బహుభాషా ప్రావీణ్యుడు సామల - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

బహుభాషా ప్రావీణ్యుడు సామల

వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో జన్మించినా బహుభాషా వేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా విమర్శకులను సైతం మెప్పించగలిగారు సామల సదాశివమాస్టారు. తెలంగాణ ప్రాంత ఆచార వ్యవహారాలు, సాహిత్యంపై మాస్టారుకున్న జ్ఞానం అపారమైనది. తెలుగుభాష పరిమళాన్ని ఉర్దూ వారికి, ఉర్దూ నుడికారపు సొంపులను తెలుగువారికి అర్థమయ్యేలా రచనా నైపుణ్యాన్ని ప్రదర్శించిన రసజ్ఞ సవ్యశాచి. పలు అవార్డులు, ఎన్నో పురస్కారాలు అందుకొన్న సదాశివ మాస్టారును 2012లో కేంద్ర సాహితీ అవార్డు వరించింది. 60 ఏండ్లపాటు సాహిత్యరంగంలో సేవలందించిన సామల సదాశివ మాస్టారు.. సిర్పూర్ కాగజ్‌నగర్ మండలం తెనుగుపల్లెలో సామల నాగయ్య, చిన్నమ్మ దంపతులకు 1928 మే 11న జన్మించారు. ఎంఏ, బీఈడీ చేసిన ఆయన తొలుత ఉపాధ్యాయుడిగా, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా సేవలందించారు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, ఉర్ధూ, హిందీ, మరాఠీ, పార్షి భాషలను సైతం ఔపోసనం పట్టారు. మాస్టారు ఉర్దూలో రాసిన 300 వ్యాసాలు, తెలుగులో రాసిన 450 వ్యాసాలు వివిధ ప్రముఖ దిన, వార పత్రికల్లో ప్రచురితమయ్యాయి. బహుభాషావేత్తగా, మౌలిక సృజనాశక్తి సంపన్నునిగా పలువురు మన్ననలు అందుకొన్నారు. లోకాన్ని విడిచి వెళ్లినా.. మాస్టారు రచనలు ఆయనను సజీవంగానే ఉంచాయి. సదాశివ మాస్టారుకు 1998 డిసెంబర్ 15 పొట్టి శ్రీ రాములు విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టాను అందజేసింది. 2010లో కళారత్న పురస్కారాన్ని సైతం అందుకున్నారు. యాది రచన సాహితీ మాస్టారును సమున్నత శిఖరాల్లో నిలుపగా స్వరలయలు రచనకు 2011 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. సదాశివ మాస్టారు 84 ఏండ్ల వయస్సులో గుండెపోటుతో 2012 సంవత్సరం ఆగస్టు 7 ఆదిలాబాద్‌లోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
SAMALA

మాస్టారు రచనలు

స్వరలయలు, యాది, మలయమారుతాలు, అమ్జద్ రుబాయిలు, ప్రభాతము, సాంబశివ శతకము, మిర్జాగాలిబ్, శ్రీ సదాశివ, అపశృతి, కేశ వసూత్, పార్శ కవుల ప్రశస్తి, ఉర్దూ కవుల చరిత్ర, ఉర్దూ కవులు సామగ్రి, ఉర్దూ సాహిత్యం, అర్ణితోపాటు ఇతర రచనలు చేశారు.అమ్జద్ రుబాయిలను ఉర్దూ నుంచి తెలుగులోకి.. మౌలాన రూమిని పార్శి నుంచి తెలుగులోకి అనువాదించారు. కేశవ్‌సూత్ అనే గ్రంథాన్ని ఇంగ్లిషు నుంచి తెలుగులోకి అనువాదించారు.

పురస్కారాలు

-1964లో అమ్జద్ రుబాయిలుకు అనువాద రచనగా గుర్తింపు పురస్కారం
-1994లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం, 1998లో గౌరవ డాక్టరేట్, 2002 కేయూ డాక్టరేట్
– 2007లో తెలుగు భాష బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో పురస్కారం
– 2008లో ఆంధ్ర సారస్వత పరిషత్ నుంచి డాక్టర్ కే అంజిరెడ్డి ధర్మనిధి పురస్కారం
-2008లో మైసూర్ తెలుగు సంఘం, బెంగళూరు నుంచి ఆత్మీయ పురస్కారం, 2009లో సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ప్రతిభా పురస్కారం
-2009లో మడిపల్లి వీరయ్య సాహిత్య పురస్కారం
-2009లో జగద్గురు శంకరాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ గోపాలకృష్ణ మఠం నుంచి ఆత్మీయ పురస్కారం
-2011లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతికశాఖ నుంచి 2010 కళారత్న పురస్కారం
-2011లో కాళోజీ ఫౌండేషన్ హన్మకొండ నుంచి మొదటి కాళోజీ స్మారక పురస్కారం
-2012లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/multilingual-pravinyudu-samala-1-2-561963.html