ప్రాచీన హోదాతో విశేష గుర్తింపు – తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం | World Telugu Conference 2017, Telangana State

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

ప్రాచీన హోదాతో విశేష గుర్తింపు – తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం

ప్రపంచ మహాసభలతో తెలుగుకు ఎనలేని మేలు జరుగుతుందనీ, ఇప్పటివరకు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలంగాణ సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. ప్రాచీన హోదాతో తెలుగుకు విశేష గుర్తింపు వచ్చిందన్నారు. తెలంగాణలో దక్షిణాది ప్రాంతీయ భాషా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, తద్వారా సమకూరే భారీ నిధులతో భాషాభివృద్ధికి పెద్దఎత్తున చర్యలు చేపట్టవచ్చన్నారు. మహాసభల నిర్వహణను ప్రభుత్వపరంగా పర్యవేక్షిస్తున్న ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.Burra Venkatesham - Telangana Government Cultural Secretary

తెలంగాణకు విశేష గుర్తింపు
తెలంగాణ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. తెలుగు మహాసభల ద్వారా మరోచరిత్ర సృష్టించనుంది. దేశంలో హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడేది తెలుగే. పది కోట్ల మంది తెలుగువారుండగా, మరో ఐదు కోట్ల మంది ఈ భాషను మాట్లాడుతున్నారు. ప్రపంచంలోని తొలి 15 భాషల్లో ఒకటిగా తెలుగు ఉంది. తెలంగాణలో తెలుగు భాషా సాహిత్యానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అచ్చమైన తెలుగుకు మన రాష్ట్రం పుట్టినిల్లు. వాడుక భాషను అత్యంత సహజంగా మాట్లాడటం ద్వారా దానికెంతో మాధుర్యం తెచ్చింది తెలంగాణ. తొమ్మిదో శతాబ్దం నుంచే పంపన మొదలు మల్లినాథసూరి, పాల్కురికి సోమన… ఇలా ఎందరో మహానుభావులు తమ రచనల ద్వారా… భాష అంటే ఇలా ఉండాలి అనిపించేలా తెలుగుకు గొప్ప పేరు తెచ్చారు. కానీ, వారి చరిత్ర బయటికి రాలేదు. మరోవైపు తెలుగు భాష ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. తమిళనాడు వంటి రాష్ట్రాలు మనకు ప్రాధాన్యం ఇవ్వట్లేదు. విద్య, ఉద్యోగ అవకాశాల పేరిట కొత్తతరం తల్లిభాషను నిర్లక్ష్యం చేస్తోంది. పాలనాభాషగానూ నిర్లక్ష్యానికి గురైంది.

‘తెలుగు ఆఫ్‌ వెస్ట్‌’ అనాలి
తెలుగును ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ఈస్ట్‌’ అంటారు. దానికి కాలం చెల్లింది. ఇప్పుడంతా ‘తెలుగు ఆఫ్‌ వెస్ట్‌’ అనాలి. నిజానికి ఇటలీ భాష మాట్లాడేవారు నాలుగు కోట్ల మందే. తెలుగు మాట్లాడేవారు 15 కోట్ల మంది. మొదట్లో ఐరోపాను అనుసరించే విధానం కారణంగా… ఇటలీని పోలుస్తూ ఆ నానుడి వచ్చింది. తెలుగు, ఇటలీ భాషలు రెండూ అజంతాలు. అంటే అచ్చులతో ముగుస్తాయి. మాట్లాడ్డానికి ఎంతో మధురంగా ఉంటాయి.

దక్షిణాది ప్రాంతీయ భాషా కేంద్రం మంజూరు
ప్రాచీన హోదా వల్ల ప్రపంచ భాషల్లో ఒకటిగా తెలుగు గుర్తింపు పొందింది. దేశ విదేశీయులు పరిశోధన కోసం తెలుగును ఎంచుకుంటున్నారు. దీనివల్ల పర్యాటకంగా, సాంస్కృతికంగా రాష్ట్రానికి పేరు వస్తోంది. ప్రాచీన హోదాకు ఆటంకాలు తొలగడంతో, ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నాలు ఆరంభించాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. ఎంపీలూ ప్రయత్నించారు. ఫలితంగా రాష్ట్రానికి దక్షిణాది ప్రాంతీయ భాషా కేంద్రం మంజూరైంది. ప్రస్తుతం మైసూరులో కన్నడ, తెలుగులపై ఈ కేంద్రం ఉంది. తెలుగుకు విడిగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించింది. దీనిని హైదరాబాద్‌లోని స్టేట్‌ ఆర్ట్స్‌ గ్యాలరీలో ఏర్పాటుచేస్తాం. దీనికి కేంద్రం నిధులను మంజూరు చేస్తుంది. వీటితో తెలుగు భాష, లిపి, శాసనాలు, తాళపత్ర గ్రంథాలపై పరిశోధనలు చేపడతాం. మరుగున పడిన చరిత్రను వెలుగులోకి తెస్తాం.

ఇంటి పండుగలా మహాసభలు
మహాసభలు ఇంటి పండుగలా జరుగుతాయి. తెలంగాణ ఆతిథ్యానికి గొప్ప పేరుంది. అతిథులకు, ఆహ్వానితులకు ఘనమైన ఏర్పాట్లు చేస్తాం.

Source: http://www.eenadu.net/news/news.aspx?item=ts-state-news&no=4