మహాసభలకు అంతా సన్నద్ధం - World Telugu Conferences 2017

మన తెలంగాణం - తెలుగు మాగాణం

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

తెలంగాణ ప్రభుత్వం

TSA logo WTC logo

మహాసభలకు అంతా సన్నద్ధం

cmkcr with governor
ప్రపంచ తెలుగు మహాసభలకు అంతా సిద్ధమైందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే మహాసభలను చిరస్మరణీయ రీతిలో నిర్వహిస్తామన్నారు. మంగళవారం రాత్రి సీఎం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. తెలగు మహాసభలకు ఆహ్వానిస్తూ పత్రికను, కరదీపికను గవర్నర్‌కు అందచేేశారు. ఎంపీ కేశవరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న మహాసభలకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, గురువారం వరకు పూర్తవుతాయన్నారు. తెలంగాణతో పాటు దేశవిదేశాల నుంచి వేయి మందికి పైగా కవులు, మూడు వేల మందికి పైగా రచయితలు, చరిత్రకారులు, మరో ఆరు వేల మంది సాహిత్య, భాషాభిమానులు హాజరవుతున్నారని, వారికి చక్కటి ఆతిథ్యాన్ని అందిస్తామన్నారు. మహాసభల సందర్భంగా అయిదు రోజులు నిర్వహించే సాహిత్య సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలకు కుటుంబ సమేతంగా హాజరు కావాలని సీఎం గవర్నర్‌ను కోరారు. మహాసభల నిర్వహణపై గవర్నర్‌ పలు సూచనలు చేయగా, ఆచరిస్తామని సీఎం తెలిపారు.

550 ప్రత్యేక బస్సులు
ప్రపంచ తెలుగు మహాసభలకు అన్ని జిల్లాల ప్రజలు హాజరయ్యేందుకు 550 ప్రత్యేక బస్సులను కేటాయించాలని రవాణాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ దీనిపై రవాణా, పోలీసు, విద్యాశాఖల అధికారులతో చర్చించి, బస్సుల రాకపోకల ప్రణాళికను తయారు చేశారు. హైదరాబాద్‌కు సిద్దిపేట, వరంగల్‌ గ్రామీణ, నగర జిల్లాలు, కరీంనగర్‌ నుంచి 30 చొప్పున బస్సులు, సంగారెడ్డి, యాదాద్రి, మెదక్‌, జనగామ, నల్గొండ, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లాల నుంచి 20 చొప్పున బస్సులు, కామారెడ్డి 15, వికారాబాద్‌, ఖమ్మం నుంచి పదేసి బస్సులను, మిగిలిన జిల్లాల నుంచి అయిదేసి బస్సులను నడిపిస్తారు. స్థానిక పోలీసు యంత్రాంగం, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనర్ల సమన్వయంతో పర్యవేక్షణ ఏర్పాట్లు చేస్తారు. జిల్లాల నుంచి బస్సులు నడిపించేందుకు వీలుగా సమన్వయాధికారులను నియమిస్తారు.