మానవ విలువల చైతన్య వేదిక మరసం - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

మానవ విలువల చైతన్య వేదిక మరసం

అభ్యుదయ భావాలు కలిగిన కవులందరినీ ఒక వేదిక మీదికి తెచ్చి సాహిత్యాన్ని సుసంపన్నం చేయాలనే సంకల్పంతో మంజీరా రచయితల సంఘానికి రూపకల్పన చేశారు ప్రస్తుత తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి. 1986 జులై 20న మరసం మొట్టమొదటి సభ సిద్దిపేటలో జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లా పేరు వినగానే గుర్తుకు వచ్చేది మంజీర. మంజీరానది పరవళ్లలో పులకించిపోయిన పుడమితల్లి ఒడిలో పురుడు పోసుకున్న సాహిత్య సాంస్కృతిక కేతనం మంజీరా రచయితల సంఘం. మల్లినాథుని సాహిత్య గుబాళింపులోంచి మానవ విలువల సాహిత్య వికాసానికి విత్తనాలు చల్లిన సంఘం మరసం. పాయలుగా విడిపోయి పుడమితల్లిని పండించిన మంజీరా నదిలాగే శాఖలుగా విస్తరించిన మంజీర రచయితల సంఘం సాహిత్య వికాసానికి దారులు చూపుతూ 30 ఏండ్ల మైలురాయిని దాటుతున్నది. రాష్ట్ర, జాతీయస్థాయి సాహిత్యకారులను సైతం ఆకర్షింపజేసింది. 1986 సెప్టెంబర్ 28న అమరకవి దాశరథి చేతుల మీదుగా మెదక్ శాఖ ప్రారంభమైంది. జిల్లాస్థాయి సంస్థతో మొదలై రాష్ట్రస్థాయి సాహిత్య, సాంస్కృతిక సంస్థలకు దీటుగా పనిచేస్తున్నది. శాలువాలు, సన్మానాల తంతుని వెక్కిరించి జనమే మన ధ్యేయమని చాటిచెప్పింది. ఉమ్మడి జిల్లాలోని గుమ్మడిదల, జిన్నారం, కుకునూర్‌పల్లి, దుద్దెడ, రంగధాంపల్లి వంటి గ్రామీణ ప్రాంతాల్లో పటాన్‌చెరు, మెదక్, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక వంటి పట్టణ ప్రాంతాల్లో సాహిత్య సమావేశాలు, శిక్షణా తరగతులు చర్చాగోష్ఠులను నిర్వహించింది.

మరసం ప్రచురణలు
మరసం సాహిత్య సదస్సులు, పుస్తకాల ప్రచురణలకు పరిమితం కాకుండా సాంస్కృతికోద్యమాలను నిర్మించింది. పల్లెపల్లెను కదిలించిన క్రీయాశీల సంస్థగా మారింది. 1996లోనే తెలంగాణ మలివిడత ఉద్యమానికి పునాదులను పరిచింది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ ప్రజాకాంక్షను మాటలుగా, పాటలుగా, ఆటలుగా మార్మోగించటంలో మరసం నిర్వహించిన పాత్ర చరిత్రాత్మకం. ప్రజల గుండెల చప్పుళ్లను కవితా సంపుటాలుగా వెలువరించి తెలుగు సాహిత్య చరిత్రలో మరసం చెరగని ముద్రను వేసింది. డాక్టర్ నందిని సిధారెడ్డి భూమి స్వప్నం, సంభాషణ, ప్రాణహిత, ఒక బాధగాదు కవిత సంపుటాలు అన్నివర్గాల ప్రశంసలు అందుకున్నాయి. మహమూద్ పాషా ఉనికి, ఏలేశ్వరం నాగభూషణాచార్య నేల తడవని వాన, మోదుకూరి అశోక్‌కుమార్ సంతకం, పుప్పల రాజిరెడ్డి వరదగూడు, ఐలేని గిరి నెమలికన్ను, అలాజిపూర్ కిషన్ వడిసెల, కందుకూరి శ్రీరాములు వయోలిన్ రాగమో వసంత మేఘమో, దాసరాజు రామారావు గోరుకొయ్యలు, తైదల అంజయ్య పునాస కవితాసంపుటాలు మరసం సాహిత్య కృషికి గీటురాళ్లుగా నిలుస్తున్నాయి.

మరసం ఉద్యమాలు
అసమానతలు, అన్యాయాలు, దాడులు, దోపీడీలు, కుట్రలపై మరసం ఎన్నో ఉద్యమాలు చేపట్టింది. మనుషులను కబళిస్తున్న గుట్కాను వ్యతిరేకించింది. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ లో మరసం ర్యాలీలు, సభలు నిర్వహించింది. ప్రపంచీకరణ, గాట్ ఒప్పందాలు రైతాంగాన్ని దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తంచేస్తూ.. ర్యాలీలు, సభలు నిర్వహించింది. సినిమా, టీవీల్లో అశ్లీల సంస్కృతి వెల్లువను, మహిళలను కించపర్చేలా అందాల పోటీలను నిర్వహించడాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేపట్టింది.గజ్వేల్‌లో అశ్లీల సాహిత్యాన్ని తగులబెట్టింది. కరువు వల్ల బతుకుదెరువు బరువై ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న క్రమంలో రైతులారా..! ఆత్మహత్యలు చేసుకోవద్దని హితవు చెప్పుతూ సిద్దిపేట, గజ్వేల్ తదితర ప్రాంతాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించింది.

మరసం ప్రేరణతో తెరవే ఆవిర్భావం
తెలంగాణ ఉద్యమం ఉధృతమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కవుల్ని, రచయితల్ని, కళాకారుల్ని ఏకం చేయాలనే ఆలోచనకు మొట్టమొదటగా మరసం కార్యరూపాన్నిచ్చింది. తెలంగాణ ప్రాం తానికి చెందిన కవులు, రచయితలు, కళాకారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, తెలంగాణ రచయితల వేదిక ఏర్పాటు ఆవశ్యకతను చాటిచెప్పింది. అందరి అభిప్రాయాలకు కార్యరూపాన్నిచ్చి 2001 అక్టోబర్ 14న తెలంగాణ రచయితల వేదిక ప్రారంభించిన తర్వాత మొట్టమొదటి సభలను సిద్దిపేటలో ఏర్పాటు చేసింది. మరసం వ్యవస్థాపకుడు, ప్రస్తుత రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెరవేకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తెరవే ఇచ్చిన చైతన్యస్పూర్తితో సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ తెలంగాణ సాంస్కృతికోద్యమంలో కీలక పాత్ర నిర్వహిస్తున్నారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/marasam-platform-to-simulate-the-human-values-1-2-561875.html