తెలుగు విశ్వభాష - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలుగు విశ్వభాష

PresidentRamnathKovind

తెలుగు విశ్వభాషగా గుర్తింపు పొందిందని, ఖండాంతరాలకు వ్యాప్తి చెందిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. తెలంగాణ అభివృద్ధిపరంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ విశ్వనగరంగా ఖ్యాతి సాధిస్తున్నదని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికానుంచి ఆగ్నేయాసియా దేశాల వరకు తెలుగువారు, తెలుగు మాట్లాడేవారు విజేతలుగా నిలుస్తున్నారని చెప్పారు. హిందీ తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడే భాష తెలుగు అన్నారు. ఈ భాష గొప్పతనాన్ని గుర్తించిన ప్రభుత్వం 2008లోనే తెలుగుకు ప్రాచీన హోదా కల్పించిందని తెలిపారు. మానవ పరిణామ క్రమంలో తెలుగు ప్రాంతం పోషించిన కీలక పాత్ర విస్మరించలేనిదని రాష్ట్రపతి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా, సాంకేతిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఎందరో తెలుగువారు పేరు ప్రఖ్యాతులు పొందారని అంటూ.. సత్య నాదెళ్ల, ఎల్లాప్రగడ సుబ్బారావు పేర్లను రామ్‌నాథ్ ఉదహరించారు. హైదరాబాద్‌లో మంగళవారం ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోదర సోదరీమణులారా.. నమస్కారం అంటూ తెలుగులో పలుకరిస్తూ రామ్‌నాథ్ కోవింద్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే..

దేశ భాషలందు తెలుగు లెస్స
దేశ భాషలందు తెలుగు లెస్స. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావడం నాకు ఎంతో సంతోషాన్నిస్తున్నది. రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత నేను మొదటిసారిగా తెలంగాణలో కార్యక్రమానికి హాజరవుతున్నా. తెలుగు మహాసభలకు దేశంలోని 18 రాష్ర్టాల నుంచి 42 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని తెలుసుకున్నా. ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు దేశ, విదేశాల నుంచి హాజరైన వారందరికీ నా అభినందనలు. నా సహచరులు, తెలుగుజాతికి గర్వకారణం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ మహాసభలను ప్రారంభించడం నాకు సంతోషాన్నిచ్చింది. ఈ ఐదు రోజుల మహాసభ తెలుగువారందరికీ గొప్ప గౌరవాన్నిచ్చింది. దేశంలోనే అత్యధిక మంది మాట్లాడే రెండో భాష తెలుగు కావడం విశేషం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో తెలుగు మాతృభాషగా ఉంది. ప్రాచీనకాలం నుంచి తెలుగు భాషకు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించి, 2008లో ప్రాచీన భాష హోదా కల్పించారు. తెలుగుభాష అభివృద్ధిలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పాత్ర కీలకమైనది. భాషాభివృద్ధిపై ఆయన అత్యంత శ్రద్ధ కనబరుస్తున్నారు. తెలుగు భాష, సాహిత్యంపై ఆయనకు మంచి పట్టుందని విన్నాను. విజయనగర సామ్రాజ్యంలో చక్రవర్తి కృష్ణదేవరాయలు గొప్పపాలకుడేకాకుండా తెలుగుభాష అభివృద్ధికి కూడా అంతేస్థాయిలో పాటుపడ్డారు. ఆయన తర్వాత మరెందరో ఆ భాష ఔన్నత్యాన్ని పెంచడానికి తమవంతు కృషిచేశారు. నాకు ముందు రాష్ట్రపతులుగా పనిచేసిన డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి తెలుగువారే. భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన ఈ ప్రాంతానికి చెందిన దివంగత పీవీ నరసింహారావు తెలుగువారు. ఆయనను నేనెంతో గౌరవిస్తాను. ఆయన తెలుగుతోపాటు పలు భాషలలో పట్టున్న బహుముఖ ప్రజ్ఞాశాలి.

వేయి సంవత్సరాల క్రితమే వ్యాకరణం రాసిన నన్నయ
వేయి సంవత్సరాల క్రితం నన్నయ్యభట్టు తెలుగు వ్యాకరణం రాయడమే కాకుండా.. మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు. ఆయన అనంతరం తిక్కన వచ్చారు. 19వ శతాబ్దంలో గురజాడ అప్పారావు తన రచనలు, నాటకాల ద్వారా జాతి నిర్మాణానికి స్ఫూర్తినిచ్చారు. కవి శ్రీశ్రీ తన కవితలలో సామాన్యుల గళం వినిపించారు. నవల, కవితల ద్వారా వట్టికోట ఆళ్వార్‌స్వామి వంటి వారు తెలుగు భాష వెలుగును దశ దిశలా వ్యాపింపచేయడానికి కృషిచేశారు. ఆయనతో విభేదించేవారు సైతం ఆయనను గౌరవించేవారు. దాశరథి గీతాలు ఇప్పటికీ అంతా పాడుకుంటుంటారు. పాండిత్యానికి, విజ్ఞానానికి, నిరసనలకు స్వేచ్ఛకు, జాతి గొప్పదనానికి, సార్వజనీన విలువలకు భాషగా తెలుగు ఉన్నది. ఈ రోజుకు కూడా త్యాగరాజ కృతులు కర్ణాటక సంగీతానికి కేంద్రంగా ఉన్నాయి. అన్నమాచార్య భక్తి గీతాలు సంప్రదాయానికి, విశ్వాసానికి పునాదిగా నిలిచాయి. అడవిపై, ప్రకృతి వనరులపై హక్కులపట్ల గిరిజనుల్లో స్పృహ కల్పించిన కుమ్రం భీం, భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా పోరాడిన సాహసనారి ఐలమ్మ ఇదే ప్రాంతానికి చెందినవారన్న సంగతిని విస్మరించలేం. వంద సంవత్సరాల క్రితం రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త భాగ్యరెడ్డివర్మ అంటరానితనమనే అనాచారానికి వ్యతిరేకంగా పోరాటంచేశారు. పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించారు. సమాజంలో రుగ్మతలను పారదోలడానికి పాటుపడటంతోపాటు హైదరాబాద్‌ను స్వతంత్ర భారతావనిలో కలుపడానికి స్వామి రామానందతీర్థ కృషిచేశారు. స్వాతంత్య్ర సమరంలో తెలుగువారైన అల్లూరి సీతారామరాజు విప్లవకారులుగా కీలక భూమిక నిర్వహించారు. ఇలా ఎందరో తెలుగువారు జాతి అభ్యున్నతికోసం కృషిచేశారు. నేను కొంతమంది పేర్లను మాత్రమే చెప్పాను. ఇంకా ఎందరో విశేషమైన పాత్రను పోషించారు. ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు.

