మహనీయులను వెలుగులోకి తెస్తాం | World Telugu Conference 2017, Telangana State

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

మహనీయులను వెలుగులోకి తెస్తాం

Telugu Mahasabhalau 2017 - Telangana Sahithya Sourabhalu

తెలుగు సాహిత్యంలో తెలంగాణ మహనీయులను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంతోనే ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి చెప్పారు. మహాసభల్లో భాగంగా తెలంగాణ సారస్వత పరిషత్తులో శనివారం తెలంగాణ సాహితీ సౌరభాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా సిధారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం నిర్వహించబోయే ప్రపంచ తెలుగు మహాసభలకు, గత మహాసభలకు పోలికలేదని చెప్పారు.

దశాబ్దాలపాటు మరుగునపడిన కవి చందాల కేశవదాసు తెలంగాణ ఉద్యమంతో వెలుగులోకి వచ్చారన్నారు. ఆ ఉద్యమస్ఫూర్తితో మరుగునపడిన తెలంగాణ మహనీయులందర్నీ వెలుగులోకి తీసుకొస్తామన్నారు. మరుగునపడిన మహనీయుల పేర్లను స్వాగతద్వారాలకు పెడుతామని, వారిపై పుస్తకాలు ప్రచురించి ఈ తరానికి పరిచయం చేస్తామన్నారు. తెలుగు మహాసభల నిధుల నుంచి లక్ష రూపాయలను సారస్వత పరిషత్తుకు విరాళంగా ఇస్తామని ప్రకటించారు.

ఈనాటికీ ఎందరో తెలంగాణ మహనీయుల గురించి తెలుసుకునే అవకాశమే లేకుండాపోయిందని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. వారిని మహాసభల్లో స్మరించుకుంటామని పేర్కొన్నారు. సారస్వత పరిషత్తులో తెలుగు పండితుల శిక్షణా కళాశాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చొరవచూపాలన్నారు. కార్యక్రమంలో సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, కార్యదర్శి జే చెన్నయ్య, కోశాధికారి మంత్రి రామారావు ప్రసంగించారు. తొలిరోజు సాహితీ సమాలోచనలో చందాల కేశవదాసు, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మాడపాటి హనుమంతరావు జీవిత విశేషాలను వక్తలు డాక్టర్ జే విజయకుమార్జీ, డాక్టర్ శ్రీరంగాచార్య, ద్యావనవల్లి సత్యనారాయణ వివరించారు.