900 మందితో బృహత్ కవిసమ్మేళనం – రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి | World Telugu Conference 2017, Telangana State

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

900 మందితో బృహత్ కవిసమ్మేళనం – రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఎల్బీస్టేడియంలో 16వ తేదీ ఉదయం నుంచి 19వ తేదీ మధ్యాహ్నం వరకు బృహత్ కవి సమ్మేళనాన్ని 35 విభాగాలుగా నిర్వహిస్తామని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు 900 మంది పద్య, వచన కవులు హాజరవుతారని సమాచారం ఉన్నదని శనివారం సాహిత్య అకాడమీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఒక్కో విడతలో 25 మంది కవులు కవితాపఠనం చేస్తారని, అనుభవజ్ఞులైన ఇద్దరు కవుల కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కవుల సంఖ్య పెరిగితే మరిన్ని విభాగాలుగా బృహత్ కవిసమ్మేళనాన్ని నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ సారస్వత పరిషత్తులో శతావధానం నిర్వహిస్తామని, వంద మంది పృచ్ఛకులు ప్రశ్నిస్తుంటారని వివరించారు. 16 నుంచి 19 మధ్యాహ్నం వరకు వివిధ సాహిత్య ప్రక్రియలపై చర్చాగోష్ఠులు నిర్వహిస్తామని చెప్పారు. 16, 17 తేదీల్లో బాలసాహిత్యం, 18న మహిళా సాహిత్యంపై చర్చాగోష్ఠులు ఉంటాయని తెలిపారు. 16 నుంచి ప్రతిరోజు శాస్త్రీయ, సంగీత నృత్య ప్రదర్శనలు, అవధానాలు, 17న పత్రికాభాషలో తెలుగుపై సదస్సు, 18న న్యాయవ్యవహారాలు-ప్రభుత్వపాలనలో తెలుగుభాషపై సదస్సులు ఉంటాయని వివరించారు.Telangana Sahithya Akademi Chairman Sidda Reddy on World Telugu Conferences 2017 - Arrangements

19న మధ్యా హ్నం వరకు ప్రాచీన తెలంగాణ- చరిత్ర, భాష, సంస్కృతులపై సదస్సులు జరుగుతాయని తెలిపారు. లలిత కళాతోరణంలో జానపదకళల ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. మహాసభల ప్రారంభం రోజున ప్రతినిధులందరికీ తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని తెలియజేసే పుస్తకం, వాగ్భూషణ భూషణం, మందారమకరందాల పుస్తకాలు పంపిణీ చేస్తామని తెలిపారు. హైదరాబాద్ బ్రదర్స్ శాస్త్రీయ సంగీత కచేరి, అలేఖ్య నృత్యకళారూపక ప్రదర్శన, లండన్ పార్లమెంట్‌లో నృత్యప్రదర్శనలు ఇచ్చిన విజమూరి రాగసుధ నృత్యప్రదర్శనలు మహాసభలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు.

జిల్లాల్లో మరో వంద స్వాగత తోరణాలు

ప్రపంచ తెలుగు మహాసభల విశిష్టతను చాటిచెప్పేలా రాజధానిలోని ప్రధానకూడళ్లలో వంద మంది తెలంగాణ వైతాళికుల స్వాగత తోరణాలను ఏర్పాటుచేస్తున్నామని నందిని సిధారెడ్డి చెప్పారు. జీహెచ్‌ఎంసీ మినహా అన్నిజిల్లాలో సైతం మరో వంద స్వాగత తోరణాలను ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. ఇటీవల కన్నుమూసిన గొప్ప ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య పేరిట స్వాగత తోరణం ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, విమానాశ్రయాల వద్ద తెలుగు మహాసభల కార్యక్రమాల వివరాలను తెలియచేసే కియోస్క్‌లు ఏర్పాటుచేశామని పేర్కొన్నారు.

