మన ఘనతను చాటుదాం – రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి | World Telugu Conference 2017, Telangana State

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

మన ఘనతను చాటుదాం – రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి

తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక కళావికాసాల విలక్షణతలను, సంప్రదాయ విలువలను, చారిత్రక వారసత్వ సంపదను ప్రపంచ పటం మీద ఎగురవేయడమే ప్రపంచ తెలుగు మహాసభల లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రపంచ తెలుగు మహాసభల కోర్‌కమిటీ సభ్యుడు కేవీ రమణాచారి వ్యాఖ్యానించారు. ఇదొక చారిత్రక సందర్భం, తెలంగాణ భాష సౌందర్యం గురించి ఎన్ని మాటలు చెప్పినా, ఇంకా చెప్పాల్సిన విషయాలు మిగిలే ఉంటాయని పేర్కొన్నారు. సంక్షిప్తత, గాఢత, స్పష్టత తెలంగాణ మాటల విశిష్టత అని ఆయన చెప్పారు. ఒక్క మాటలో అనుభవాల సారాన్ని చెప్పగలుగడం తెలంగాణ మాటల ప్రత్యేకత అని ఆయన తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమాల రూపకల్పనలో క్షణం తీరికలేకుండా ఉన్న రమణాచారి నమస్తే తెలంగాణ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

WTC - Telangana Government Advisor KV Ramana Charya

సీఎం కేసీఆర్ దిశానిర్దేశం..

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర శాసనసభలో మాట్లాడిన మాటలన్నీ అక్షర సత్యాలు. ఒక్క మాటలో చెప్పాలంటే చట్టసభలో సీఎం ప్రపంచ తెలుగు మహాసభల మ్యానిఫెస్టోను ప్రకటించారు. గాథాసప్తశతి నుంచి వేల సంవత్సరాల తెలంగాణ భాష, సాహిత్య వారసత్వ సంపదల చరిత్రను ఆయన వివరించారు. ప్రపంచ మహాసభల కార్యక్రమాలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఆయన సూచించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమాల రూపకల్పన జరుగుతున్నది. కురిక్యాల శాసనంలో లభించిన కందపద్యాలు తెలుగుభాషకు ప్రాచీన హోదా లభించడంలో ప్రధాన భూమిక పోషించాయని చెప్పినప్పుడు తెలంగాణ ప్రజలు ఉప్పొంగిపోయిన విషయం తెలిసిందే.. ఈ ఘన వారసత్వ సంపదను చాటి చెప్పేందుకే ప్రపంచ తెలుగు మహాసభలు.

సాహిత్య వసంతం కోసం

చిన్నప్పుడు పాఠ్యపుస్తకాలలో తెలంగాణ మహానుభావులను చదువుకునే అవకాశం రానేలేదు. రాష్ట్రం వచ్చిన తర్వాతనే తెలంగాణ కవులకు, కళాకారులకు, రచయితలకు, పండితులకు, భిన్న కళారూపాల ప్రక్రియలకు, జానపదకళలకు గొప్ప వేదికలు లభించాయి. తెలంగాణలోని గొప్ప సాహితీవేత్తలను చాలామంది మరిచిపోయారు. ఇది చాలా బాధాకరం.

వెలుగులోనికి మనచరిత్ర

శాతవాహనుల మొట్టమొదటి రాజధాని కోటిలింగాల. శ్రీముఖుడు కోటిలింగాలను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. తెలంగాణలోనే శాతవాహనుల తొలిరాజ్యం ఏర్పడింది. ఇది చరిత్ర చెప్పిన పాఠం. ఆ తర్వాత శాతవాహనులు ప్రతిష్ఠానపురం (పైఠాన్‌ను) రెండో రాజధానిగా చేసుకున్నారు. ధాన్యకటకం (అమరావతి) మూడో రాజధాని. ఇది చరిత్రక్రమం. తెలంగాణ మట్టిమీద వికసించిన చరిత్రమొత్తం అణచివేతకు గురైంది. తెలంగాణ శాసనాలలోని గొప్ప విషయాలను, పండితులు, పరిష్కర్తలు, పురావస్తునిపుణులు తవ్విపోశారు. ఈ ఘనతలను ప్రపంచ సభలలో చాటుదాం. ప్రపంచ తెలుగు మహాసభల వేదికలన్నీ ప్రపంచ తెలుగు భాషాభిమానుల వేదికలే.

అతిరథమహారథుల సమక్షంలో

డిసెంబర్ 15న సాయంత్రం 5 గంటలకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని లాల్‌బహద్దూర్ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం కానున్నాయి. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. తెలంగాణలో జన్మించి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన డాక్టర్ రాధారెడ్డి-రాజారెడ్డి కూచిపూడి శైలి నృత్య కళారూపాన్ని ప్రదర్శిస్తారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/kv-ramana-chary-interview-about-world-telugu-mahasabalu-1-2-561732.html