తెలంగాణ చరిత్ర – సంస్కృతి | World Telugu Conference 2017, Telangana State

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలంగాణ చరిత్ర – సంస్కృతి

తెలంగాణ సుందరమైన ప్రదేశం. భౌగోళికంగా సుసంపన్నమైన ప్రాంతం. నదులు, అడవులు, కొండలు, చెరువులు, వాగులు, నల్ల, ఎర్రరేగడి భూములు, గనులు, ఖనిజాలతో విలసిల్లుతున్నది. తూర్పున కందికల్‌ గుట్టల వరుస, పడమట బాలాఘాట్‌ పర్వతశ్రేణులు, ఉత్తరాన గోదావరీనది, దక్షిణాన కృష్ణానది సహజ సరిహద్దులుగా నెలకొని ఉన్న ప్రాంతం ఇది. గోదావరి నానుకొని దండకారణ్యం, కృష్ణనానుకొని నల్లమల అడవులు సహజ సంపద నిలయాలుగా ఉన్నాయి. భౌగోళికంగా ఎన్నో అనుకూలతలు, వనరులు ఉన్న ప్రదేశం కావటం వల్ల స్థానికంగా ఎంతో గొప్ప చరిత్ర, నాగరికత, సంస్కృతి వికసించినాయి.

తెలంగాణం:

నదులు, కొండలు, అడవులు అల్లుకొని ఉన్న ప్రదేశం కనుక వీటిని నమ్ముకొని ఎన్నో గిరిజన తెగలు జీవిస్తూ వచ్చాయి. కోయలు, గోండులు, చెంచులు, గుత్తికోయలు, కొండరెడ్లు, రాజ్‌గోండులు కోలాములు మొదలైన ఆదివాసులు తమ ప్రత్యేక విధానాలతో జీవనం సాగిస్తున్నారు. క్రీస్తు పూర్వం వేల సంవత్సరాల నుంచి ఉనికిలో ఉన్న గోండులు ప్రాచీన ఉత్పత్తి కథను చెప్పుకుంటూ ‘ టేకం, మార్కం, పూసం, తెలింగం’ అనే నలుగురు మూలపురుషుల్ని దేవతలుగా పేర్కొంటారు. ఇందులో ‘తెలింగం’ ప్రాచీన తెలుగు జాతి మూలపురుషుడని ఆరుద్ర భావించాడు. ఖండవల్లి లక్ష్మీపురం జనం స్థానికంగా ప్రాచీన కాలం నుంచి ‘తలైంగ్‌’ జాతివారు నివసించారని ‘తలైంగ్‌’లు నివసించినందు వల్ల ‘తిలింగ’ ‘తెలుంగు’ పదాలు వాడుకలోకి వచ్చాయని, వారు మాట్లాడే భాష ‘తెలుంగు’ అని, ఆ జాతి ‘తెలుంగు’ లని ఖండవల్లి సోదరులు భావించినారు. బర్మాలో నివసిస్తున్న ఒక తెగ ఇప్పటికీ తాము ‘తలైంగ్‌’ జాతి వారమని చెప్పుకొంటారని పేర్కొన్నారు. మార్కండేయ, వాయు పురాణాల్లో ‘తిలింగ’ ప్రస్తావనవుంది. గ్రీకుశాస్త్రజ్ఞుడు టాలెమి తన యాత్రాచరిత్రలో ‘టిలింగాన్‌’ పదాన్ని పేర్కొన్నాడు. ఈ ‘తిలింగ’ శబ్దమే ‘తెలుంగు’ శబ్దానికి మూలం. ‘తెలుంగు’ ‘గణం’ కలిసి ‘తెలుంగణం’గా మారినట్లు భావించవచ్చు. మెదక్‌ జిల్లా తెల్లాపూర్‌లో బయట పడిన క్రీ॥శ॥ 1417 నాటి శాసనంలో ‘తెలుంగణ’ పదం, 1510 వెలిచర్ల శాసనంలో ‘తెంగాణ’ పదం ప్రయోగించబడింది. అనంతర కాలంలో, వ్యవహారాల్లో ‘తెలంగాణ’ పదం విస్తృత ప్రచారంలోకి వచ్చింది.

చరిత్ర:

క్రీ.పూ. 600 – 400 కాలానికి సంబంధించిన వెండి నాణాలు బయటపడిన తర్వాత పురావస్తు పరిశోధన ఆధారంగా ‘గోపరాజు’లు పరిపాలించినట్లు చరిత్ర కారుల భావన. తర్వాత కాలంలో క్రీ.పూ 200 నుంచి క్రీ.శ. 200 వరకు శాతవాహనులు పరిపాలించినట్లు తెలుస్తుంది. తర్వాత విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, వేముల వాడ చాళుక్యులు, వాకాటకులు పరిపాలించారు. తదనంతరం కాకతీయుల సామ్రాజ్యం క్రీ.శ. 950 నుండి 1323 వరకు విస్తరిల్లింది. మునునూరు నాయకులు, పద్మనాయకులు, బహమనీలు (క్రీ.శ.1518 – 1686) అసఫ్‌ జాహీలు (క్రీ.శ. 1724 – 1948) తెలంగాణ నేలను పరిపాలించారు.

