ప్రధాన ఆకర్షణగా వేయిస్థంభాల వేదిక - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

ప్రధాన ఆకర్షణగా వేయిస్థంభాల వేదిక

ఎల్బీ స్టేడియంలో తెలుగుమహాసభల ప్రధాన వేదిక సిద్ధమవుతున్నది. రూపశిల్పి సీవీ అంబాజీ సారథ్యంలో ప్రధాన వేదిక నిర్మాణం జరుగుతున్నది. మహాసభల ప్రారంభ వేదికను చాళుక్య, కాకతీయ కాలంనాటి శిల్పకళా సౌందర్యం, తెలంగాణ సాంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మిస్తున్నానంటున్న అంబాజీ తన అనుభవాలను నమస్తే తెలంగాణకు వివరించారు. మా పూర్వీకులది మెదక్ జిల్లా. అమ్మది సందాయిపేట, నాన్నది ఒట్టూరు. వాళ్లు వివాహానంతరం షోలాపూర్ చేరుకున్నారు. నేను అయిదో తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. తెలుగు మహాసభల కోసం పిలువడం అదృష్టంగా భావిస్తున్నాను. గతంలో తిరుపతిలో జరిగిన మహాసభలకు వేదిక నిర్మించానని తెలిపారు. ఈ వేదిక తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. వేదికపై ప్రధాన ఆకర్షణగా కాకతీయ తోరణం ఉంటుంది. వేదిక వెనుకవైపున ఉండే కాకతీయ తోరణం తెలంగాణ శిల్పకళా వైభవానికి చిహ్నమని వివరించారు. కాకతీయ కళాతోరణం 92 అడుగుల వెడల్పు, 36 అడుగుల ఎత్తులో నిర్మిస్తామని.. కాకతీయ తోరణం మధ్యలో 40 అడుగుల పొడవులో ఓ తాళపత్రం ఉంటుంది. దానిపై ప్రపంచ తెలుగు మహాసభలు 2017 అని రాసి ఉంటుంది. దానికి దిగువన హిందీ, ఇంగ్లిషులో రాసి ఉంటుంది. తాళపత్రంపైన 56 నక్షత్రాలుంటాయి. ప్రతి నక్షత్రంలో ఓ వర్ణం ఉంటుంది. ఇలా తెలుగు వర్ణమాల మెరుస్తూ, సభికులను అలరిస్తుంది. కళాతోరణంపై పది అడుగుల పొడవున ఉండే దోసిలి బతుకమ్మ పూలతో అతిథులకు స్వాగతం పలుకుతుంది. వేదికపైభాగంలో రెండువైపులా పాలపిట్టలుంటాయి. వేదిక ముందుభాగంలో ఇరువైపులా బతుకమ్మను కొలువుదీరుస్తాం. కాకతీయ కళాతోరణం, దానికి ఇరువైపులా వున్న శిల్పకుఢ్యానికి ముందుభాగంలో ప్రముఖులు ఆసీనులై ఉంటారు. వారికి ముందు ఇరువైపులా రెండు ఏనుగులుంటాయి.
Default post image
వేయిస్థంభాల గుడిలోని శిల్పకళ ఆధారంగా ఈ ఏనుగులను రూపొందిస్తున్నామని వివరించారు. ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ వేదిక ఎల్బీ స్టేడియంలో నిర్మాణపనులు వేగం పుంజుకున్నాయి. తెలుగుమహాసభల ప్రారంభ వేడుక నిర్వహించే వేదిక నిర్మాణంలో వందమందికిపైగా కార్మికులు రేయింబవళ్లు పనిచేస్తున్నారు. ఎల్బీ స్టేడియం సుందరీకరణ, తెలుగు మహాసభల ప్రతినిధులకు వసతుల కల్పనతోపాటు పుస్తక, హస్తకళ, తెలంగాణ వంటలు మొదలైన ప్రదర్శనల కోసం ఏర్పాట్లుచేస్తున్నారు. ఎల్బీ స్టేడియం దీపాలంకరణ కోసం లారీల్లో విద్యుద్దీపాలు, విద్యుత్ సామాగ్రిని తరలిస్తున్నారు. పాత్రికేయుల కోసం ఇండోర్ స్టేడియం సమీపంలో మీడియా కేంద్రాన్ని ఏర్పాటుచేశారు.

Source: https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/main-attraction-is-thousand-pillar-stage-1-2-561877.html