అపూర్వ స్వాగతం అద్భుత ఆతిథ్యం - World Telugu Conferneces 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

అపూర్వ స్వాగతం.. అద్భుత ఆతిథ్యం

అప్పుడెప్పుడో అలంపురంలో తెలుగు మహాసభల గురించి విన్నాం.. ఆ తరువాత రెండు మహాసభలను కన్నాం.. వాటి గురించి మర్చేపోయాం.. ఇప్పుడు.. తెలుగునాట.. తెలుగు భాషా సాహిత్య చరిత్రలో ఒక సరికొత్త యుగం ఆవిష్కారమవుతున్నది. నభూతో నభవిష్యతి అన్న చందాన జరుగనున్న ప్రపంచ తెలుగు మహాసభలు రెండువేల ఏండ్ల తెలుగు సాహిత్య ప్రస్థానం నూతన శకానికి నాంది పలుకబోతున్నాయి. మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సన్నాహాలు జరుగుతున్న తీరు ఈ విషయాన్ని చెప్పకనే చెప్తున్నది. సాహిత్యానికి తమ జీవితాన్నంతా ధారపోసిన నూర్గురు ప్రముఖుల పేరిట.. తెలంగాణ శిల్ప నిర్మాణ చాతుర్యాన్ని అద్భుతమైన రీతిలో ప్రదర్శిస్తూ రాజధాని హైదరాబాద్ నలుచెరగులా స్వాగతతోరణాల ఏర్పాటు ఈ మహాసభల ఆండబరాన్ని తెలియజేస్తున్నాయి. నగరం విద్యుత్ దీపాలంకరణతో సర్వాంగ సుందరంగా స్తాబవుతున్నది.

Default post image

వేదికలకు వెళ్లే దారులు.. చారిత్రక కట్టడాలు, ప్రధాన కూడళ్లు.. భవంతుల సముదాయాలు.. ఇలా ఒకటేమిటి.. నగ రం తనకు తాను విద్యుత్ కాంతులతో శోభాయమానంగా మారనున్నది.స్వరాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణేతర ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి వేలాది ప్రతినిధులు, అతిథులు ఈ మహాసంరంభాన్ని వీక్షించేందుకు, వీటిలో భాగస్వామ్యం అయ్యేందుకు తరలి వస్తున్నారు. దేశవ్యాప్తంగా పలువురు జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు, వివిధ భాషల్లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు పొందిన ప్రముఖ రచయితలు ఈ సభల్లో పాల్గొనేందుకు వస్తుండటం విశేషం. వీరందరికీ ఎన్నటికీ మర్చిపోని విధంగా అద్భుతమైన ఆతిథ్యాన్నిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ, హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ ఏర్పాట్లు చేస్తున్నాయి. అతిథులందరికీ అవసరమైన రవాణ, వసతి సౌకర్యాలు కల్పించడమే కాకుండా, అపూర్వమైన రుచులను వారు ఆస్వాదించేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నాయి.

ఇతర సాధారణ వంటకాలతోపాటుగా తెలంగాణకు ప్రత్యేకమైన వంటకాలను అతిథులకు రుచి చూపించబోతున్నారు. డిసెంబర్ 15న మహాసభల ప్రారంభం సందర్భంలో.. తిరిగి 19న ముగింపు వేడుకల సందర్భంలో ప్రధాన వేదిక లాల్‌బహుదూర్ స్టేడియంలో ఆహా అనిపించేలా పటాకులతో పూలవర్షం కురిపించనున్నారు. అన్నింటికీ మించి తెలంగాణ వైభవాన్ని విశ్వవిఖ్యాతం చేసేందుకు రూపొందించిన లేజర్‌షో మహాసభలకు ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతున్నది. ప్రఖ్యాత గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ రాసిన పాటపై 25 నిమిషాలపాటు రూపొందించిన ఈ లేజర్ షోను మహాసభల ప్రధాన వేదికైన లాల్‌బహుదూర్ స్టేడియంలో ప్రదర్శించబోతున్నారు. మొత్తంమీద అనితర సాధ్యమనిపించేలా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సర్వశక్తులతో సమాయత్తమయింది.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/prapancha-telugu-mahasabhalu-poster-release-in-secretariat-road-1-2-561814.html