అభినవ రాయలు కేసీఆర్ - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

అభినవ రాయలు కేసీఆర్!

Default post image

దేశం మారినా.. అమ్మ భాషను మరువలేదు. విదేశంలో పెరిగినా మమ్మీ, డాడీ వద్దని అమ్మా, నాన్నా ముద్దని అచ్చు తెలుగు పిలుపుల మధ్యే గడుపుతున్నారు. బిడ్డల పేర్ల నుంచి సంతకాల వరకు సాధ్యమైనంతవరకు తెలుగుకు ప్రాధాన్యం ఇస్తూ మాతృభాషను స్మరించుకుంటూ సేవ చేస్తున్నారు. ప్రపంచ తెలుగుమహా సభల నేపథ్యంలో మలేషియా నుంచి వేల కిలోమీటర్లు దాటి హైదరాబాద్‌కు వచ్చారు. తెలుగు భాషకు జరుగుతున్న పండుగలో భాగస్వాములైన ఆ మలేషియా బృందం సభ్యులు నమస్తే తెలంగాణతో తమ భావనలను పంచుకున్నారు. వారి మనోగతం వారి మాటల్లోనే..
RAMULU-SIMAMNCHALAM
మలేషియాలో తెలుగు నేర్పుతున్నాం
నేను ఇప్పటివరకు ఐదు తెలుగు సభలకు హాజరయ్యా. ఇది అద్భుతం. ఇంత ఘనంగా, అందరినీ సంతృప్తి పరిచేలా ప్రపంచ మహాసభలు నిర్వహించడం ఇదే తొలిసారి. సీఎం కేసీఆర్ స్వయంగా తెలుగు భాషాప్రియులు కాబట్టి ఇంత గొప్పగా సభలు నిర్వహిస్తున్నారు. మలేషియాలోని మనవారికి మన భాష నేర్పించాలనే ఉద్దేశంతో అక్కడ తెలుగు అకాడమీ ప్రారంభించాం.
– రాములు సిమంచలం, ప్రధాన ఉపాధ్యక్షుడు

సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు
తెలుగు వైభవానికి అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయలు కృషి చేశారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఆ బాధ్యత ఎత్తుకున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గురువుకు పాదాభివందనం చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. తెలుగు సంస్కారాన్ని ప్రపంచానికి చాటారు. సభల తొలిరోజు ఆయన చేసిన ప్రసంగం అద్భుతం. తెలుగు భాషాప్రేమికులందరికీ ఒక పెద్దన్నలాగా నిలిచారు.
– దత్తు డాక్టర్ అచ్చయ్యకుమార్‌రావు, మలేషియా తెలుగు సంఘం అధ్యక్షుడు

తెలంగాణ వంటలు అదరహో.. ఇన్ని రకాల తెలుగు వంటలు రుచి చూడటం ఇదే తొలిసారి. వంటలు అద్భుతం. ఇక్కడి వారి ప్రేమాప్యాయతలు మరచిపోలేను. అభివృద్ధిలో హైదరాబాద్ దూసుకుపోతున్నతీరు అమోఘం. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, మలేషియా తెలుగు సంఘం నిర్వహిస్తున్న తెలుగు కోర్సులో తెలుగు నేర్చుకుంటున్నాను. నగరాన్ని విడిచి వెళ్లాలని లేదు.
– దయా శ్రీరేఖ, మలేషియా ప్రతినిధి

ఉద్యోగం కావాలంటే మలయ్ తప్పనిసరి
మలేషియాలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే స్థానిక భాషైన మలయ్ కచ్చితంగా మాట్లాడాలి, రాయాలి. మేము తెలుగు పండుగలను ఘనంగా నిర్వహించుకుంటాం. మలేషియాలో ఐదు లక్షల మంది తెలుగువారు ఉన్నారు. అక్కడివారికి తెలుగు నేర్పించాలనే ఉద్దేశంతో మలేషియా తెలుగు అకాడమీ ప్రారంభించాం. వచ్చే ఏడాది 350 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తాం.
– వెంకట రామానాయుడు, సంఘం సభ్యుడు

సభ ఏర్పాట్లు అద్భుతం
మాకు ఇంత గొప్పగా ఆతిథ్యం లభిస్తుందనుకోలేదు. హైదరాబాద్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి మమ్మల్ని గౌవరంగా చూసుకుంటున్నారు. పిల్లలతో సహా మొత్తం వంద మందిమి తెలుగు సభల కోసం వచ్చాం. భోజనాలు చాలా బాగున్నాయి. ఇక్కడి పోలీసులు స్నేహపూర్వకంగా ఉన్నారు. మన మాతృభాష పండుగ జరుగుతుంటే తప్పనిసరిగా హాజరవుతాం.
– డాక్టర్ వెంకటప్రతాప్, మలేషియా ప్రతినిధి

తొలిసారి హైదరాబాద్ వచ్చాం
నేను తొలిసారి హైదరాబాద్ వచ్చాను. మలేషియాలో ఉన్న తెలుగువారందరూ మన భాషను ప్రేమిస్తారు. ప్రతి గురువారం పిల్లలను తెలుగు తరగతులకు పంపిస్తాం. దాదాపు ఎవరూ మమ్మీ, డాడీ అని పిలువరు. అమ్మా, నాన్న అనే పిలుస్తారు. మలేషియాలో పుట్టి పెరిగిన నాలుగో తరానికి చెందిన వాళ్లం మేము. తెలుగు భాషను మా పిల్లలకు అందిస్తాం.
– గౌరీ, మలేషియా ప్రతినిధి

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/malaysian-team-who-attended-the-sessions-praised-1-2-562373.html