రాజా బహద్దూర్‌ వెంకట్రామారెడ్డిగారి వ్యక్తిత్వం

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

రాజా బహద్దూర్‌ వెంకట్రామారెడ్డిగారి వ్యక్తిత్వం, సేవానిరతి, అభ్యుదయ కాంక్ష, సంస్కరణా దృష్టి, ఆదర్శ ప్రాయమైనవి.

Raja bahddoor venkatrami reddy
వనపర్తి సంస్థానంలో ఉన్న రాయణిపేట గ్రామంలో రాజా బహద్దూర్‌ వెంకట్రామారెడ్డి 1869 ఆగస్టు 22వ తేదీన జన్మించినట్టు సురవరం ప్రతాపరెడ్డి ఒక చోట పేర్కొన్నారు. ఆనాటి విద్యా వ్యవస్థలోని ఆచారం మేరకు ఖాన్గీ అంటే ప్రైవేటు బడిలో తొమ్మిదో ఏడు దాకా చదువుకొని, తొమ్మిది నుండి పన్నెండో ఏడు నాటికి ఉర్దూలో ‘పహిలీ’ పూర్తి చేసి, ఫారసీలో ‘కరీమా’ అనే పుస్తకాన్ని చదివే శారు. బాల్యంలో ఊరిలోని పెద్ద బాలశిక్ష, సుమతీ శతకం, నరసింహ శతకం, కూడికలు, తీసివేతలు, వడ్డీ లెక్కలు మొదలైనవి నేర్చుకున్నారు. ఆ తరువాత మేనమామగారితో కలిసి రాయచూరు వెళ్లి, అక్కడ పందొమ్మిదో ఏడు వచ్చే వరకు విద్యా భ్యాసం చేశారు. ఉర్దూభాషలో ప్రావీణ్యం సంపాదిం చడంతోపాటు తెలుగు, కన్నడ, మరాఠీ భాషలలో మంచి పట్టు సాధించారు. చిన్నతనంలోనే భారత, భాగవతాలు చదివారు. తెలుగులో జాబులు ఎంతో చక్కగా, కుదురుగా రాసేవారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి, మేనమామ ఆకస్మికంగా చనిపోవడంతో వారి జీవితం అనుకోని మలుపు తిరిగింది.

నజర్‌ మహమ్మద్‌ఖాన్‌ అనే సీనియర్‌ పోలీసు ఉద్యోగి వెంకట్రామారెడ్డిని చేరదీసి జీవితం లో ముందుకు నడిపించాడు. దాని ఫలితంగా పద్దె నిమిదేండ్ల ప్రాయంలోనే అంటే 1886లో ముదిగ ల్లు ఠాణాకు నాల్గవ దర్జా పోలీసు అమీన్‌ అంటే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగంలో చేరారు. మేనమామ ఉద్యోగంలోకి బదిలీ అయ్యి వచ్చిన పఠాన్‌ మహ్మద్‌ ఖాన్‌ పదిహేడు సంవత్సరాల రెడ్డి గారికి తమ పోలీసు శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని వాగ్దానం చేసి వెంట తీసుకొని వెళ్లాడు. అప్పట్లో ఆయన కావలసినంత పొడుగు, తగినంత శారీరక పుష్టి లేకపోవడం వల్ల ఎత్తు బూట్లు తొడుక్కొని, దళసరి బట్టలు ధరించి వెళ్లాడు. అటువంటి రెడ్డి గారిని చూసి అక్కడి అధికారులు ”ఇంత చిన్న పిల్లవాడికి ఉద్యోగమేమిటి? ఇంకా కొంతకాలం చదువు కోనివ్వండి, అవసరమైతే నెలకు రూ.50 ఉపకార వేతనం ఇద్దాం” అని అన్నారట. కానీ ఆయన ఆర్థిక పరిస్థితిని బట్టి అత నికి ఏదో ఒక ఉద్యోగం అనివార్యమని భావించిన పఠాను అక్కడి జిల్లా పోలీస్‌ డైరెక్టర్‌గా ఉన్న ఆంగ్లేయుడి సహాయంతో, అధిక ప్రయత్నంతో ఈ సార్జంట్‌ ఉద్యోగం ఇప్పించిగలిగాడు. నెలకు 60 రూపాయల జీతం, గుర్రపు స్వారీ, దాని అలవెన్సు కింద నెలకు 20 రూపాయలు ఇచ్చేవారు.