ఖండాంతరాలకు తెలుగు భాష
తెలుగు భాష ఇప్పుడు విశ్వభాషగా గుర్తింపు సాధించింది. ఖండాతరాలకు వ్యాపించింది. ఇది పరిశ్రమలు, సాంకేతికరంగ భాష. విదేశాల్లోని తెలుగువారు సాఫ్ట్‌వేర్‌శక్తులుగా ఉన్నారు. దేశానికి పేరు తెస్తున్నారు. దక్షిణాఫ్రికా నుంచి ఆగ్నేయాసియా వరకు తెలుగువారు, తెలుగు మాట్లాడేవారు విజేతలుగా గుర్తింపు పొందారు. అమెరికాలో తెలుగువారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. పారిశ్రామికవేత్తలుగా, డాక్టర్లుగా, సాంకేతిక నిపుణులుగా ప్రఖ్యాతి పొందుతున్నారు. ప్రతిష్ఠాత్మకమైన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలుగువాడు కావడం గర్వకారణం. ప్రఖ్యాత జీవ రసాయన శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు 1920-30 దశాబ్దంలో హార్వర్డ్ వర్సిటీలో తన ప్రతిభ చాటారు. విశ్వవ్యాపంగా తెలుగువారు విస్తరించి ఉన్నా.. మాతృభాష పట్ల, తమ మాతృభూమి సంస్కృతి పట్ల వారి చిత్తశుద్ధి బలీయమైనది. అక్కడి వారు మనబడి అనే కార్యక్రమం ద్వారా తాతలు, తండ్రుల ద్వారా పిల్లలకు తెలుగు బోధిస్తున్నట్టు తెలుసుకున్నప్పుడు ఎంతో సంతోషించాను.

ఉత్తర దక్షిణాలకు తెలుగు వారధి
దేశంలో ఉత్తర, దక్షిణ భాగాలకు వారధిగా తెలుగు భాషను భావిస్తుంటారు. తెలుగు ప్రజల్లాగే తెలుగు భాష కూడా ఇతర సంస్కృతుల నుంచి ఆలోచనలను, పదాలను స్వీకరిస్తుంది. సంస్కృతం, అరబిక్, ఉర్దూ, ఇంగ్లిష్, ఇతర భాషల నుంచి పదాలను తెలుగు తనలో ఇముడ్చుకుంది. ప్రస్తుతం మనం ఉన్న హైదరాబాద్ నగరం కూడా అనేక సంస్కృతులు, మతాలకు వారధి. ఇక్కడ అన్ని రాష్ర్టాలవారూ ఉన్నారు. అంతేకాదు.. ఇది విశ్వ మహానగరం. దీని సాంకేతిక పరిశ్రమ, ఇక్కడి ఫార్మాస్యూటికల్ కంపెనీలు, వ్యాక్సిన్ల ఆవిష్కరణలు జాతికి గణనీయ సేవలందించాయి. ఇక్కడ అనేక విద్యాసంస్థలు, వైద్య సదుపాయాలు, సినిమా పరిశ్రమ, స్పెషల్ ఎఫెక్టుల కేంద్రాలు, క్రీడాప్రాంగణాలు వర్థిల్లుతున్నాయి. ఇవన్నీ ప్రతి భారతీయుడికి గర్వకారణం. ఒక్క మాటలో చెప్పాలంటే మహత్తరమైన ఈ నగరం బిర్యానీకి, బ్యాడ్మింటన్‌కు, బాహుబలికి ప్రసిద్ధి పొందాయి. సులభ వాణిజ్య విధానంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు దేశంలోనే నంబర్‌వన్‌గా నిలువడం అందరికీ సంతోషం కలిగించే విషయం. కొత్త రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. పరిశ్రమలకు, వ్యాపారాలకు విశ్వసనీయమైన నగరంగా నిలుస్తున్నది. దీనికి నేను తెలంగాణ ప్రభుత్వానికి, ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటీవల ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సును ఘనంగా నిర్వహించినందుకు ప్రత్యేక అభినందనలు. రెండు తెలుగు రాష్ర్టాలు విజయవంతంగా సాగుతుండటం అంతులేని సంతోషాన్నిస్తున్నది. ఇక్కడ ఉన్నవారందరికీ రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆరో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించుకునే సందర్భం కోసం ఎదురుచూస్తాను. ఈ మహాసభలను ఇంత దిగ్విజయం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు. ఇది రాష్ట్ర కిరీటంలో మరో కలికితురాయి. రాయప్రోలు సుబ్బారావు చెప్పిన మాటలు గుర్తుచేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తాను.

ఏ దేశమేగినా ఎందుకాలిడినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/president-ram-nath-kovind-speech-at-prapancha-telugu-mahasabhalu-1-2-562541.html