తిలకించే అవకాశం కల్పించారు. కథా, నవలా రచయితల గోష్ఠి పోటాపోటీగా సాగింది. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన బృహత్‌కవి సమ్మేళనానికి భారీ స్పందన వచ్చింది. మందిరం నిండిపోయి బయటే చాలా మంది ఉండిపోయారు. కవులు సమయస్ఫూర్తిగా కవితలల్లి అలరించారు. రవీంద్రభారతిలో జరిగిన బాలసాహిత్య సదస్సుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు, రచయితలు వచ్చారు. పబ్లిక్‌ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన కవి సమ్మేళనంలో తెలంగాణలో తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతూ కవులు పద్యాలు, కవితలు చెప్పారు. ఎల్బీ క్రీడామైదానం ఆవరణలో నిర్వహించిన కార్టూన్‌, ఛాయాచిత్ర ప్రదర్శనలకు వేల మంది తిలకించారు. ఇదే ఆవరణలో సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో రాత్రి జరిగిన ఉత్సవాలు వేలాది మంది రాకతో ప్రారంభోత్సవం నాటి సందడిని గుర్తుతెచ్చాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటే కళాప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

అవధానమే ఆకర్షణ:
రవీంద్రభారతిలో నేత్రావధానం, అంగుష్టావధానం, అక్షరగణితావధానం, అష్టావధానం, తెలంగాణ సారస్వత పరిషత్‌లో జరిగిన శతావధానం అబ్బురపరిచాయి. సీఎం కేసీఆర్‌ గురువు మృత్యుంజయశర్మ ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థులను ప్రశంసించారు. అక్షర గణితావధానంలో చెప్పిన పదాలకు అక్షరాలను చెప్పే ప్రక్రియ ఆకట్టుకుంది.

అంతా భేషన్న ముఖ్యమంత్రి:
బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో శతావధానానికి వందల సంఖ్యలో సాహిత్యాభిమానులు వచ్చారు. వేదికలు నిండిపోవడంతో చాలా మందిని బయటికి పంపించారు. సీఎం కేసీఆర్‌ హాజరై అవధానం ముగిసే వరకు ఉండడం కవులు, రచయితల్లో ఆనందం నింపింది. రవీంద్రభారతి, తెలుగు విశ్వవిద్యాలయం, ఎల్బీ క్రీడామైదానం, సారస్వత పరిషత్‌, ఇందిరా ప్రియదర్శిని మందిరంలో అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని కేసీఆర్‌ ప్రశంసించారు. మహాసభల నిర్వహణ తీరును పరిశీలించి, భోజనాన్ని రుచి చూసి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

galli chinnadi

గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది..
తెలంగాణ సంస్కృతిని చాటిన ప్రదర్శనలు

‘గల్లీ చిన్నది..గరీబోళ్ల కథ పెద్దది’ అంటూ వాగ్గేయకారులు గోరటి వెంకన్న తనదైన శైలిలో ఆడుతూ పాడుతుంటే ప్రేక్షకులు సీట్లలో నుంచి లేచి చప్పట్లతో అభినందించారు. ‘సంత.. మా ఊరి సంత.. అయ్యా వారానికోసారి జోరుగా సాగే సంత’ జానపద నృత్యరూపకంతో గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. తెలుగు మహాసభల్లో భాగంగా ఆదివారం రాత్రి జానపద పాటలతో ఎల్బీ స్టేడియంలోని పాల్కురికి సోమన్న ప్రాంగణం హోరెత్తింది. తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్‌ నేతృత్వంలో ప్రదర్శించిన పలు కళారూపాలు, ఆనంద పారవశ్యంలో ముంచెత్తాయి. వందేమాతరం శ్రీనివాస్‌ పాడిన ‘మల్లె తీగకు పందిరి వోలే… మస్క చీకటిలో వెన్నెల వోలే చెల్లెమ్మా’ పాట ఆలోచింపచేసింది.
సీడీల ఆవిష్కరణ:
రసమయి బాలకిషన్‌, ప్రముఖ గాయకులు చింతమల్ల యశ్పాల్‌ రూపొందించిన జానపదాల సీడీలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, ఉప శాసనసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, నందిని సిధారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పిడమర్తి రవి, బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ బీఎస్‌ రాములు తదితరులు ఆవిష్కరించారు. గోరటి వెంకన్న రచించిన పుస్తకాన్ని రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులు జూలూరి గౌరీశంకర్‌కు అంకితమిచ్చారు. నాగలింగ శివయోగిపై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

గోరటి వెంకన్నకు డాక్టరేట్‌ కోసం ప్రయత్నిస్తా
గోరటి వెంకన్నకు రాష్ట్రంలోని ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.

Source: http://www.eenadu.net/world-telugu-conference/world-telugu-conference-news.aspx?article=271