స్పెషల్ లేజర్‌షో.. స్వాగత తోరణాలు | World Telugu Conference 2017, Telangana State

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

స్పెషల్ లేజర్‌షో.. స్వాగత తోరణాలు

ఈ నెల 15 నుంచి 19 వరకు ఐదురోజులపాటు నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సీఎం కేసీఆర్ సూచనల మేరకు ప్రత్యేకంగా లేజర్‌షో ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి చెప్పారు. లేజర్ షో కోసం తెలుగుభాష ఔన్నత్యాన్ని, తెలంగాణ వైతాళికుల సేవలను వివరిస్తూ సుద్దాల అశోక్‌తేజ పాటరాస్తారని శనివారం సచివాలయంలో కోర్ కమిటీ సమావేశంలో ఆయన తెలిపారు.

Prapancha Telugu Mahasabhalu 2017 - Swagatha Thoranamఆ పాటను సంగీత విద్వాంసుల పర్యవేక్షణలో రికార్డు చేసి, పాటకు అనుగుణంగా నృత్య రూపకాన్ని, లేజర్ షోను కన్నులపండువగా తీర్చిదిద్దే ప్రయత్నం ప్రారంభమైందని చెప్పారు. రెండు మూడురోజుల్లో ఈ ప్రక్రియకు రూపం వస్తుందని వివరించారు. నగరంలో 60 చోట్ల స్వాగత తోరణాల ఏర్పాటు, మహాసభల ఫైర్‌వర్క్స్ బాధ్యతలను చేపట్టాల్సిందిగా హెచ్‌ఎండీఏకు కోర్ కమిటీ సూచించింది. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, హెచ్‌ఎండీఏ కమిషనర్ టీ చిరంజీవులు పాల్గొన్నారు.తెలుగు మహాసభల కోసం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న సన్నాహక సమావేశాల్లో ఉత్సాహం ఉప్పొంగుతున్నది.

సభలకు హాజరయ్యేందుకు భాషాభిమానులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఆస్ట్రేలియాలో దేశపతి శ్రీనివాస్, ఆస్ట్రియాలో తెలుగు మహాసభల ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల, దుబాయ్‌లో సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి ఆధ్వర్యంలో.. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబైలోనూ సన్నాహక సమావేశాలు జరిగాయి. ఆదివారం నుంచి అన్ని జిల్లాల్లోని గ్రంథాయాల్లో సన్నాహక సమావేశాలను నిర్వహిస్తామని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్ పేర్కొన్నారు.

ప్రపంచ తెలుగుమహాసభల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా హోర్డింగ్స్, స్వాగతతోరణాల ఏర్పాటు కార్యక్రమం వేగవంతమవుతున్నది. హైదరాబాద్‌లో నారాయణగూడ సర్కిల్, రవీంద్రభారతి వద్ద ఏర్పాటుచేసిన భాగ్యరెడ్డివర్మ హోర్డింగ్ ఆకర్షణీయంగా నిలిచింది.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/preparatory-meetings-in-the-libraries-from-today-1-2-561117.html