రేపే తెలుగు మహాసభల ప్రారంభం - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

రేపే తెలుగు మహాసభల ప్రారంభం

ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన వేదిక పాల్కురికి సోమనాథుడు ప్రాంగణం (ఎల్బీ స్టేడియం)లో బమ్మెర పోతన వేదికపై శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తెలుగు మహాసభలను ప్రారంభిస్తారు. ఆయన ఎల్బీ స్టేడియానికి చేరుకోగానే పూర్ణకుంభంతో ఆహ్వానం పలుకుతారు. పండితులు వేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలతో సభావేదిక వద్దకు ఆహ్వానించిన తర్వాత వేదికపై తెలంగాణ వైభవాన్ని చాటే ముప్ఫై నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు. అనంతరం వేదికపైకి అతిథులను ఆహ్వానిస్తారు. జాతీయ గీతం ఆలాపనతో తెలుగు మహాసభ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సరస్వతి స్తోత్రాన్ని నటేశ్వరశర్మ ఆలపిస్తారు. సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి స్వాగతోపన్యాసం చేస్తారు. తెలంగాణ తల్లిని పూలమాలతో అలంకరిస్తారు. తర్వాత బమ్మెర పోతన పద్యాల పఠనం ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత కేవీ రమణాచారి వ్యాఖ్యాతగా వ్యవహరించే సభలో వెంకయ్యనాయుడు, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రసంగిస్తారు. అనంతరం అతిథులను సత్కరిస్తారు. ఈ మహాసభలో పాల్గొన్న జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీతలను సన్మానిస్తారు. అనంతరం ఎన్ గోపి కవితా పఠనం ఉంటుంది. వెంటనే ఎల్బీ స్టేడియం బయటే పటాకులు పేల్చుతారు. ఆకాశంలో మిరుమిట్లు గొలుపుతూ వెలిగే పటాకుల కాంతిని ఆహుతులంతా వీక్షించేలా ఏర్పాటు చేశారు. అనంతరం జాతీయ గీతాలాపనతో సభను ముగిస్తారు.

తెలంగాణ గుండెనిండుగా తెలుగు పండుగ తెలుగు మహాసభల ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంతోపాటు ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం, రవీంద్రభారతి తదితర వేదికలు ముస్తాబయ్యాయి. మహాసభల కోసం విదేశాల నుంచి అతిథులు విచ్చేస్తున్నారు. ఈ నెల 15 శుక్రవారం తెలంగాణ గుండెనిండా తెలుగు పండుగ నినాదంతో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం కానున్నాయి. మహాసభలకు 300 మంది విదేశీ ప్రతినిధులు, ఇతరరాష్ర్టాల నుంచి 500 మంది హాజరవుతున్నారు. వివిధ హోటళ్లలో రెండువేల మందికి వసతి సదుపాయాలు కల్పించారు. అతిథులకు లోటుపాట్లు ఉండకూడదన్న ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం 14 శాఖలకు సంబంధించిన ముఖ్యఅధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విమానాశ్రాయాలు, ర్ల్వైస్టేషన్లు, బస్‌స్టాండ్లలో కియోస్క్ సమాచార కేంద్రాలను ఏర్పాటుచేశారు. అతిథులు రాగానే సమాచారం కేంద్రం సహాయంతో బసకు చేరుకోవడానికి అవకాశం ఉంది. ప్రతీ చోట టోపీ, టీషర్ట్ ధరించిన వలంటీర్లు మహాసభల సమాచారంతో సిద్ధంగా ఉంటారు. ఇప్పటికే అతిథులకు కేటాయించిన సహాయకుల సమాచారాన్ని వారికి అందించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రతీశాఖతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు. నగరం నాలుగు దిక్కులలో తెలంగాణ ఖ్యాతిని దశదిశల చాటిచెప్పిన తెలంగాణ వైతాళికుల మహోన్నత వ్యాఖ్యలతో స్వాగతతోరణాలను ఏర్పాటుచేశారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మహాసభల సందర్భంగా వంద పుస్తకాల ఆవిష్కరణ జరుగునున్నాయి.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/prapancha-telugu-mahasabhalu-2017-1-2-562027.html