మన సంస్కృతికి అద్దంపట్టాలి - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

మన సంస్కృతికి అద్దంపట్టాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాష్ట్ర సంస్కృతి, జీవనానికి అద్దంపట్టేలా వేదికలను అలంకరించాలని, తెలంగాణ మహనీయులను గౌరవిస్తూ వేదికలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. అంతకుముందు సాహిత్య సభలు, సాంస్కృతిక ప్రదర్శనల నిర్వహణ, ప్రతినిధులకు వసతుల కల్పనకు ఎల్బీ స్టేడియంలో చేపడుతున్న ఏర్పాట్లను పలువురు మంత్రులు, మహాసభల కోర్‌కమిటీ సభ్యులతో కలిసి స్వయంగా పరిశీలించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా వేదిక, స్వాగత ద్వారాలు, స్టేడియం అలంకరణ ఉండాలని చెప్పారు. తెలంగాణ ప్రతిష్ఠను పెంచేలా వసతులు కల్పించేందుకు కోర్ కమిటీ సభ్యులకు పలు సూచనలుచేశారు. ఎల్బీ స్టేడియం మొత్తం కలియతిరిగిన కేసీఆర్.. ఏ ప్రదేశంలో వేదిక నిర్మించాలో, ఏయే ప్రదర్శన శాలలు ఎక్కడ ఉండాలో నిర్దేశించారు. అనంతరం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం.. ప్రధాన వేదికైన ఎల్బీ స్టేడియంలో కవి సమ్మేళనాలు, అవధానాలు, సంగీత కార్యక్రమాలతోపాటు పుస్తక ప్రదర్శన, హస్తకళల ప్రదర్శన, పురావస్తు ప్రదర్శన ఏర్పాటుకు సూచనలు చేశారు. ఎల్బీ స్టేడియంలో ప్రతిరోజూ సాయం త్రం సంగీత, సాంస్కృతిక ప్రదర్శనలు ఉండాలని చెప్పారు.
World Telugu Conference 2017 - Opening Platform
రవీంద్రభారతి థియేటర్, రవీంద్రభారతి మినీహాలు, పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్, తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం, భారతీయ విద్యాభవన్, తెలుగు లలితకళాతోరణం, ఇందిరా ప్రియదర్శని ఆడిటోరియం, ఎల్బీ ఇండోర్ స్టేడియాల్లో సాహిత్య సభలు నిర్వహించాలని చెప్పారు. ప్రారంభ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి, ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి వస్తున్నారని, ఈ రెండు కార్యక్రమాలు ఎల్బీ స్టేడియంలోనే నిర్వహించాలని సూచించారు. పార్కింగ్, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఏర్పాట్లుచేయాలని చెప్పా రు. మహాసభల సందర్భంగా ఒక రోజు తెలుగు సినీ సంగీత విభావరి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఆహార్యం, ఆహారం, సంస్కృతి, కళలు, జీవి తం, పండుగలు పతిబింబించేలా డాక్యుమెంటరీని రూపొందించి, మహాసభల సందర్భంగా ప్రదర్శించాలని సూచించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంతి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, పర్యా టక, సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, స్పోర్ట్ అథారిటీ ఎండీ దినకర్‌బాబు, సాహిత్య అకాడమి చైర్మన్ నందిని సిధారెడ్డి, సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి, నగర పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు, సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మహాసభల పర్యవేక్షణకు మంత్రివర్గ ఉపసంఘం
ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని ఈ కమిటీలో సాంస్కృతికశాఖ మంత్రి చందూలాల్, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సభ్యులుగా ఉంటా రు. సాహిత్య అకాడమీతోపాటు ఇతర సంస్థలు, అధికారుల సమన్వయంతో ఈ కమిటీ తెలుగు మహాసభల ఏర్పాట్లను పర్యవేక్షించనున్నది.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/cm-kcr-inspects-world-telugu-conference-arrangements-at-lb-stadium-1-2-561310.html