స్వాభిమాన చైతన్య విస్ఫోటనం | World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

స్వాభిమాన చైతన్య విస్ఫోటనం

కవులలో తెలుగు కాక సంస్కృతం, ఉర్దూ, హిందీ, పారశీక భాషల కవులకూ అవకాశం కల్పించటం తెలంగాణ సామాజిక చిత్ర నేపథ్యంలో అత్యవసరం. తెలంగాణ అస్తిత్వానికి కారణమైన వైతాళికులు, వివిధ సామాజిక రంగాలలో, సాహిత్య రంగాలలో కృషి చేసిన వారిని విశిష్ట వ్యక్తులుగా సత్కరించుకోవచ్చును. ప్రపంచ తెలుగు మహాసభలు జరిగే ఐదు రోజులూ ప్రతిక్షణం సాంస్కృతిక చైతన్యంతో భాగ్యనగరం కళకళలాడాలి. తెలంగాణలో ఇంతకాలం మరుగున పడిపోయిన భాషాసాహిత్య చేతన విశ్వరూపం ప్రదర్శించాలి.

రెండు వేల యేండ్ల కిందట శాతవాహనుల రాజధానిలో హాల చక్రవర్తి పరిపాలిస్తున్న కాలం. కోటి లింగాల వద్ద ఎంతో మంది కవులు, కవయిత్రులు అందమైన ప్రాకృత గాథలు పాడుకొంటున్నారు. కవిత్వమంటే ప్రాణమిచ్చే కవి ప్రభువులు మధుర మంజుల కవిత్వానికి పురస్కారాలిస్తూ-ఒక సంకలనాన్ని- కవితా సందోహాన్ని నిర్మిస్తున్నారు. ఆ గాధలలోని ధ్వని సౌం దర్యానికి, కాశ్మీరం నుంచి, కాశీ నుంచి ఉజ్జయి ని నుంచి విచ్చేసిన లక్షణ శాస్త్రవేత్తలు అబ్బురపడుతున్నారు. ఆ కవయిత్రులలో గ్రామీణ స్త్రీ లు, నాగరకులు, అలంకృత వేషాలతో పండుగలాగా కలగలసి ఒకరికి నచ్చిన గాథలను మరొకరికి వినిపిస్తున్నారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను చూస్తుంటే నాకు ఆ సన్నివేశం గుర్తుకు వచ్చింది. తెలుగు సరస్వతి సమర్చన కోసం అప్పటి నుంచి ఎన్ని పండుగలు జరిగాయో – కాకతీయ ప్రభువు గణపతి దేవుని ఆస్థానంలో తిక్కన సోమయాజి మహాభారతం వినిపించినప్పుడు ఆ చోట ప్రవహించే వాయువు ఎంతగా పులకించిందో, విద్యానాథుడు తన యశోభూషణాన్ని ప్రతాపరుద్రదేవునికి సమర్పించినప్పుడు ఆ విద్యాకైరవ కౌముది ఎంతగా పులకించిందో, పాల్కురికి సోమనాథుని దేశీయ పురాణగానం ప్రజల నాలుకలే ఆకులుగా ఎలా వ్యాపించిందో, బమ్మెర పోతన్న భాగవత రచన పూర్తిచేసి వరంగల్లు నగరంలో స్వయంభూ దేవాలయంలో ప్రవచించినప్పుడు అక్కడ శివుడే బాలకృష్ణుడై ఎలా తాండవం చేసినాడో నాకు దృశ్యాదృశ్యంగా కనులముందాడుతున్నాయి. గణపతి దేవుని ఆస్థానంలో హుళక్కి భాస్కరుడు, మారన, నరసింహర్షి, శాకల్య మల్లన..ఎంతోమంది ఉండేవారు. శాకల్యమల్లన మొదటి శతావధానిగా పేర్కొనబడ్డాడు. తరువాత రెండు వందల సంవత్సరాలకు చరిగొండ ధర్మన్న షితాబుఖాన్ ఆస్థానంలో శతావధానం చేసినాడు. 15వ శతాబ్దం నాటికి రాచకొండలో సర్వజ్ఞసింగ భూపాలుని కొలువు అద్భుతమైన ది. ఆయన రసార్ణవ సంధానకర్త. ఆయన ఆస్థానంలో వేదాంత దేశికుల కుమారులు శ్రీవైష్ణవ మతాచార్యులు కుమార వరదాచార్యుల వారున్నారు.

