తెలుగుభాషకు పుట్టినిల్లు తెలంగాణ - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

తెలుగుభాషకు పుట్టినిల్లు తెలంగాణ

NandhiniSidhareddyతెలంగాణ తెలుగుభాషకు పుట్టినిల్లని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి వ్యాఖ్యానించారు. మహనీయుల నిరంతర స్ఫూర్తితో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశంతో తెలంగాణలో ప్రపంచ తెలుగు మహాసభలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన తెలుగు భాషాభిమానులకు అకాడమీ చైర్మన్ వినమ్రంగా స్వాగతాంజలి పలికారు. 42 దేశాల నుంచి, 15 రాష్ర్టాల నుంచి వచ్చిన 8వేల మంది ప్రతినిధులకు ప్రత్యేక ఏర్పాట్లుచేసినట్టు ఆయన స్వాగతోపన్యాసంలో పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల రూపకర్త సీఎం కేసీఆర్‌కు ఆత్మీయస్వాగతం పలికారు. మహాసభలను ప్రారంభిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఆయన అక్షరస్వాగతం పలికారు. ఉభయ రాష్ర్టాల గవర్నర్ నరసింహన్‌కు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుకు మంజులస్వాగతం పలికారు. పాల్కురికి సోమన ప్రాంగణానికి బమ్మెర పోతన వేదికకు తరలివచ్చిన భాషాభిమానులకు, పండితులకు హృద్యస్వాగతం పలికారు. సంతోషంతో సంబురంతో 31 జిల్లాల నుంచి కదలివచ్చిన తెలుగుభాషా పండితులకు, భాషాభిమానులకు, సమస్త తెలంగాణ ప్రజానీకానికి చైర్మన్ సంతోషస్వాగతం పలికారు. తంగేడుపూలను ముద్దకొప్పులో ముడిచి బంగారాన్ని వెక్కిరించావు నువ్వు.. అని తెలంగాణతల్లిని కీర్తిస్తూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య ఎన్ గోపి వచన కవితా పఠనం చేశారు. సభ ప్రారంభానికి ముందు కళాకృష్ణ శిష్య బృందం పేరిణి లాస్య ప్రదర్శనచేశారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/nandini-sidhareddy-started-welcome-speech-in-world-telugu-conference-1-2-562239.html