తెలుగుభాష పుట్టిననేల తెలంగాణ | World Telugu Conference 2017, Telangana State

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలుగుభాష పుట్టిననేల తెలంగాణ

Writer, Poet and Chairman of Telangana Sahithya Akademi (TSA)- Nandini Sidda Reddy
తెలుగుభాష పుట్టిన నేల, జన్మభూమి, జన్మస్థలం తెలంగాణ. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు అని తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో పరిఢవిల్లిన భాషా సాహిత్య వారసత్వ చరిత్రల నిండా ఇందుకు ఆనవాళ్లు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢసంకల్పానికి, సాహిత్యాభిమానానికి, కార్యదక్షతకు ప్రపంచ తెలుగు మహాసభలు నిలువుటద్దాలు.. గొప్ప ఉదాహరణలుగా నిలుస్తాయని అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆయన నమస్తే తెలంగాణ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు..

తెలంగాణ తెలుగుభాషకు ఏ విధంగా జన్మభూమి?

ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య సంపుటాలలో వివరించినట్లుగా గోండుల మూలపురుషుడికి నలుగురు కుమారులు.. వాళ్లు వరుసగా టేకం, మాసం, పూనమ్, తెలింగం. ఈ విధంగా నాలుగో కుమారుడైన తెలింగం వారసులే తెలుంగువాళ్లు. వాళ్లు మాట్లాడేభాష తెలుంగు. బర్మాకు వలసవెళ్లిన త్లైంగ్‌లు కూడా తెలుగువాళ్లే. అందువల్ల తెలుంగు మాట్లాడే గణమే తెలంగాణము. కాలక్రమంలో ఇది తెలంగాణ ప్రాంతంగా రూపుదిద్దుకున్నది. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతులు మూలాలుగా కలిగి భాసిల్లిన గణమే తెలంగాణము. తెలంగాణమే తెలంగాణ మాగాణం. అందుకే ప్రపంచ తెలుగు మహాసభల నినాదంగా మన తెలంగాణము – తెలుగు మాగాణము అని చేర్చుకున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ పదబంధం చాలా ఇష్టమైనది. శాతవాహనులకు పూర్వమే తెలుగుభాష ఆనవాళ్లు ఉన్నాయని చరిత్ర పరిశోధకులు ఇప్పటికే చాలా ఉదాహరణలను వెలికితీశారు. తెలంగాణలో వర్ధిల్లిన కవి నారన. ఈ నారన నుంచి తెలంగాణలో విస్తృతంగా వాడుకలో అన్న అనే పదం వచ్చింది. పోతన, పాల్కురికి సోమనలను కూడా ఇందుకు ఉదాహరణలుగా తీసుకోవచ్చు. క్రీ.పూ. 250 నాటికే తెలంగాణలో తెలుగు వాడుకలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇకపోతే ప్రపంచ ప్రసిద్ధిచెందిన హాలుడి గాథాసప్తశతిలోని ప్రాకృత ఛందస్సులో అత్త అనే పదం ఉన్నది. దీనిని సుప్రసిద్ధ పాత్రికేయులు తిరుమల రామచంద్ర నిరూపించారు. కరీంనగర్‌లో క్రీ.శ. 947 నాటి కురిక్యాల శాసనంలోని కందపద్యం ఆధారంగా నన్నయ్యకు 150 సంవత్సరాల పూర్వమే తెలంగాణలో చందోబద్ధ రూపాలనేవి ఉన్నట్లు స్పష్టమయింది. పంపన రాసిన వృత్తాలు తెలంగాణ భాష చారిత్రక వారసత్వ సాహిత్య వైభవాన్ని చాటిచెప్తున్నాయి. ఇటువంటి మహత్వ సాహిత్య ఘన వారసత్వ సంపదను ప్రపంచపటంమీద సుస్థిరం చేయడమే ప్రపంచ తెలుగు మహాసభల సంకల్పం. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు దిశానిర్దేశం చేసే సందర్భంలో ఇచ్చిన కాన్సెప్ట్.