సంస్కృతి:

ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. వ్యవసాయం ఆధారంగానే గ్రామాలు, చెరువులు, వృత్తులు, సంస్కృతులు నిర్మించబడుతూ వచ్చినాయి. నదులున్నప్పటికీ వాటిని వ్యవసాయానికి అనుగుణంగా మలుచుకునే సాంకేతికాభివృద్ది జరుగకపోవడం వల్ల వర్షాధారంగా వ్యవసాయం సాగింది. నీటి పారుదలకు ఉదక యంత్రాలు, ఏతాలు ఉపయోగించేవారు. కాకతీయరాజులు తీసుకున్న ప్రత్యేక శ్రద్ద వల్ల నీటిపారుదల కోసమే చెరువుల నిర్మాణం అధికంగా జరిగింది. పెద్ద చెరువులు, గొలుసు చెరువులు, చెరువుల వ్యవస్థ ప్రత్యేకంగా కనిపించటం వల్ల అప్పట్లో ఈ ప్రదేశాన్ని ‘చెరువులదేశం’గా పిలిచేవారు. వరి, గోధుమ, నువ్వులు, పత్తి తృణధాన్యాలతో పాటు తోటల పెంపకం కూడా కొనసాగింది. ఆ క్రమంలో ‘బాగ్‌’ల విస్తరణ ‘బాగ్‌’ (తోటలు)కు నెలవైన నగరం కనుకనే హైదరబాద్‌కు ‘బాగ్‌నగర్‌’ అనే పేరొచ్చింది.

వ్యవసాయం చుట్టూ అనేక వృత్తులు ఏర్పడ్డాయి. పనిముట్లు చేసేవారు. అవసరాలు చూసేవారు, పనులు చేసేవారు వివిధ వృత్తులుగా మార్పు చెందుతూ వచ్చినాయి. పురోహితులు, కంసాలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, పద్మశాలి, గొల్ల, బెస్త, గౌండ్ల, గాండ్ల, చర్మకార, వడ్డెర, ఎన్నో వృత్తులు కొనసాగుతూ వచ్చినాయి. శాతవాహనుల కాలం నాటికే నిర్మల్‌ కత్తులు ప్రసిద్ది పొందినాయి. పట్టు వస్త్రాలకు పోచంపల్లి, గద్వాల, ప్రపంచ ప్రసిద్ధి పొందినాయి. వ్యవసాయం, ఉత్పత్తులు, గ్రామం చుట్టూ ఎంతో జానపద సంస్కృతి పండుగలు, జాతరులు వర్థిల్లినాయి. రుంజలు, బైండ్లు, వొగ్గుకథ, శారదకథ, హరికథ, చిందు భాగోతం, బాల సంతులు, బుడిగెజంగాలు, గంగిరెద్దులు, సాధనాశూరులు, బహురూపులు, పెద్దమ్మలు, గుసాడీ నృత్యం, చెంచు, కోయ, బంజారా ప్రదర్శనలు కళకళనాడినాయి. బతుకమ్మ, బొడ్డెమ్మ, బోనాలు, వనభోజనాలు, పీరీలు, దసరా, రంజాన్‌, కాట్రావులు, కొత్తలు, సంక్రాంతి, ఉగాది, పెద్దలకు పండుగ, ఊరికి పండుగులు ఎన్నో కొనసాగుతున్నాయి.

పేరిణ తాండవం, లాస్యం, భజనలు, చిరుతలు, శిల్పకళళ, పెంబర్తి జ్ఞాపికలు, నిర్మల్‌ బొమ్మలు, నకాశి చిత్రాలు, కరీంనగర్‌ వెండిపనులు ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాయి. సమ్మక్క, సారక్కలు, బల్మురికొండల రాయుడు, సర్వాయి పాపన్న, రాణశంకరమ్మ, సోమనాద్రి, సదాశివరెడ్డి, రాంజీగోండు, కొమురంభీం, బండిసాయన్న, ఆరుట్ల రామచంద్రారెడ్డి, రేణుకుంటరామిరెడ్డి ఎందరోవీరుల సాహసగాధలు కళారూపాలు సంతరించుకొని వీరగాధలుగా విస్తరిస్తున్నాయి.

ఉద్యమాలు:

తెలుగు భాషా ఉద్యమాలు, గ్రంథాలయ ఉద్యమాలు, ఆంధ్రమహాసభ, ఆర్యసమాజం, రైతాంగ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, విప్లవోద్యమం, మద్యపాన వ్యతిరేకోద్యమం, జలసాధనోద్యమం, హరితహారం అనేక ప్రజా ఉద్యమాలు వర్థిల్లి ప్రజాసమూహాలను చైతన్య పరుస్తున్నాయి. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలు ప్రజలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి.