ఉర్దూ భాషలోని కవితలను విని, చదివి, రాయడం కూడా నేర్చుకున్నాడు. ఆనాటి రాజ్య వ్యవస్థలో నాలుగు పాలనా విభాగాలుండేవి. ప్రతి విభాగానికి ఒక పోలీసు సదర్‌ మోహతెమీం ప్రధానాధికారిగా ఉండేవాడు. పోలీసు సిబ్బందికి యూనిఫారమ్‌ ఉండేది కాదు. కొందరు ధోవతులు, కొందరు పట్కాలు, కొందరు కోట్లు ధరించేవారు. చేతిలో కర్రగాని, కత్తిగాని పట్టుకొనేవారు. ఆయన నిజాయితీ, సమర్థత, విధుల నిర్వహణలో చాకచక్యం వల్ల నాల్గవ దర్జా నుండి మూడవ దర్జా అమీనుగా పదోన్నతిపై నాగర్‌కర్నూల్‌ వెళ్లాడు. అ ప్పుడే బ్రిటీష్‌ సైన్యం నుండి నేరం చేసి పారిపోయి వచ్చిన డగ్లస్‌ అనే సోల్జర్‌ను పట్టుకోవడంలో కృతకృ త్యులయ్యాడు. దానితో ఆయన పేరు ప్రతిష్టలు ఇనుమడించాయి. అనంతరం జిల్లా పోలీసు అధికా రిగా నియమింపబడ్డారు. గుల్బర్గాకు బదిలీ అయ్యా రు. అక్కడ ప్లేగు వ్యాధి బారిన పడిన వారిని కాపాడారు. నిజాం నవాబ్‌ మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ బహద్దూర్‌ పాలనాకాలంలో మొహతెమింగా ఉన్న రెడ్డిగారు ప్రాణాలకు తెగించి ఆనాటి అరబ్బు దుండగుల ఆటకట్టించారు. దీనితో నిజాం నవాబు దృష్టిని ఆకర్షించారు. ఆనాటి హైదరాబాదు రాష్ట్రం లో ఉన్న ఒక కోటి 44 లక్షల మంది ప్రజలలో డెబ్బై లక్షల మంది తెలుగువారు. వీరిలో ఎంతో మంది పండితులు, విద్యాధికులు ఉన్నప్పటికీ ఆంగ్ల విద్య పరిచయం లేని, ఆధునిక నాగరికత అబ్బని, అతి సామాన్యుడైన ఆయన నిజాం ప్రభువు మెప్పుకు పాత్రుడయ్యాడు. నిజాంపాలనలో హైదరాబాదు నగర కొత్వాలుగా నియమింపబడిన మొదటి హిందువు రెడ్డిగారే. అప్పటి నుంచి ఆయన ఇటు ప్రభువుల సేవకు, అటు ప్రజాసేవకు అంకితమయ్యారు. రెడ్డిగారి కొత్వాల్‌ కచేరీ ఎప్పుడూ ప్రజలతో, ప్రభుత్వాధికారులతో నిండి ఉండేది. ప్రజల రకరకాల సమస్యలను స్వయంగా, సావధానంగా విని పరిష్కరించేవారు. న్యాయస్థానాలలో కేసుల పరిష్కారా లలో జరిగే జాప్యాన్ని నివారించేవారు. సరైన న్యాయం జరగని సందర్భాలలో తమ కచేరీలోనే విచారణ జరిపి తీర్పులిచ్చేవారు. వారి న్యాయశాస్త్ర పరిజ్ఞానా నికి న్యాయమూర్తులు సైతం ముగ్ధులై మెచ్చుకొనేవారట. గణపతి ఊరేగింపు సందర్భంలో వచ్చిన తగాదాను అప్పటి కప్పుడు పరిష్కరించి ఊరేగింపును సజావుగా నడిపించారు. ఒకసారి గాంధీగారు వచ్చినప్పుడు ఖద్దరు ప్రదర్శనశాలను సందర్శించాలనుకొన్నారు. అప్పుడు పై నుంచి వచ్చిన నిషేధాజ్ఞల వల్ల ఆ పర్యటన రద్దయ్యే పరిస్థితిలో రెడ్డిగారు కల్పించుకొని దానిని చక్కదిద్దారు. అదే విధంగా రైల్వే కూలీల సమ్మెను సామర స్యంగా ఎదుర్కొన్నారు.

