తెలుగు ప్రముఖులకు ప్రభుత్వ ఆహ్వానం - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలుగు ప్రముఖులకు ప్రభుత్వ ఆహ్వానం

invites-all-telugu-people-abroad
ప్రపంచ తెలుగు మహాసభల్లో నిర్వహించే వివిధ సదస్సుల్లో పాల్గొనాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లోని భాష-సాహిత్య రంగాల్లోని 50 మంది ప్రముఖులకు ఈ-మెయిల్ సందేశాల ద్వారా అధికారికంగా మంగళవారం ఆహ్వానాలు పంపించింది. డిసెంబరు 15-20 తేదీల్లో నిర్వహించే ఈ మహాసభల్లో తెలుగు భాష, సాహిత్యం, కళల్లో పలు అంశాలపై సమాలోచనలు జరుగుతాయి. భాష, సాహిత్యాల్లో విశేషంగా కృషి చేసిన రచయితలు, కవులు, ఉపాధ్యాయులు, పరిశోధకులకు ఈ ఆహ్వానాలు అందాయి. వీరందరికీ ప్రభుత్వమే రవాణా, వసతి సదుపాయాలు సమకూరుస్తుందని, మొత్తం ఖర్చులను భరిస్తుందని సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి నమస్తే తెలంగాణతో అన్నారు. ఇప్పటివరకు తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, మారిషస్, కెనడా, ఇంగ్లండ్, ఐర్లండ్ దేశాల్లోని ప్రముఖులకు ఆహ్వానాలు పంపామని, త్వరలోనే మిగతా దేశాల్లోని తెలుగు ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతామని ప్రపంచ తెలుగు మహాసభల కార్యాలయం తెలిపింది.

నేడు భాషా పండి తులతో సన్నాహక సమావేశం

ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు భాషా పండితులను భాగస్వామ్యం చేసేందుకు సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో బుధవారం సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ సమావేశంలో తెలుగు భాషా పండితుల సంఘాలకు ప్రాతినిధ్యం వహించే నాయకులతో చర్చిస్తామని ప్రపంచ తెలుగు మహాసభల కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కవి సమ్మేళనం, అవధానం, సాహితీ సమాలోచనల్లో భాషా పండితులు, విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు నిర్వహిస్తున్న ఈ సన్నాహక సమావేశంలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి పాల్గొంటారని పేర్కొంది. రవీంద్రభారతిలో మధ్యాహ్నం మూడుగంటలకు జరిగే ఈ సమావేశానికి హైదరాబాద్ సమీపంలోని వివిధ పాఠశాలలకు చెందిన గ్రేడ్-1,గ్రేడ్-2 భాషా పండితులు హాజరవుతారు. ప్రపంచ తెలుగు మహాసభలు జరిగే ఐదు రోజులు భాషా పండితులకు ఆన్‌డ్యూటీ సదుపాయం ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరలోనే ఆదేశించారు. ఈ సందర్భంగా భాషా పండితుల సలహాలను, సూచనలను స్వీకరిస్తారు. స్వచ్ఛందంగా హాజరయ్యే సాహిత్యాభిమానులందరినీ ఈ సదస్సుకు ఆహ్వానించారు.

పరిశోధనా పత్రాల రచనల పోటీ

సాహిత్య పరిశోధనలో ప్రామాణికతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రపంచ తెలుగు మహాసభల సందర్బంగా తెలంగాణ సాహిత్య అకాడమీ పరిశోధనాపత్రాల రచనలో పోటీ నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతి ప్రాతిపదికగా పరిశోధనాత్మక వ్యాసాలను రాయాలని రచయితలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ విజ్ఞప్తి చేసింది. వ్యాసాల నిడివి 10 నుండి 20 పేజీల వరకు ఉండవచ్చునని నిబంధన విధించారు. ఈ నెల 30 తేదీలోగా వ్యాసాలను కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ, కళాభవన్, రవీంద్రభారతి, సైఫాబాద్, హైదరాబాద్-4 చిరునామాకు పంపించాలని కోరారు.. పోటీలోఉత్తమంగా వ్యాసాలను ఎంపికచేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఇస్తారు. ప్రథమంగా ఎంపికైన వ్యాసరచయితకు రూ.10వేలు, ద్వితీయ వ్యాసరచయితకు రూ.8వేలు, తృతీయ రచయితకు రూ.5వేల నగదు బహుమతులను మహాసభలలో ఇచ్చి సత్కరిస్తారు.10 ఉత్తమ వ్యాసాలకు ప్రోత్సాహక బహుమతులను ఇస్తారు. ఈ వ్యాసాలతో పుస్తకాన్ని ప్రచురించనున్నారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/world-telugu-conference-to-begin-in-hyderabad-1-2-560258.html