తెలుగు భాష:

తెలంగాణ ప్రజలు వ్యవహరించే తెలుగు విశేషమైంది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిఉంటుంది. గ్రాంధికానికి, మంచి తెలుగుకు దగ్గరగా, వ్యాకరణ ప్రమాణాలతో కూడి ఉంటుంది. లయ బద్ధంగా ఉండటం వల్ల, ద్రుతాత్మకంగా ఉచ్చరించడం వల్ల వినసొంపుగా ఉంటుంది. జీవితానుభవాలలో వికసించిన సామెతలు, నానుడులు, పలుకు బడులు సహజంగానే ఇమిడి ఉండటం వల్ల అర్థవంతమై అలరిస్తుంది. సహజత్వం, సరళత్వంతో పాటు సృజనాత్మకంగా సాగిపోతుంది. భావాలను ప్రసన్నంగా వ్యక్తం చేసే పద్ధతివల్ల ‘జాను తెనుగు’గా ప్రశంసలందుకున్నది. కమ్మని ధ్వనులకు, కమనీయ అలంకారాలకు నెలవైన భాష. జానపద గీతాలకైనా, పద్యకావ్యాలకైనా, అలవోకగా ఒదిగిపోయే అందమైన భాష. సంస్కృత, ఉర్దూ, ఫారశీ, అరబ్బీ, ఆంగ్ల, హిందీ పదాలను కలుపుకోగల విశాలతత్వం వల్ల పదవిస్తృతి సాధించి కొత్త సొబగులతో పురోగమించే భాష.

సాహిత్యం:

తెలుగులో తొలి ప్రాచీన కంద పద్యాలు బొమ్మలమ్మగుట్ట శాసనంలో లభించి క్రీ.శ. 9 శతాబ్ది నాటికే ఛందోబద్ద సాహిత్యమున్నదని నిరూపిస్తున్నాయి. కన్నడంలో, తెలుగులో పద్యాలు రాసిన పంపమహాకవి చరిత్ర తెలంగాణ గర్వకారణం. మల్లియరేచన రచించిన ‘కవిజనాశ్రయం’ తెలుగులో తొలిఛందోగ్రంథం. ‘వృషాథిప శతకం’ పేరుతో తొలిశతకాన్ని పాల్కురికి సోమన రచించాడు. తొలిచతురర్థి కావ్యం తెలంగాణ నుంచి వచ్చింది. మరింగంటి సింగరాచార్యులు రచించిన నలరాఘవ యాదవపాండవయం ఏకామ్రనాధుడు రచించిన ‘‘ప్రతాపరుద్ర చరిత్రము” తెలుగులో తొలి చరిత్ర గ్రంథం. అదే విధంగా మొదటి అచ్చతెనుగు కావ్యం ‘‘యయాతిచరిత్ర’’ను పొన్నగంటి తెలుగన రచించాడు.

బహుముఖ ప్రజ్ఞా వంతుడు సామాజిక చైతన్యానికి బీజంవేసిన పాల్కురికి సోమన తెలంగాణ ఆదికవి. సంస్కృతం, తెలుగు భాషల సమన్వయంతో, పురాణగాథలను మన జీవితంలో అనుసందానించుకొని కడు మనోహరంగా సృజించిన బమ్మెరపోతన ‘శ్రీ మద్భాగవతం’ ప్రత్యేక రచన. వీరశైవ సాహిత్యం విస్తరించినంత గంభీరంగా వైష్ణవ సంప్రదాయాన్ని నిలబెట్టిన సాహిత్య సృష్టి జరిగింది. గోనబుద్దారెడ్డి ‘రంగనాథ రామాయణం’ ద్విపద ఛందంలో సాగినా హుళక్కి భాస్కరుడు ‘భాస్కర రామాయణం’ సంప్రదాయ ఛందంలో సాగినా ఇక్కడి రాజ ప్రజాభిరుచికి ప్రతిబింబాలే. గౌరవ ‘హరిశ్చంద్రోపాఖ్యానం’ రచించి సత్యనిరతిని చాటి చెప్పాడు. విద్యానాధుడు రచించిన ‘ప్రతాపరుద్రయశోభూషణం’ లక్షణాలంకార శాస్త్ర గ్రంథాలకే తలమానికం. తొలిసంకలన గ్రంధాన్ని ‘సకలనీతిసమ్మతం’ సంకలనం చేసిన ఉదార సాహితీ హృదయుడు మడికిసింగన. స్వతంత్ర కావ్యకర్త అయినా ఇతర కవులను సంకలనం చేసి కొత్త దారివేశాడు. చరిగొండ ధర్మన కాల్పినిక భావనలను ప్రవేశపెట్టి ‘చిత్ర భారతాన్ని’ సృష్టించాడు. తెలంగాణ సామాజిక చిత్త వృత్తాన్ని సంస్కృతీ విశేషాల్ని ప్రత్యేక కావ్యంగ మలిచి కొఱవి గోపరాజు ‘సింహాసన ద్వాత్రింశిక’ రచించాడు. జానపద, సాంప్రదాయిక, ప్రజాస్వామిక సాహిత్యాలు విస్తృతంగా వర్థిల్లినాయి.