ప్రవాసుల కృషి భేష్ - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

ప్రవాసుల కృషి భేష్

mp-kavitha
తెలుగు భాషాసాహిత్యాలపై ప్రభుత్వానికి ఉన్న ఎనలేని ప్రేమకు ప్రపంచ తెలుగు మహాసభలు నిదర్శనంగా నిలిచాయని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా రవీంద్రభారతిలో డాక్టర్ యశోదారెడ్డి ప్రాంగణం, బండారు అచ్చమాంబ వేదికపై విదేశాల్లో ఉన్న తెలుగువారి భాషా సాంస్కృతిక విద్యా విషయాలపై జరిగిన చర్చాకార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు భాష పరిరక్షణ కోసం విదేశాల్లో ఉంటున్న తెలుగు వారు విశేషంగా కృషి చేస్తున్నారని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజిలాండ్, మలేసియా, ఫిజీ తదితర 42 దేశాల నుంచి 450మంది ప్రతినిధులు వచ్చారని, ఒక్క మలేసియా నుంచే వంద మంది ప్రతినిధులు రావడం సంతోషంగా ఉన్నదని ఆమె తెలిపారు. దాదాపు రెండు వందల ఏండ్లుగా వారు అక్కడ తెలుగును బతికిస్తున్నారని వ్యాఖ్యానించారు. భాషాభివృద్ధి దిశగా ప్రభుత్వం కార్యాచరణను రూపొందించే దిశగా అడుగులు వేస్తున్నదని చెప్పారు.

మరుగున పడిన ఇక్కడి సాహిత్యాన్ని, కవులు, రచయితలు, కళాకారులను వెలుగులోకి తీసుకు వచ్చేందుకే తెలంగాణ తేజోమూర్తుల చిత్రాలను నగరమంతా ఏర్పాటు చేశామన్నారు. అందుకోసం విదేశీ గ్రంథాలయాల నుంచి సైతం వారి ఫొటోలను తెప్పించి చిత్రాలు వేయించినట్లు తెలిపారు. వంగూరి ఫౌండేషన్ అధ్యక్షుడు వంగూరి చిట్టెన్‌రాజు మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలు కన్నుల పండువగా జరిగాయని కొనియాడారు. నలభై ఏండ్లుగా నలభై మందిని పోగుచేయడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందని, కానీ తెలంగాణ ప్రభుత్వం 50 వేల మంది భాగస్వామ్యంతో ఈ సభలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. అమెరికాలో తెలుగు భాషాభివృద్ధి కోసం తెలుగు సాహితీ సంస్థ ఆధ్వర్యంలో 70కిపైగా పుస్తకాలను ప్రచురించడంతో పాటు, పోతన పద్యాలను ఆన్‌లైన్‌కి అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం తెలుగు భవన నిర్మాణం, బమ్మెర సారస్వత కేంద్ర నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు ఈ దశాబ్దపు అద్భుతంగా అభివర్ణించారు. ఈ మహాసంకల్పం చేసిన ముఖ్యమంత్రికి పాదాభివందనం చేస్తున్నానని భరణి చెప్పారు.

ప్రారంభసభలో తన గురువుకు పాదాభివందనం చేసి గొప్ప సంస్కారాన్ని చాటిన ముఖ్యమంత్రి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారిలో సంస్కారాన్ని మేలుకొలిపారని కొనియాడారు. ప్రవాస తెలుగు ప్రతినిధి ఆచార్య గౌరీశంకర్ మాట్లాడుతూ తెలుగు భాష అంతరించిపోనుందన్న నివేదికలను ఈ మహసభలు తుత్తునియలు చేశాయన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ప్రవాసుల సమన్వయకర్త మహేశ్ బీగాల మాట్లాడుతూ ఈ సారి సభలకు 42 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రముఖ కవి నారాయణస్వామి వెంకటయోగి మాట్లాడుతూ.. ఇంతకాలం నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ కవులు, రచయితల సాహిత్యాన్ని గుర్తుచేసుకోవడానికి ఇది సరైన సందర్భమని అన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాస తెలుగువారిని కల్వకుంట్ల సన్మానించారు.

తెలంగాణ చారు – ఆంధ్ర ఉప్పు
ఈ కార్యక్రమంలో ప్రసంగించిన వంగూరి చిట్టెన్‌రాజు మహాసభలను సీఎం కేసీఆర్ అద్భుతంగా నిర్వహిస్తున్నారని కొనియాడుతూనే.. ఈ వంటకం చాలా బాగా వండారు. అయితే తెలంగాణ చారు.. ఆంధ్ర కరివేపాకు కూడా వేశారు. అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వంగూరి వ్యాఖ్యలకు స్పందించిన సభాధ్యక్షుడు నారాయణస్వామి వెంకటయోగి మాట్లాడుతూ గత ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆంధ్ర చారులో మమ్మల్ని కల్యమాకు చేసిండ్రు. మేమిప్పుడు తెలంగాణ చారులో ఆంధ్రను ఉప్పులా వేశాం. రుచి కోసం. అంటూ జవాబిచ్చారు.

