తెలుగు సభల్లో తెలంగాణ విందు - World Telugu Conference 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలుగు సభల్లో తెలంగాణ విందు

మహాసభల్లో పాల్గొనే అతిథులు కనీవినీ ఎరుగని అద్భుతమైన విందును ఆస్వాదించబోతున్నారు. సభలు.. సాంస్కృతిక ప్రదర్శనలే కాకుండా ఆతిథ్యం కూడా అద్భుతంగా ఉండేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. సభల్లో పాల్గొనే దాదాపు పదివేల మంది అతిథులకు అద్భుతమైన వంటకాలతో కమ్మని విందుభోజనం పెట్టనున్నారు. ఇందుకోసం ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భోజనాల ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ఉన్నత స్థాయి అధికారులతో ప్రభుత్వం ఎనిమిది కమిటీలను ఏర్పాటుచేసింది. మెనూ ఎంపిక, వంటల తయారీ, వడ్డన బాధ్యతను పౌరసరఫరాల శాఖకు అప్పగించింది. ఈ శాఖ ఆధ్వర్యంలోనే మహాసభల ఐదు ప్రధాన వేదికల వద్ద ప్రతినిధులకు భోజన వసతి కల్పిస్తారు. మెనూ రూపకల్పన బాధ్యతను చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ బాలమాయదేవికి అప్పగించారు. ఒకే కేంద్రంలో భోజనాలు సిద్ధం చేసి అక్కడి నుంచి వివిధ వేదికల వద్దకు సరఫరా చేస్తామని ఆమె నమస్తే తెలంగాణతో చెప్పారు. దీనికోసం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం వద్ద సెంట్రల్ కుకింగ్ ఏరియాను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని దాదాపు అన్ని ప్రముఖ వంటలు.. మెనూలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రత్యేకించి భోజనాల కోసం ప్రతిసభ వద్ద ఒక స్పెషల్ ఆఫీసర్‌ను ఏర్పాటు చేశామని, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ నుంచి ఒక అధికారి భోజనాల నాణ్యతను పరిశీలిస్తారని వివరించారు. ఇప్పటికే కమిటీ సభ్యులతో కలిసి భోజన ఏర్పాట్లపై సమీక్షించామని, ఒక నివేదిక తయారుచేసి దాని ఆధారంగా పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

telangana-vindhu

పసందైన శాకాహార వంటలు..
సుమారు 10వేల మంది ప్రతినిధులకు సరిపడా పసందైన భోజన ఏర్పాట్లు జరుగుతున్నాయి. శాకాహార వంటలతో అలరించేందుకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉన్న ప్రత్యేక వంటల గురించి ఆరా తీసి మరీ మెనూ సిద్ధం చేశారు. ప్రభుత్వ ఆతిథ్యంలో భాగంగా ప్రతినిధులందరికీ ఈ వంటలను ఉచితంగా రుచి చూపించనున్నారు.

ఇవే ప్రత్యేక వంటలు..
విందులో తెలంగాణ ప్రత్యేక వంటకాలైన సకినాలు, మలీద ముద్దలు, సర్వపిండి, చింతకాయ తొక్కు, పచ్చిపులుసు, పుంటికూర తొక్కు, గుత్తివంకాయ కూర, పచ్చిమిరపకాయ తొక్కు, బొబ్బెర గుడాలు, శనిగ గుడాలు, మురుకులు, సల్లచారు, అరిశెలు, బూరెలు, కజ్జికాయ, మక్కగారెలు, కారపు అప్పలు, శనగపప్పు పోలెలు, మరమరాల లడ్డు, బెల్లపన్నము, ఆకుకూరలు, పప్పుచారు, గట్క, పప్పు దప్పడం, ఫ్రూట్ సలాడ్, అన్ని రకాల తొక్కులు.. ఇలా సుమారు 40 రకాల వంటలను ప్రతినిధులకు వడ్డించనున్నారు.

మరోవైపు తెలంగాణ హోటళ్ల సంఘం మాంసాహార రుచులను కూడా అందించేందుకు సిద్ధమవుతున్నది. సభా ప్రాంగణాల వద్ద ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయనున్నది. తెలంగాణలో నోరూరించే మాంసాహార వంటలను ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. అయితే వీటిని రుచి చూడాలంటే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. పాయ, కీమా, మటన్.. చికెన్, బిర్యానీ, నాటుకోడి పులుసు, తలకాయ కూర. నల్లి బొక్క కూర, కీమా బిర్యానీ ఇలా అన్ని రకాల మాంసాహార వంటలను స్టాళ్ల ద్వారా విక్రయించనున్నారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/telangana-feast-in-telugu-sabha-1-2-561802.html