తెలుగు మహాసభల్లో హస్త, చేనేత ప్రదర్శనలు

తెలుగు మహాసభల సందర్భంగా ప్రధాన వేదికైన ఎల్బీ స్టేడియంలో తెలంగాణ చరిత్రను తెలిపే పుస్తక, చిత్ర, శిల్ప, హస్తకళ.. పురావస్తు ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్టు నందిని సిధారెడ్డి తెలిపారు. చేనేత వైభవాన్ని చాటే పోచంపల్లి ఇక్కత్, సిద్దిపేట గొల్లభామ చీరలు, నారాయణపేట కోటకొమ్ముల వస్ర్తాలు ప్రదర్శనలో ఉంటాయని చెప్పారు. నిర్మల్ బొమ్మలు, పెంబర్తి ఇత్తడి కళాఖండాలు, కరీంనగర్ ఫిలిగ్రీ, ఆదిలాబాద్ డోక్రా ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని తెలుపుతూ శతాబ్దాల కిందటే ప్రచురితమైన 200కుపైగా పుస్తకాలు ప్రదర్శనలో ఉంటాయని వివరించారు. చిత్ర ప్రదర్శన, ఫొటో ప్రదర్శన, పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ప్రాచీన నాణేలు, రాజపత్రాలు, పురాతన వస్తువులు, శాసనాలు ప్రదర్శిస్తామని తెలిపారు. ఇవన్నీ ఇండోర్ స్టేడియం లోపల ఉంటాయని, బయట పుస్తకాల, వంటల ప్రదర్శన ఉంటాయని వివరించారు.

వాదోపవాదాలతో తిరుపతి సభలకు వెళ్లలేదు

తెలంగాణ ఉద్యమ సమయంలో 2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు సమైక్యవాదానికే ఉపయోగపడుతున్నాయని ఉద్యమకారులందరూ భావించారని నందిని సిధారెడ్డి చెప్పారు. ఆ సభలపై వాదోపవాదాలు రావడంతో హాజరుకాకపోవడమే మంచిదనే అభిప్రాయాలు వచ్చాయని, అందుకే తాను వెళ్లలేదని వివరించారు. ప్రస్తుత సందర్భంలో ఏపీ నుంచి కవులు, పండితులు, విమర్శకులు, ఎక్కువ సంఖ్యలో హైదరాబాద్‌కు వచ్చేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రాచుర్యం పొందిన ప్రాంతాలుగా విడిపోదాం.. అన్నదమ్ముల్లా కలిసి బతుకుదాం నినాదం ఇప్పుడు అక్షరసత్యమవుతున్నదని తెలిపారు. వ్యత్యాసాలు, తారతమ్యాలను మరిచిపోయి తెలంగాణలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ హాజరుకావాలని విజ్ఞప్తిచేశారు.

వివిధ సాహిత్య ప్రక్రియలు-వేదికలు

తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం: 
-డిసెంబర్ 16 నుంచి 19 మధ్యాహ్నం వరకు పద్యం, కవిత, గేయ, కథ, నవల, కథానిక, సంకీర్తనా సాహిత్యం, విమర్శనా సాహిత్యంపై చర్చాగోష్ఠులు నిర్వహిస్తారు. నిత్యం మూడు సదస్సులు జరుగుతాయి.
-విమర్శ సాహిత్యంలో రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, కథా సాహిత్యానికి కాళీపట్నం రామారావు (కారామాస్టారు) అతిథులుగా హాజరవుతారు.
-కాళీపట్నంను తెలంగాణ ప్రభుత్వం తరపున ఘనంగా సత్కరిస్తారు.

ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం:

-16, 17 తేదీల్లో రెండురోజులు బాలసాహిత్యంపై చర్చాగోష్ఠుల్లో బాలకవి ఎడ్ల శ్రీకాంత్ అష్టావధానం, బాలకవి సమ్మేళనం ఉంటుంది.
-18న మహిళా సాహిత్యంపై చర్చాగోష్ఠుల్లో ఆధునిక సాహిత్యంలో మహిళలు, మహిళా కవయిత్రుల సమ్మేళనం ఉంటుంది. 19న విదేశీ, వివిధ రాష్ర్టాల ప్రతినిధులతో చర్చాగోష్ఠులు.

రవీంద్రభారతి:

-16 నుంచి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రవీంద్రభారతి ప్రధాన ఆడిటోరియంలో శాస్త్రీయ, సంగీత నృత్య ప్రదర్శనలు. మినీ ఆడిటోరియంలో అష్టకాల నరసింహారావు, ముదిగొండ ఆంగీరసశర్మ, ములగ అంజయ్యల అవధానాలు ఉంటాయి.
-17న పత్రికాభాషలో తెలుగుపై సదస్సుకు వివిధ పత్రికల సంపాదకులు హాజరవుతారు.
-18న న్యాయ వ్యవహారాలు- ప్రభు త్వ పాలనలో తెలుగుభాషపై సదస్సు ఉంటుంది. కేంద్ర సమాచారహక్కు చట్టం కమిషనర్ మాడభూషి శ్రీధర్, జింబో తదితరులు హాజరవుతారు.
-19న మధ్యాహ్నం వరకు ప్రాచీన తెలంగాణ – చరిత్ర, భాష, సంస్కృతిపైన సదస్సులు జరుగుతాయి.

Source: https://www.ntnews.com/Prapancha-Telugu-Mahasabhalu-2017/elaborate-arrangements-on-for-world-telugu-conference-1-2-561743.html