గాంధీగారు రెడ్డిగారి హయాంలోనే నిజాం రాష్ట్రానికి వచ్చాడు. అప్పుడు హోం మినిష్టర్‌గా ఉన్న సర్‌ ట్రెంచ్‌ ఆ సమయంలో జరుగుతున్న ఖాదీ ప్రదర్శనలను గాంధీజీ చూడకూడదని నిషేధాజ్ఞ విధిం చాడు. గాంధీగారికి కోపం వచ్చి తిరిగి వెనక్కి వెళ్లిపోవడానికి సిద్ధమ య్యాడు. ఆ సమయంలో రెడ్డి గారు స్వయంగా కల్పించుకొని సంయమనంతో గాంధీగారితో మాట్లా డి శాంత పరచి పరిస్థితి చక్కదిద్ది కార్యక్రమాన్ని అనుకున్నట్టుగానే జరిపించారు. అప్పటి మురళీలు, బసవి రాండ్రనే దురాచా రాన్ని రెడ్డి గారు రూపుమాపారు. అంటే ఆడపిల్లలను యావ జ్ఞీవం వేశ్య వృత్తిలోకి దింపడం. ఈ అనాచారాన్ని తుడిచి వేయడానికి రెడ్డి గారు నడుం బిగించి విజయం సాధించారు. దీంతోపాటు ఆయన శాసన సభ్యు లుగా ఉన్న కాలంలో వితంతు వివాహ చట్టం, వెట్టిచాకిరి వ్యతిరేక చట్టాలను కూ డా చేయించారు. పాఠశాలలు నెలకొల్పి విద్యావ్యాప్తికి కృషి చేశారు. బీద రైతులకు సహకరించారు. భూమి ఆదాయ శాఖ, పోలీసు శాఖలను సంస్కరించి ముందుకు నడిపించారు. గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాలను నిర్వహించారు. బాల్యవివా హాలను రద్దుపరచి, వితంతు వివాహాలను ప్రోత్సహించారు. మూఢాచా రాలను వ్యతిరేకించారు. అన్నిమతాల, కులాల వారిని చేరదీశారు. సురవరం వారి ‘గోల్కొండ పత్రిక’కు అండగా నిలిచారు.

శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, వేమనాంధ్ర భాషానిలయం, బాల సరస్వతి గ్రంథాలయ పురోభివృద్ధికి సహకరించారు. 1945లో ఓరుగల్లులో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు ద్వితీయ వార్షికోత్సవాన్ని ఆయన ప్రారం భించారు. ఆంధ్రోద్యమానికి చేయూతనిచ్చాడు. స్త్రీ విద్య కోసం ఆయన చేసిన సేవ మరువరానిది. హైదరాబాదులో బాలికలకు మాతృభాషలో చదువు చెప్పే పాఠశాల లేదని గ్రహించిన, మాడపాటి హను మంతరావుగారు నారాయణగూడలో ఏర్పాటు చేసిన బాలికల పాఠశాలకు రెడ్డిగారి దక్షతను గ్రహించి అధ్యక్షుడిగా నియమించారు. రెడ్డిగారు తమ బంగళా వెనుక భాగంలోనే పాఠశాల శాశ్వత భవన నిర్మాణం కోసం భూరి విరాళాలు సేకరించి ఆదుకొన్నారు. రెడ్డి విద్యార్థి వసతి గృహం, రెడ్డి బాలికల వసతి గృహం, ఆంధ్ర విద్యాలయం పరోపకారిని బాలికల పాఠశాల మొదలైన వాటికి తమ భవన భాగాన్ని ట్రస్టుగా మార్చి ఆ ఆదాయా న్ని వాటికి సమంగా పంచారు. బర్కత్‌పురాలోని మహిళా కళాశాల స్థాపనకు కారకులయ్యారు. నాటి నుంచి నేటికి ఆర్‌బీవీ, ఆర్‌ఆర్‌ కాలేజీగా రాణిస్తూనే ఉంది. ఇటు నారాయణగూడలోని మాడపాటి హ నుమంతరావు బాలికల పాఠశాల అటు బర్కత్‌పురలోని రావుబహద్దూర్‌ వెంకట్రామరెడ్డి మహిళ కళాశాల ఈ రెండింటి మధ్య నెలకొల్పబడిన రెడ్డిగా రి నిలువెత్తు విగ్రహం ఆ సంస్థలను చెయ్యెత్తి సదా దీవిస్తూ ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. రాజాబహద్దూర్‌ వెంకట్రామారెడ్డి గారు ఒక మహా సంస్థ వంటి వారు.

ప్రజా సంస్థలకు ఆనాటి రాజకీయ పార్టీలకు, యువజన సంస్థలకు, విద్యార్థులకు సన్నిహితులుగా ఉండేవారు. కాంగ్రెస్‌, కమ్యూనిస్ట్‌ పార్టీల మధ్యగానీ లేదా స్టేట్‌ కాంగ్రెస్‌లోని రెండు వర్గాల మధ్య గానీ, వివాదాలు తలెత్తినప్పుడు ఆయ న మధ్యవర్తిగా వ్యవహరించి ఇరుపక్షాలతో చర్చలు జరిపి తగవులు సామరస్యంగా పరిష్కరించేవారు. అస్పృశ్యత దురాచారాన్ని నిరసించారు. హరిజనో ద్ధరణ సంఘాలకు సహాయమందిచాడు. అనాథ బాలల ఆశ్రమాలకు, కుష్ఠు నివారణ కార్యక్రమాలకు, జంతు హింసా నివారణ సంస్థలకు ఆయన ఆర్థికంగా తోడ్పాటును అందిచారు. కుష్ఠు రోగుల చికిత్సాలయాలను స్వయంగా నెలకొల్పారు. ఆనాడు హైదరాబాద్‌ రాష్ట్రంలో పర్వర్దాలను అంటే పెంపుడు పిల్లలను ధనికులు, రాజులు, నవాబులు తమ సేవలో ఉంచుకొని వారిని శాశ్వతంగా బానిసలుగా చేసుకొనేవారు. ఈ దురాచారానికి స్వస్తి పలకడానికి రెడ్డిగారు శాసనసభలో శిశివుల సంరక్షక చట్టాన్ని చేయించారు. వృద్ధాశ్రమాలను పోషించారు. ఆనాటి హైదరాబాద్‌ నగరంలో మహ్మదీయ స్త్రీలకు లేడీ హైదరీక్లబ్‌ ఉన్నట్టుగానే హైంధవ స్త్రీల కోసం కూడా బొగ్గులకుంటలో లేడీస్‌ రిక్రియేషన్‌ క్లబ్‌ నిర్మించారు. ఆంధ్ర యువతీ మండలి భవన నిర్మాణానికి స్థలం కేటాయించారు. రాజాబహద్దూర్‌ వెంకట్రామారెడ్డి 1951లో అనారోగ్య పీడితులై 1953 మే ఒకటవ తేదీన హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన వ్యక్తిత్వం, సేవానిరతి, అభ్యుదయ కాంక్ష, సంస్కరణా దృష్టి, ఆదర్శ ప్రాయమైనవి…….డా|| టి.గౌరీశంకర్‌

Source: http://www.navatelangana.com/article/vedika/648843