తెలంగాణ గౌరవానికి ప్రతీక - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలంగాణ గౌరవానికి ప్రతీక

ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ తెలంగాణ గౌరవానికి ప్రతీక అని, కన్నులపండువగా కార్యక్రమాలు జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఇదో బృహత్కార్యమని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సహా ప్రముఖులు హాజరవుతున్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే ఈ మహాసభలకు అందరూ ఆహ్వానితులే. వచ్చిన వారందరికీ చక్కటి ఆతిథ్యమివ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. సాహిత్యం, భాషా ప్రాధాన్యంగా మహాసభలను నిర్వహించాలని, ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియం ప్రాంగణంలో ప్రారంభ, ముగింపు సమావేశాలతో పాటు అయిదురోజులు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరగాలన్నారు. సోమవారం ఆయన ప్రగతిభవన్‌లో నాలుగు గంటల పాటు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘మహాసభలతో మన ప్రతిష్ఠ ఇనుమడించాలి. ప్రారంభ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విశిష్ట అతిథులుగా మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ హాజరవుతున్నారు.ఉపరాష్ట్రపతి ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ ప్రకటన చేసిన వెంటనే పెద్దఎత్తున బాణసంచా కాల్చాలి. ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఆయనకు బ్రహ్మాండంగా స్వాగత సత్కారాలు చేయాలి.
ఒక్కో వేదికపై ఒక్కొక్కరికి బాధ్యతలు
ప్రధాన వేదిక ఎల్బీస్టేడియంతో పాటు మిగిలిన అన్ని వేదికల పర్యవేక్షణ బాధ్యత ఒక్కొక్కరు తీసుకోవాలి. భోజనాలు, బస, ఇతర ఏ సమస్య లేకుండా చూడాలి. కార్యక్రమాలకు హాజరయ్యే ప్రతినిధులతో మాట్లాడి, వారి అభిలాషకు అనుగుణంగా రవాణా సౌకర్యాలు కల్పించాలి. ప్రతి రోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో తెలంగాణ మీద ప్రత్యేకంగా రూపొందించిన లఘుచిత్రాన్ని ప్రదర్శించాలి. సాహిత్య కార్యక్రమాలు, కళాకారుల పరిచయాలు జరగాలి.

CM KCR along with cabinet sub committee taking stock of World Telugu Conferences 2017 arrangements - Image 2

విదేశీ ప్రతినిధులపై ప్రత్యేకశ్రద్ధ
విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతినిధుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. విదేశీ ప్రతినిధుల రవాణాకు కార్లను వాడాలి. ఎల్బీ స్టేడియం వద్ద రద్దీ దృష్ట్యా అక్కడ పార్కింగుపై శ్రద్ధ తీసుకోవాలి. ఫుడ్‌కోర్టులు ప్రారంభం నుంచే పూర్తి స్థాయిలో ఉండాలి. అయిదు రోజుల్లో ఒకనాడు పూర్తిగా సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించాలి. వివిధ జిల్లాల నుంచి వచ్చే తెలుగు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు, రచయితల సంఘాల సభ్యులు, తెలుగులో పాండిత్యం ఉన్న వారు, సాహిత్యాభిలాషులు మహాసభలకు హాజరయ్యేందుకు జిల్లా కలెక్టర్లు రవాణా, భోజన సౌకర్యం కల్పించాలి. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లోని సాహిత్యాభిలాషులు మహాసభలకు హాజరయ్యేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించాలి.

ప్రారంభ, ముగింపు సమావేశాల్లో…
ప్రారంభ, ముగింపు సమావేశాలు జరిగే ఎల్బీ స్టేడియంలో విదేశీ, ఇతర రాష్ట్రాల ప్రతినిధులకు ప్రత్యేకంగా కుర్చీలు వేయాలి. నమోదు చేసుకున్న ప్రతినిధులకు విడిగా మరో ఎన్‌క్లోజర్‌ ఉండాలి. మహిళలు, వివిధ సాహిత్య వేదికలు, కార్యక్రమాల్లో పాల్గొనే వారికి మరో ఎన్‌క్లోజర్‌, ప్రజాప్రతినిధులు, మీడియాకు ప్రత్యేక ఎన్‌క్లోజర్లుండాలి. మహాసభలకు హాజరయ్యే జ్ఞాన్‌పీఠ్‌ పురస్కార గ్రహీతలను ప్రత్యేకంగా సత్కరించాలి.ఇంత మందికి ఒకేసారి సన్మానం చేశామనే ఖ్యాతి మనకు దక్కాలి’.సమీక్షలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, చందూలాల్‌, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ శేరి సుభాష్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రమణాచారి, అనురాగ్‌శర్మ, దిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌, సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ నందిని సిధారెడ్డి, సీఎం ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్‌, గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌ ఆయాచితం శ్రీధర్‌, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఎస్వీ సత్యనారాయణ, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సంచాలకుడు మామిడి హరికృష్ణ, డీజీపీ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Source: http://www.eenadu.net/news/news.aspx?item=ts-main-news&no=1