మరొక అలంకార ప్రస్థాన నిర్మాత విశ్వేశ్వరుడున్నాడు. వామన భట్టాచార్యుడు ఉన్నాడు. ఆ విద్వత్సభలో శాస్త్ర మూ, కావ్యమూ రెండూ శిఖరాలు అందుకున్నాయి. శ్రీనాథుడు, పోతన మొదలైన తెలు గు కవులూ ఉన్నారు. ఆ వైభవమూ ఊహించవలసిందే. ఇరవయ్యవ శతాబ్దంలో బెజవాడలో జీవత్సరస్వతి చెళ్లపిళ్ల వేంకటశాస్త్రికి ఆస్థాన కవి పదవినిచ్చి సన్మానించే వేళ-తెలంగాణ నుంచి సారస్వతీయులు వెళ్లి రజత సరస్వతీ విగ్రహాన్ని ఉపదగా సమర్పించి దాశరథి పూజా పంచకం పద్యాలతో అర్చించిన సన్నివేశంలో ఆ కృష్ణాతరంగాలు ఆ పద్యాలను ఎంతగా మారు మోగించినాయో.. ఇలా ప్రతి అంశం పులకింపజేసేదే. 1953 ప్రాంతంలో అలంపురంలో-సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో దేవులపల్లి రామానుజరావు, గడియారం రామకృష్ణ శర్మల నేతృత్వంలో తెలుగు వాగ్దేవత వేయి కనులతో, వేయి బాహువులతో తన విశ్వరూపాన్ని ప్రదర్శించిన వేళ అపూర్వము. అనుపమేయమైన సన్నివేశం. తుంగభద్రానదీతీరాన కాళోజీ నాగొడవ శ్రీశ్రీ చేతులతో ఆవిష్కృతమైంది. సారస్వత పరిషత్ పట్టభద్రులనుద్దేశించి విశ్వనాథ స్నాతకోపన్యాసం చేశారు. పల్లాదుర్గయ్య, సురమౌళి మొదలైన కవు లు, కథకులు తమ సృజనశీలాన్ని వ్యక్తీకరించారు. అటువంటి సభ మళ్లీ జరిగిందా అంటే సందేహమే. మళ్లీ 1982లో ఐదురోజుల పాటు ఓరుగల్లులో పోతన పంచశతి ఉత్సవాలు సంగీత, నాట్య రూపకాలతోపాటు చర్చాగోష్ఠులూ, ఉపన్యాసాలతో పాటు, కవి సమ్మేళనాలతో, చిత్ర కళాప్రదర్శనలతో ఉద్విగ్నభరితంగా వేలాది మంది పాల్గొనగా చరిత్రాత్మకంగా జరిగింది. మన మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ఆధ్వర్యంలో నాటి ఉపరాష్ట్రపతి హిదాయతుల్లా పాల్గొన్న సన్నివేశం అది. ఇలా..ఇంకా ఎన్నో పండుగలు, ఉల్లాసాలు.. ప్రాణశక్తుల సహస్ర దళ వికాసాలు.మళ్లీ ఈనాడు తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం సాధించుకున్న సందర్భంలో స్వాభిమాన చైతన్య ప్రమోద విస్ఫోటనంగా ఈ మహాసభలు జరుగుతున్నవి. సాహిత్యవేత్త, సంస్కృతి భావుకులు అయిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో, మార్గదర్శనంలో జరుగుతున్న సందర్భం మరొక భావుక సహస్ర నీలోత్పల చంద్రోదయమే కాగలదని భావిస్తున్నాము. క్రియాసిద్ధి: సత్తే భవతి మహతాం అన్నట్లు సత్తం ఉన్న నాయకుడాయన. ఈ పండుగ నిర్వహణలో ప్రధానాంశం.. పాల్గొ నే వారందరూ తాము వర్తమాన బిందువు మీదనుంచి భూతకాల వైభవ దృశ్యాలను సాక్షాత్కరించుకోవాలి. రెండువేల ఏండ్ల నాటి మహత్తర చరిత్ర తెలంగాణ సాహిత్యానిది. తెలంగాణ సీమలో వెలువడిన తరతరాల తెలుగు సాహితీగరిమ మిగిలిన అన్ని ప్రాంతాలకంటే ఎంతో విభిన్నమైనది. ఇక్కడ సృజించబడిన అన్ని సాహిత్య ప్రక్రియల్లో, వాటి స్వరూప స్వభావాల్లో ఈ విశిష్టత స్పష్టంగా గోచరిస్తుంది. కవిత్వ స్వరూప స్వభావాలలోనే కాదు, కవు ల మానసిక వలయాల్లోనూ ఇది సుస్పష్టంగా గోచరిస్తున్నది.

