సభలు మహాప్రభలు - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

సభలు.. మహాప్రభలు

తెలుగు భాషా పునరుత్తేజానికి ప్రపంచ మహాసభలు ఆరంభం మాత్రమేనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టంచేశారు. ఈ మహాసభలు విశ్వమంతా వ్యాపించే మహాప్రభలన్న సాహితీవేత్తల మాట నూటికి నూరుపాళ్లు వాస్తవమని పేర్కొన్నారు. తెలుగు మహాసభల్లో భాగంగా తెలంగాణ సారస్వత పరిషత్‌లో జరుగుతున్న శతావధానానికి ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ విశిష్ఠ అతిథిగా హాజరయ్యారు. పెద్దసంఖ్యలో వచ్చిన కవులు, సాహితీవేత్తలను చూసి ఉప్పొంగిపోయారు. సభికుల కోరిక మేరకు పారిజాతాపహరణం, మనుచరిత్రల నుంచి కఠినమైన పద్యాలు ఆలపించి రక్తికట్టించారు. శతావధాని జీఎం రామశర్మ, తాను ఒకే గడ్డమీద పుట్టడం అదృష్టమని చెప్పారు. సాహితీరంగం నుంచి దారితప్పిన బాటసారిని సరిదిద్దిన గురువుల గొప్పతనాన్ని మహాసభల ప్రారంభ వేడుకల్లో పూర్తిగా చెప్పలేకపోయానంటూ మరోసారి గురువులతో తన అనుబంధాన్ని సీఎం వివరించారు. తన జీవితానికి సాహితీ సముద్రపు కవాటాలు తెరిపించింది మృత్యుంజయ శర్మేనని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఎటువంటి స్వార్థం లేకుండా కేవలం శిష్యుల ఉన్నతిని దృష్టిలో ఉంచుకుని గురువులు వ్యవహరించేవారన్నారు. తన తల్లిదండ్రులు భావించినట్లుగా ఏ డాక్డరో, ఇంజినీరో కాకుండా సాహిత్యం వైపు అడుగులు వేసేందుకు గురువులే ప్రేరణ అని పేర్కొన్నారు. తనకు 2000-3000 పద్యాలు కంఠస్థం కావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇంతలో ‘కేసీఆర్‌ పద్యాలు పాడాలి’ అంటూ సభికుల నుంచి పెద్దఎత్తున వినతులు వెల్లువెత్తడంతో మనుచరిత్ర, పారిజాతాపహరణంల నుంచి ఇలా రెండు పద్యాలను అలవోకగా, అనర్గళంగా సీఎం వినిపించారు..
CMKCR
1974లో ఇలా..
1974లో జరిగిన తెలుగు మహాసభల సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని ఈ సందర్భంగా సీఎం పంచుకున్నారు. ‘‘అప్పట్లో నేను చదివే పాఠశాల గ్రంథాలయంలో పుస్తకాలు ఇచ్చేందుకు ఇబ్బంది పెట్టేవారు. దీంతో నేను ఏ పుస్తకం అడిగితే అది ఇవ్వాలంటూ గ్రంథాలయ అధికారిని స్వయంగా ప్రిన్సిపల్‌ గంగారెడ్డి ఆదేశించారు. ఆ నాటి తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు వివిధ స్థాయిల్లో పోటీలు నెగ్గిన వారికే అవకాశం దక్కేది. నా సహవిద్యార్థి ఓంకార్‌తో కలసి వాటన్నింట్లోనూ నెగ్గి మహాసభల్లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నా. 1974లో గురువుగారు సన్నిదానం సుబ్రహ్మణ్యశర్మతో కలసి నేను, ఓంకార్‌ పుస్తకాల సంచులు వేసుకొని అబిడ్స్‌ గ్రామర్‌ స్కూల్‌ వద్ద బస్సుదిగాం. మా వద్ద సంచులు, సూట్‌కేసులు చూసి పోలీసులు అటకాయించారు. అందులో ఏం ఉన్నాయో చూపెట్టాలని పట్టుబట్టారు. తీరా చూశాక అందులో ఉన్న పుస్తకాలను చూసి ‘కుచ్‌బీ నయ్‌ పూరా కితాబ్‌.. యే పూరా పాగల్‌ దిఖరా సాబ్‌’ అని కానిస్టేబుల్‌ తన ఉన్నతాధికారికి చెప్పారు. ఈ గొడవ వల్ల మేం ఎక్కడ పోటీలో నెగ్గలేమోనని గురువు గారు మదనపడ్డారు. బహుమతులు సాధించి పాఠశాలకెళ్లగా.. ‘రక్షకభటులు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు.. లేకపోతే మనవాళ్లు మొదటి బహుమతి గెలుచుకునేవారు’ అని ప్రిన్సిపల్‌కు గురువు గారు చెప్పారు’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. సాహితీ ప్రియుల సహకారం, భగవత్‌ కృపతో దిగ్విజయంగా మహాసభలు జరగటం శుభపరిణామమన్నారు.

గుండెలనిండా సంతోషం..

సభల నిర్వహణపై తొలుత సిధారెడ్డికి తనకూ వివాదం జరిగిందని సీఎం చమత్కరించారు. మమ్మీ, గిమ్మీల కాలంలో తెలుగు అంటే ఎవరు వస్తారంటూ తనతో సిధారెడ్డి విభేదించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే తెలుగు మహాసభలు దేదీప్యమానంగా చరిత్రలో నిలిచేలా జరుగుతాయంటూ తాను భరోసా ఇచ్చానని.. ఇప్పుడు అదే నిజమైందన్నారు. మూడురోజులుగా సభలు జరుగుతున్న తీరు అద్భుతమంటూ ప్రశంసించారు. కిక్కిరిసిన వాతావరణాన్ని చూస్తుంటే గుండెలనిండా సంతోషం కలుగుతోందన్నారు. మహాసభల ఏర్పాట్లలో సీఎస్‌ పనితీరును అభినందించారు. ముగింపు వేడుకల్లో తెలుగు పరిరక్షణకు సంబంధించి పలు అద్భుత ప్రకటనలు ఉంటాయని సీఎం చెప్పారు.

సీఎం చదివి వినిపించిన పద్యాలు

అటజని కాంచె భూమి సురుడంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహు ర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్స్వన
స్ఫుటనట నానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్‌
గటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్‌

నను భవదీయ దాసుని మనంబున నెయ్య పుగిన్క రూనితా
చిన యది నాకు మన్ననయ చెల్వగు నీపద పల్లవంబుమ
త్తను పులకా గ్రంటకవితానము దాకిన నొచ్చునంచునే
ననియెద నల్కమానవు కదా యికనైన నరాళకుంతలా

Source: http://www.eenadu.net/world-telugu-conference/world-telugu-conference-news.aspx?article=258