మహాసభల్లో మాట్లాడేది తెలంగాణ గురించే - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

మహాసభల్లో మాట్లాడేది తెలంగాణ గురించే

Telangana Sahithya Akademi Chairman Siddareddy Nandiniఉమ్మడి రాష్ట్రంలో తెలుగు జాతిని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సమ్యైకంగా ఉంచేందుకే రెండు సార్లు ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వహించారని.. ఇప్పుడు మాత్రం తెలుగువారంతా ‘సమానం’ అని చాటేందుకే తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నామని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి అన్నారు. ఈ సభల్లో తెలుగు వారందరికీ ఆతిథ్యం ఇచ్చి తెలంగాణ అంటే తెలుగు.. అనే అంశాన్ని చాటిచెబుతామన్నారు. ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా నందిని సిద్దారెడ్డితో ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూ.

ఉమ్మడి ఏపీలో నిర్వహించిన తెలుగు మహా సభలకు, తెలంగాణలో నిర్వహించే సభలకు తేడా ఏమిటి?
గతంలో 1975, 2012 సంవత్సరాల్లో ప్రపంచ తెలుగు మహా సభలు జరిగాయి. ఆ రెండు సభలూ తెలుగు జాతిని సమైక్యంగా ఉంచడం కోసం.. ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ కోసమే జరిగాయి. తెలుగు జాతి సమైక్యంగా ఉండాలంటే అసమానతలు ఉండొద్దు, వివక్షలు ఉండొద్దని ఇక్కడ ప్రత్యేక తెలంగాణ, ఏపీలో జై ఆంధ్రా ఉద్యమాలు జరిగాయి. అసమానతలు లేకుండా సమాన దృష్టితో చూస్తే ఈ పరిస్థితి ఉత్పన్నం అయ్యేది కాదు. పాలకుల అవసరాలరీత్యా ఇలా చాలా సార్లు జరిగింది. ఒక ప్రాంతాన్ని బాగా పట్టించుకోవడం, మరో ప్రాంతాన్ని పట్టించుకోకపోవడమే ఈ అసమానతలకు కారణం అని నేను అనుకుంటున్నా. ఈ అసమానతలు తగ్గించేందుకు 1969లో ఉద్యమం జరిగింది. మలిదశ ఉద్యమం 1996లో ప్రారంభం అయింది. మలిదశ ఉద్యమం పరాకాష్టకు చేరుకున్న క్రమంలోనే, ఉద్యమం నుంచి ఏపీని రక్షించడానికి 2012లో ప్రపంచ మహా సభలు తిరుపతిలో చేశారు. ఈ రెండు సభలూ ఆధిపత్యాన్ని కొనసాగించాలనే అంతర్లీన అర్థంతో జరిగాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ ఏర్పడింది. కొత్త రాష్ట్రంలో మొదటిసారి ఏర్పాటు చేసుకుంటున్నవి గనుక.. గతంలో నిర్వహించిన తెలుగు మహా సభలకు, డిసెంబర్‌ 15 నుంచి ప్రారంభమయ్యే సభలకు పొంతన ఉండదు. అందరం సమానమనే అంతరార్థంతో తెలంగాణలో ప్రపంచ తెలుగు సహా సభలు నిర్వహిస్తున్నాం. సమానత్వాన్ని కోల్పోయిన ఒక ప్రాంతం ఆత్మగౌరవంతో జరుపుకొంటున్న మహా సభలు ఇవి. ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకుంటున్న తెలుగు వారందరినీ ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో ప్రజాస్వామ్యవాదులు దాన్ని బలపరిచారు. సంఘీభావ కవిత్వం రాశారు. పాలకుల సంగతి పక్కనపెడితే.. మానవీయ కోణంలో ఆలోచించిన రచయితలు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించారు. కనుక వారు ఈ రోజు అదే స్ఫూర్తితో ఈ సభలకు రావడానికి అంగీకరించారు. అందుకే తెలుగు వాళ్లందరు ఎక్కడ ఉన్నా.. గౌరవించి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి.. వారిని ఘనంగా సత్కరించుకోవాలనే భావన ఉంది. వారికి గొప్ప సత్కారం చేస్తాం. తెలుగు భాష సుసంపన్నం కావాలంటే అన్ని ప్రాంతాల మాండలికాలు, ప్రజా వ్యవహారిక భాష, నానుడులు, పలుకుబడులు అన్నీ ఒక చోటుకు రావాల్సి ఉంది. ప్రపంచీకరణ ముందుకు వచ్చి ఆంగ్ల భాష పెత్తనం చెలాయిస్తున్న ఈ దశలో తెలుగు భాషా ప్రేమికులందరూ ఒక సోయితో ఏకం కావాలి. దాన్ని ఈ సభలు చాటి చెబుతాయి.

ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి స్పందన ఎలా ఉంది?
సభలకు వచ్చేందుకు ఇప్పటిదాకా 3600 మంది ప్రతినిధుల రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. విదేశాలలోని 56 మంది రచయితలు, కవులు, కళాకారులకు ఆహ్వాన పత్రాలు పంపాం. అందులో 48 మంది వస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్‌ 5 వరకు రిజిస్ట్రేషన్‌ గడువు ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వెయ్యి మంది వస్తారని అంచనా వేశాం. ఇప్పటి వరకూ 838 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ముగ్గురు జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీతలు కూడా వస్తున్నట్లు తెలిపారు. మారిషస్‌ ఉప రాష్ట్రపతి పరమశివమ్‌ పిళ్లై వస్తున్నారు. ఏపీ రచయితలకూ ఆహ్వానాలు వెళ్లాయి. కాళీపట్నం రామారావు, రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి, పెద్దిభొట్ల సుబ్బరామయ్య లాంటి ప్రముఖ రచయితలు వస్తామని లేఖలు రాశారు.

ఎవరెవరు వస్తున్నారు?
ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానిస్తున్నారు. మండలి బుద్ధప్రసాద్‌తో ఆత్మీయులైన వారు సంబాషిస్తున్నారు. కేంద్ర సాహిత్య సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలందరినీ ఆహ్వానించాం. విదేశాల విషయానికొస్తే.. తానా వాళ్లు వస్తామనే అంశాన్ని స్పష్టంగా చెప్పలేదు. ఆటా వాళ్లు వస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం నిర్వహిస్తున్న తెలుగు మహా సభలు ఇవి. కనుక కచ్చితంగా తెలంగాణ వారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కానీ అన్ని తెలుగు ప్రాంతాల నుంచి రచయితులు, ప్రతినిధులను ఆహ్వానించాం. ఏ ప్రాంతాన్నీ తక్కువ చేసే అలోచన లేదు.

సభల నిర్వహణకు ఎన్ని వేదికలు ఏర్పాటు చేస్తున్నారు? ఏయే అంశాలపై చర్చలు, సదస్సులు ఉంటాయి?
ఎల్పీ స్టేడియం ప్రధాన వేదికగా ఉంటుంది. ప్రారంభోత్సవం, ముగింపు రెండూ అక్కడే. తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య వేదికగా ఉంటుంది. అక్కడ పద్య, వచన, గేయ కవిత్వం, కథలు, నవల, విమర్శ, పరిశోధన మీద సదస్సులు ఉంటాయి. బాలల సాహిత్యంపై ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో 2 రోజులు కార్యక్రమాలుంటాయి. బాలల కవి సమ్మేళనం ఉంటుంది. మహిళలపై ఒక రోజు, ప్రవాస భారతీయుల తెలుగు భాష, సమస్యలు, ఇతర రాష్ట్రాల భాషలపై ఒక్కో రోజు సదస్సులుంటాయి. లలిత కళాతోరణంలో జానపద కళలలపై, రవీంద్ర భారతిలో శాస్త్రీయ కళలపై కార్యక్రమాలుంటాయి. రవీంద్రభారతి మినీహాల్‌లో మూడు రోజులు అష్టావధానాలు, కవి సమ్మేళనాలు ఐదు రోజులుం టాయి. తెలంగాణ సారస్వతిహాల్‌లో శతావధానం ఉంటుంది.

సన్నాహక సమావేశాలు ఏపీలో ఎందుకు నిర్వహించలేదు?
సన్నాహక సభలు ఐదు రాష్ట్రాలు, 15 దేశాల్లో జరిగాయి. శుక్రవారం నుంచి జిల్లాల్లో సన్నాహక సభలు జరుగుతున్నాయి. ఏపీలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయక పోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎక్కువ మంది తెలుగు మాట్లాడుకునే రాష్ట్రంలో ఎక్కువ సాహిత్య సంస్థలుంటాయి. ఎక్కువ మంది రచయితలుంటారు. వారి మధ్య అంతరాలు, స్పర్థలు ఉంటాయి. వీటిని మేం సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే మేం ఏపీలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయలేదు. అంతేగానీ మా అలసత్వం ఏమీ కాదు.
సభల్లో ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు
తెలంగాణ పదంలోనే తెలుగు ఉంది. తెలుగు భాష వర్థిల్లింది తెలంగాణలోనే. ఇక్కడ వికసించిన సాహిత్యాన్ని, వికాసానికి తోడ్పడిన ఇక్కడి రచయితలను ప్రధాన స్రవంతి తెలుగు చరిత్ర పట్టించుకోలేదు. ఇప్పుడు వాటిని చరిత్రకు ఎక్కించడం, ప్రపంచానికి చాటి చెప్పడమే ప్రపంచ తెలుగు మహా సభల లక్ష్యం. ‘తెలంగాణ గుండె నిండుగా తెలుగు పండుగ’ అనే నినాదంతో ముందుకెళుతున్నాం. అందరినీ ఆహానించి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత తప్పకుండా తెలంగాణ గురించే మాట్లాడుతాం. తెలంగాణ అంటే తెలుగు.. తెలుగు సాహిత్యం గురించి మాట్లాడతాం.

Source: http://www.andhrajyothy.com/artical?SID=500158