తెలుగు సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేసుకోవలసిన తరుణం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా ఆవిర్భవించిన తరువాత కచ్చితంగా ఆసన్నమైనది. ప్రపంచ తెలుగు మహాసభలు ఈ పునర్మూల్యాంకనానికి నాంది పలుకాలి. తెలుగు సాహిత్య వాస్తవిక చరిత్రను పునర్నిర్మించుకోవటానికి శ్రీకా రం చుట్టాలి. ఇందుకోసం సాహిత్యరూపకాలు విలక్షణంగా దోహదపడుతాయి. శాతవాహన, కాకతీయ, రాచకొండ, కుతుబ్‌షాహీ ప్రభువుల కాలం నాటి సామాజిక సాంస్కృతిక శిఖరములను కనులకు కట్టించే రీతిగా ఈ రూపకాలు ఉండవచ్చు. వీటిద్వారా గతకాలంలో నుంచి మహనీయులు మన ముందుకు తరలివస్తారు. వారి వేషభాషలు, సన్నివేశాల కథనము ఇతిహాస వైభవాన్ని, విస్మృత ఘట్టాలను స్మరణలోకి తీసుకువస్తాయి. వేషంలోనూ,భాషలోనూ భూత కాలం కదలివస్తుంది. ఈ లక్షణం నృత్యంలోనూ రూపకాలలోనూ మరికొంత భావుక రంజకంగా కనిపింపజేయవచ్చు. సాహిత్యరంగంలో అనేక ప్రక్రియలకు తెలంగాణ జన్మనిచ్చినట్లు చారిత్రకంగా నిశ్చితమైన అంశం. ద్విపదకావ్యం, దేశీయ పురాణం, శతకం, ఉదాహరణం, యక్షగానం, అచ్చతెనుగుకావ్యం, దేశి మార్గ రీతులలో రామాయణాలు మొదలైనవెన్నో.. ఒక్కో ప్రక్రియ ఆరంభ వికాసాలను వివరించే రూపాలను ప్రతిఫలింపజేయవచ్చు. ప్రధాన వేదికకు సన్నిహితంగా ఒక మంటపంలాగా ఏర్పరచి ఉల్లేఖనాలతో, చిత్రాలతో ప్రదర్శనకు ఏర్పరచవచ్చు. ఈ ప్రక్రియా వైభవ మంటపం యువతరానికి సాహిత్య వైభవా న్ని తెలియజేయవచ్చు. సంస్కృతంలో అరుదుగా ఉన్నా, తెలుగులో విస్తృతంగా, ఉజ్జలంగా నెలకొని ఉన్న ప్రక్రియ అవధానం. గడచిన 150 ఏండ్లలో వందలాది మం ది అవధానులు ఈ సాహిత్య విశేషాన్ని సహస్రముఖంగా వెలయించారు. ఆ గుర్తుగా అష్టావధానం, శతావధానం కనీసం ఈ రెండైనా ఏర్పరుచాలి. సాహిత్యగోష్ఠుల విషయంలో పలు అంశాలను చేర్చవచ్చు. ప్రాచీన కవిత్వం, దేశి, ద్విపద కావ్యాలు, శతకం, ఉదాహరణం, యక్షగానం, జానపద కథారూపాలు, చిరుతల రామాయణం, చిందుభాగవతం, ఒగ్గుకథ, బుఱ్ఱకథ, వీధినాటకం, గేయ ప్రబంధాలు, ఆధునిక మహాకవులైన వానమామలై వరదాచార్యులు, పల్లాదుర్గయ్య, జగన్నాథాచార్యులు, ఉత్పల, సంపత్కుమార, వేముగంటి, అనుముల కృష్ణమూర్తి, దాశరథి, సినారె వంటి వారిపై చర్చలు, శాసనభాష, ఆధునిక పద్య కవిత్వం, గేయ కవిత్వం, సాహి త్య విమర్శ, నవలలు, కథానికలు, వచన కవిత (1980, 1990, 2017 దశకాలవారీగా) తెలంగాణలో ఆంధ్రోద్యమం, ప్రత్యేక రాష్ట్రసాధన (1969, 1996 నుంచి 2014 వరకు సాగిన ఉద్యమం), మరుగున పడిన చరిత్ర, తెలంగాణ సంగీత నృత్య విద్యలు, జానపద వాఙ్మ యం వంటి విషయాలను వింగడించుకొని చర్చించవచ్చు. పలు సదస్సులను సమాంతరంగా నిర్వహించడం ద్వారా అన్ని అంశాలపై విస్తృతమైన చర్చకు అవకాశం ఇవ్వవచ్చు. మరొక ప్రధాన సన్నివేశం బృహత్ కవిసమ్మేళనం. దీనిలో ఎందరికైనా అవకాశం కల్పించవచ్చు. కవులలో తెలుగు కాక సంస్కృతం, ఉర్దూ, హిందీ, పారశీక భాషల కవులకూ అవకాశం కల్పించటం తెలంగాణ సామాజిక చిత్ర నేపథ్యంలో అత్యవసరం. తెలంగాణ అస్తిత్వానికి కారణమైన వైతాళికులు, వివిధ సామాజిక రంగాలలో, సాహిత్య రంగాలలో కృషిచేసిన వారిని విశిష్ట వ్యక్తులుగా సత్కరించుకోవచ్చును. ప్రపంచ తెలుగు మహాసభ లు జరిగే ఐదు రోజులూ ప్రతిక్షణం సాంస్కృతిక చైతన్యంతో భాగ్యనగరం కళకళలాడాలి. తెలంగాణ లో ఇంతకాలం మరుగున పడిపోయిన భాషాసాహిత్య చేతన విశ్వరూపం ప్రదర్శించాలి………ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య 

Source: https://www.ntnews.com/EditPage/article.aspx?category=1&subCategory=7&ContentId=494331