సాహిత్య చరిత్ర సింహావలోకనం
చరిత్ర పాఠంతో ఆకట్టుకున్న కల్వకుంట్ల కవిత
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన ప్రవాస తెలుగువారి సాహితీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ కవిత చరిత్ర మాస్టారుగా మారిపోయారు. పదిహేను వందల ఏండ్ల తెలంగాణ సాహిత్యం, ఇక్కడ వచ్చిన రచనలు, పుట్టిన ప్రక్రియలపై దృశ్యమాధ్యమం ద్వారా పరిచయం చేశారు. తెలంగాణ ప్రాంతంలో రెండువేల సంవత్సరాలకు పూర్వమే తెలుగు భాష ఉన్నదనడానికి తగిన ఆధారాలున్నాయని, కోటి లింగాలలో లభ్యమైన క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం నాటి నాణేలే అందుకు నిదర్శమని అన్నారు. వాటిపై గోబద, నారన, సమవాప అనే తెలుగు పదాలు లభ్యమయ్యాయని గుర్తుచేశారు. వాటి ఆధారంగానే తెలుగుభాషకు ప్రాచీన హోదా లభించిందని పేర్కొన్నారు.

శాతవాహనుల కాలంలో రాజభాషగా ఉన్న ప్రాకృతంలో సాహిత్య సృజన జరిగిందని, కుంతల శాతకర్ణి పైశాచి భాషగా గుణాఢ్యుడు రచించిన బృహత్కథను ఈసడించుకొన్నాడని పేర్కొన్నారు. ఆ తర్వాత హాలుడి గాథాసప్తశతిలో తెలుగు పదాలు చాలా ఉన్నాయని చెప్పారు. వేములవాడ చాళుక్యుల కాలంలో తెలుగు రచనలు రాకున్నా పంపకవి జినేంద్రపురాణం రాశాడన్నారు. క్రీ.శ. 945లో కురిక్యాల శాసనంలో జినవల్లభుడి కందపద్యాలు లభించటం గర్వకారణమని చెప్పారు. నన్నయ్యకు వందేండ్ల ముందే సలక్షణంగా ఇక్కడ పద్య సృజన జరిగిందని తెలిపారు. అంతకుముందు క్రీ.శ. 935లోనే మల్లీయరేచన లక్షణ గ్రంథాన్ని రచించాడని చెప్పారు. పాల్కురికి సోమన తొలి పురాణం(బసవ పురాణం), తొలిశతకం (వృషాధిప శతకం), తొలి విజ్ఞాన సర్వస్వం (పండితారాధ్య చరిత్ర), తొలి ఉదాహరణం (బసవోదాహరణం) రచించాడని సోదాహరణంగా వివరించారు. భాగవతాన్ని తెలుగు వారికి అందించిన పోతనను తెలుగుమహాసభల్లో స్మరించుకోవడం సముచితమన్నారు.

విశ్వంభర చదువాలి:
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సీ నారాయణరెడ్డి విశ్వంభరను తప్పక చదువాలన్నారు. నేను పుట్టక ముందే / నెత్తిమీద నీలితెర / కాళ్ల కింద ధూళిపొర అంటూ సినారె జీవితసారాన్ని చెప్పారన్నారు. బురద నవ్వింది కమలాలుగా / పువ్వు నవ్వింది భ్రమరాలుగా లాంటి గొప్ప ప్రయోగాలు చేశారని గుర్తు చేశారు.

తెలంగాణ అమ్మ:
తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రజల మనిషి పుస్తకం గొప్ప ప్రభావం చూపిందన్నారు. మాగ్జింగోర్కి అమ్మ చూపిన ప్రభావం వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజల మనిషి చూపిందన్నారు.

తెలుగు జాతి జాగృతి:
తెలంగాణ సాహిత్య చరిత్రను ఎంపీ కవిత కళ్లకు కట్టినట్లు వివరించిందంటూ ప్రవాస తెలుగు రచయితలు అభిప్రాయపడ్డారు. ఈ పూర్తి పాఠాన్ని ప్రచురించి విదేశాల్లో ఉన్నవారికి అందించాలని కోరారు. ఈ సమావేశంలో తనికెళ్ల భరణి కవితను ఉద్దేశించి తెలంగాణ కవితలోన తేజస్సొకటున్నది – తెలుగుజాతి జాగృతమై జోహారంటున్నది అంటూ ప్రశంసించారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/native-telugu-delegates-from-42-countries-attended-1-2-562534.html