ఇది తెలంగాణ పండుగ - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

ఇది తెలంగాణ పండుగ

telangana-festival
హైదరాబాద్‌లో ఈ నెల 15 నుంచి 19 వరకు ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ పండుగలా నిర్వహిస్తామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ప్రతి ఒక్కరు దీనిని తమ ఇంటి పండుగలా భావించి విజయవంతం చేయాలని కోరారు. మంగళవారం ఆయన సచివాలయంలో తెలుగు మహాసభల కరదీపికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ నందిని సిధారెడ్డి, గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌ ఆయాచితం శ్రీధర్‌, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఎస్వీ సత్యనారాయణ, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, సంచాలకుడు హరికృష్ణ, సీఎం ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్‌, అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ అయిదు రోజుల పాటు జరిగే ప్రపంచతెలుగు మహాసభలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి, పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోందన్నారు. మహాసభల నిర్వహణ కమిటీ చక్కగా పనిచేస్తోందని, అధికారులు సమన్వయంతో బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మహాసభలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిరోజు సమీక్ష నిర్వహించి తమకు ఆదేశాలు ఇస్తున్నారని కడియం చెప్పారు. ఆయన సూచనలకు అనుగుణంగా మహాసభల కార్యక్రమాల సమాచారం కోసం కరదీపికను రూపొందించామని, ఇది అతిథులు, హాజరయ్యేవారందరికీ ఉపయోగపడుతుందన్నారు. నందిని సిధారెడ్డి మాట్లాడుతూ మహాసభలకు 8 వేల మంది వరకు నమోదు చేసుకున్నారని, మరో రెండు వేల మంది ఆహ్వానితులున్నారని, నమోదు చేసుకున్న వారే గాకుండా సందర్శకులు పెద్దఎత్తున హాజరు కావచ్చని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రారంభోత్సవానికి 20 వేల నుంచి 25 వేల మంది వరకు హాజరవుతారని చెప్పారు. స్టేడియం గాక ఆరు వేదికలపై మహాసభల కార్యక్రమాలు జరుగుతాయని, అందరూ వీటికి హాజరు కావచ్చన్నారు. మహాసభల్లో తెలుగుదనం ఉట్టిపడేలా కార్యక్రమాలుంటాయని బుర్రా వెంకటేశం వెల్లడించారు.

Source: http://www.eenadu.net/news/news.aspx?item=ts-main-news&no=3