తెలంగాణ ఖ్యాతి చాటుతాం -World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలంగాణ ఖ్యాతి చాటుతాం

kadiyam srihari

తెలుగు భాష గొప్పదనాన్ని, తీయదనాన్ని…తెలంగాణ ఖ్యాతిని చాటడమే ప్రపంచ తెలుగు మహాసభల లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి, మహాసభల ఏర్పాట్లపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఛైర్మన్‌ కడియం శ్రీహరి చెప్పారు. తెలంగాణ భాష, యాస, చరిత్ర, సంస్కృతిని ప్రపంచానికి తెలియజెబుతామన్నారు. ఈ నెల 15న ప్రారంభమయ్యే మహాసభలకు అన్ని ఏర్పాట్లు పూర్తికావస్తున్నాయని, హాజరయ్యే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. మహాసభల సందర్భంగా బుధవారం ఆయన ‘ఈనాడు-ఈటీవీ’ ముఖాముఖీలో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరుగుతున్న తెలుగు మహాసభల లక్ష్యం ఏమిటి?
తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతి మరుగునపడింది. చరిత్రనూ సక్రమంగా రాయలేదు. దాన్ని వెలుగులోకి తీసుకురావాలి. కొత్త రాష్ట్రం ఖ్యాతిని కూడా చాటాలి. అందుకే ఎందరో మహనీయులపై గ్రంథాలు ప్రచురిస్తున్నాం. వారి పేర్లను స్వాగత ద్వారాలకు, ప్రాంగణాలకు, వేదికలకు పెడుతున్నాం. హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లాల్లోనూ హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల వారందరి గురించి ఇప్పటితరానికి పరిచయం చేసినట్లవుతుంది.
మహాసభల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి?
మహాసభలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించినట్లుగా ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి మంచి స్పందన వచ్చింది. దాదాపు 8 వేల మంది పేర్లు నమోదు చేసుకొని ప్రతినిధులుగా హాజరవుతున్నారు. తెలుగు మాట్లాడేవారంతా ఆహ్వానితులే. హైదరాబాద్‌ నుంచి నమోదు చేసుకున్న వారికి తప్ప మిగతా వారందరికీ వివిధ హోటళ్లలో వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. వేదికల వద్ద మధ్యాహ్న భోజనం కల్పిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిన ప్రతినిధులు, ఇతర ముఖ్యులకు హైదరాబాద్‌లో దిగినప్పటి నుంచి తిరిగి వెళ్లేవరకు ఇబ్బంది లేకుండా వలంటీర్లను ఏర్పాటు చేస్తున్నాం.
ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే ఉద్యోగాలు వస్తాయన్న అభిప్రాయం బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ‘తెలుగు తప్పనిసరి’ ఎలా అమలు చేస్తారు?
చదువులు ఎవరికి ఇష్టమైన భాషలో వారు చదువుకోవచ్చు. కాకపోతే తెలంగాణలో 12వ తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా తెలుగును చదవడం తప్పనిసరి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అన్ని పాఠశాలల్లో అమలు చేస్తాం. ఇతర రాష్ట్రాల నుంచి బదిలీపై వచ్చేవారికి తెలుగు పాఠ్యపుస్తకం స్థాయి తక్కువగా ఉంటుంది.
పాలనా వ్యవహారాల్లో తెలుగు భాష అమలు తగ్గిపోతోంది కదా?
ఆంగ్లేయులు, నిజాం రాజుల పాలన ప్రభావంతో ఆంగ్లం, ఉర్దూలో పాలనా వ్యవహారాలు జరిగాయి. తెలంగాణలో తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు, పాలనపరమైన ఉత్తర్వులు ఉండాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. శాసనసభ పత్రాల్లోనూ వాడుక భాషను ప్రవేశపెట్టాలి.
మహాసభల్లో ప్రభుత్వం తీర్మానాలు చేస్తుందా?
దీనిపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. సభల ప్రారంభ, ముగింపు సందర్భంగా జాతీయ గీతం ఆలపిస్తాం.

Source: http://www.eenadu.net/news/news.aspx?item=main-news&no=4