మహాసభల సందర్భంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు తప్పనిసరి అనే ఎజెండా తెరమీదికి వచ్చింది. దీని నేపథ్యం, లక్ష్యాలు.. కారణాలు మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. అనేక దశాబ్దాలుగా తెలుగుభాష నిర్లక్ష్యానికి గురైంది. కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ ప్రతిభా నైపుణ్యాలు చరిత్రలో నమోదుకాలేదు. తెలంగాణలోని తెలుగు ఘనకీర్తిని పాఠశాల విద్య నుంచి బోధించాలనేది మొదటిలక్ష్యం. తెలుగు భాష సాహిత్య సంస్కృతులకు దూరమవుతున్న కొత్త తరాన్ని తెలుగుభాష కమ్మదనం వైపు ఆకర్షించి, భాషాభిమానాన్ని, అభిరుచిని పెంపొందించాలనేది మరో లక్ష్యం. మాతృభాషలో నైపుణ్యం సాధిస్తే తెలంగాణలోని సామాజిక విలువల పట్ల గౌరవాభిమానాలు తప్పకుండా పెరుగుతాయి. వ్యక్తిత్వం, విలువల నిర్మాణం జరుగుతుంది. ఈ నేపథ్యం, ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ముఖ్యమంత్రి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగును తప్పనిసరి చేశారు. ఆయన ఈ నిర్ణయం చెప్పగానే ప్రపంచం నలుమూలలలోని తెలుగు భాషాభిమానుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ పక్షాన, తెలంగాణ భాషాభిమానుల తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. ఈ వరుసలోనే పాఠశాల, కళాశాల స్థాయిలలో 20వేల వరకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఒక అంచనా. ప్రతీ ఉద్యోగి తెలుగులో ప్రావీణ్యాన్ని సాధించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. సాహిత్యం చదివితే జీవితాన్ని చదువడం అభ్యాసమవుతుంది. ప్రతీ విద్యార్థిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న విజయం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు తప్పనిసరి అంశం.

ప్ర: ప్రపంచ తెలుగు మహాసభల ఉద్దేశాలు.. లక్ష్యాలు?

జ: వేల సంవత్సరాల చరిత్ర అలా ఉండగా, గత ఆరు దశాబ్దాలలో తెలంగాణ వైతాళికులకు, సాహిత్య ప్రముఖులకు, దిగ్గజాలకు ఎక్కడా స్థానం లభించలేదు. తెలంగాణ నేల కన్న సాహిత్యబిడ్డలను గౌరవించుకోవడం ప్రధాన ఉద్దేశం. మన పూర్వీకులు తెలుగు భాషకు చేసిన సేవలను మరోసారి జాపకం చేసుకోవడం మన కర్తవ్యం. ఈ నేల మీద భాసిల్లిన సాహిత్య సుగంధాలను ప్రపంచంలో సుస్థిరం చేయడం లక్ష్యం.

దీనిని ఆసరా చేసుకొని విపరీత అర్థాలు తీయవద్దు. ప్రపంచ పటంమీద తెలుగును ్రప్రేమిస్తున్నవాళ్లందరూ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు అతిథులే. 1975లో ప్రపంచ తెలుగు మహాసభలను సమైక్యతను చాటిచెప్పేందుకే ఉపయోగించుకున్నారు. అదేవిధంగా 2012లో తిరుపతిలో జరిగిన సభలు కూడా సమైక్యత నినాదాన్ని బలపరుచడానికే ఉపయోగపడ్డాయి. ఇదంతా గతం. ఈ గతానికి ప్రస్తుత సందర్భంలో ప్రాధాన్యంలేదు. డిసెంబర్ 15 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల ప్రాముఖ్యం చాలా భిన్నమైనది. ఈ మహాసభల విశిష్టత.. విశాలదృక్పథం, వైవిధ్యం చారిత్రాత్మకం. ఈ వరుసలోనే తెలుగు భాషాభిమానులందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాం.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/writer-and-poet-nandini-sidda-reddy-face-to-face-first-chairman-of-telangana-sahitya-academy-1-2-560617.html